సాక్షి, హైదరాబాద్: దాదాపు నెల రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను బుధవారం మధ్యాహ్నానికి 884.4 అడుగుల మేర నీటిమట్టం ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుకాగా.. 211.96 టీఎంసీలకు నిల్వ చేరుకుంది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇక వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలే అవకాశం ఉండటంతో.. ఆ నీరంతా నాగార్జునసాగర్‌కు చేరనుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 70 వేల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది.
పరీవాహకంలో విస్తారంగా వర్షాలు
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 129.7 టీఎంసీలకు గానూ 128.19 టీఎంసీల మేర నీరు ఉంది. దానికి దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయం కూడా పూర్తిగా నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు భారీగా 91,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడి నుంచి 88,727 క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. ఇక తుంగభద్ర పోటెత్తడంతో సుంకేశుల బ్యారేజీ నుంచి 40 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. వీటికి హంద్రీ వరద తోడవడంతో.. మొత్తంగా శ్రీశైలం జలాశయంలోకి 1,51,590 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
నేడు శ్రీశైలం గేట్ల ఎత్తివేత..
విద్యుదుత్పత్తికి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ 32,021 క్యూసెక్కులు, తెలంగాణ 42,378 క్యూసెక్కులను వినియోగించుకుంటున్నాయి. దీంతోపాటు ఏపీ హంద్రీనీవాకు 1,345 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కులు తరలిస్తుండగా.. తెలంగాణ కల్వకుర్తికి 1,600 క్యూసెక్కుల నీటిని తీసుకుంటోంది. మొత్తంగా ప్రస్తుత సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు 282 టీఎంసీల కొత్త నీరు వచ్చినట్లుగా నీటి పారుదల రికార్డులు చెబుతున్నాయి. శ్రీశైలం నిండుకుండలా మారడం, ప్రవాహాలు కొనసాగుతుండటంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశముంది. గురువారం ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కులను దిగువకు వదిలే అవకాశం ఉందని తెలంగాణ నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం సాగర్‌కు ఎగువ నుంచి 54,293 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 161.20 టీఎంసీల నిల్వ ఉంది.
నిండుకుండలా శ్రీశైలం
Published Thu, Oct 12 2017 2:40 AM | Last Updated on Thu, Oct 12 2017 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment