ఆల్మట్టి ఎత్తు పెంపు తప్పనిసరి
- భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్
- నీటి కేటాయింపులపై సుప్రీం కోర్టులో సమర్థ వాదనలు వినిపిస్తాం
- ఐదు మీటర్ల ఎత్తు పెంపుతో 92 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన
- 94,640 ఎకరాల భూమి ముంపు
- 20 గ్రామాలకు పునరావాసం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అనివార్యమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. శాసనమండలిలో బుధవారం ప్రశోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు అశ్వత్థనారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ఆల్మట్టి డ్యాం ఎత్తును ప్రస్తుత 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల రోజూ అదనంగా 92 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు.
ఎగువకృష్ణా పథకం కింద ఎత్తును పెంచే దశలో 20 గ్రామాలను తరలించి, పునరావాసం కల్పించాలనుకున్నట్లు చెప్పారు. బ్యాక్ వాటర్ వల్ల బీజాపుర, బాగలకోటె జిల్లాల్లోని గ్రామాలతో పాటు 94,640 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తేల్చి చెప్పారు. బాగలకోటె పట్టణం కూడా పాక్షికంగా ముంపునకు గురవుతుందన్నారు. పునరావాస కేంద్రాల నిర్మాణానికి 43 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు.
ఎత్తును పెంచడం వల్ల అవసరమయ్యే అదనపు నీటి కేటాయింపులను సుప్రీం కోర్టులో సమర్థ వాదనలను వినిపించడం ద్వారా పొందగలుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ గతంలో జారీ చేసిన ఆదేశాలను స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టులో సవాలు చేసినట్లు ఆయన తెలిపారు.