MB Patil
-
ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. ‘బీజేపీలో చేరితే రూ. 50కోట్లు’!
Operation Kamala.. గోవాలో రాజకీయం సంచలనంగా మారింది. అధికార బీజేపీలో కాంగ్రెస్ నేతలు చేరుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. బీజేపీతో టచ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి ఈ నేపథ్యంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవాలో కాంగ్రెస్ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ నేతకు.. కాషాయ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. ఒక్క గోవాలోనే కాదు.. ప్రతీ రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని అన్నారు. కానీ, కర్నాటకలో మాత్రం అలా సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరే చాన్స్ లేదన్నారు. బీజేపీ, జేడీఎస్ నేతలే కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే రూ. 40 నుంచి 50 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. కర్నాటక బీజేపీ నేత సీటీ రవి గత నెలలో మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గోవాలో ఎన్డీయే సర్కార్ బలం 30కి చేరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ.. తాజాగా కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం గోవాలో ఎన్డీయేకు 25 సీట్లు ఉన్నాయి. యూపీఏకు 12 సీట్లు ఉన్నాయి. By offering Rs 50 Crores for each MLA...they (BJP) are not believing in democracy. Not only in Goa, everywhere they do Operation Kamala. They will offer money, they will purchase MLAs: Siddaramaiah, Congress leader "No, it's not possible in Karnataka," he says. pic.twitter.com/ssMHQiW9dT — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: భారతావనికి సెల్యూట్.. రోమాలు నిక్కబొడిచేలా నాలుగు సింహాల చిహ్నం -
మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీలోకి వెళ్లరు!
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోలి, సుధాకర్ బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణను ఆయన నివాసంలో కలిశారు. దీంతో వీరు బీజేపీలోకి వెళుతారన్న ప్రచారం ఊపందుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 28 సీట్లకుగాను 25 సీట్లు బీజేపీ గెలుచుకోగా, కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ పరాభవం నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇది సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరు తెచ్చే అవకాశముందని కథనాలు వస్తుండగా.. వాటిని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ కొట్టిపారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లబోరని ఆయన పేర్కొన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గతంలో ప్రయత్నించిందని, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుందని, అయినా, తమ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితీరుతుందని ఎంబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా.. ఇది రాజకీయ భేటీ కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించేందుకు మాత్రమే వచ్చామని చెప్పుకొచ్చారు. -
అదే నంబర్ రవికి ఎలా వచ్చింది ?
యశవంతపుర : ప్రముఖ రౌడీ, సైకిల్ రవితో ప్రముఖు సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణలో మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఎంబీ పాటిల్‌కు సంబంధాలు ఉన్నట్లు సీసీబీ పోలీసుల విచారణలో బయటపడింది. ఎంబీ పాటిల్ మంత్రిగా ఉన్నప్పుడే రౌడీ రవినే మంత్రికి 24 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలు లభించాయి. ఈ సందర్భంగా నిందితుడు ఉపయోగించిన 11 ఫోన్లతో పాటు 38 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సిమ్ నంబర్ ద్వారా మాత్రమే ఎంబీ పాటిల్‌కు ఫోన్ చేసినట్లు తెలిసింది. రవి ఉపయోగించిన సిమ్‌కార్డు మండ్యకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సచ్చిదానంద పేరుతో ఉంది. అదే నంబర్ రవికి ఏలా వచ్చిందో పోలీసులకు అర్థం కావటంలేదు. 2009 నుండి తానే ఉపయోగిస్తున్నట్లు సచ్చిదానంద చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదే నంబర్‌ను రవి ఉపయోగించి ఉండవచ్చని సీసీబీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టనుండటంతో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు చిత్ర రంగ ప్రముఖల్లో భయం నెలకొంది. రవి ఎవరో నాకు తెలియదు : మాజీ మంత్రి ఎంబీ పాటిల్ రవి ఏవరో తనకు తెలిదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో వెల్లడించిన నెంబర్ తనదేనని, తన వాట్సాప్ నెంబర్ కూడా అదేనన్నారు. అయితే రవి అనే వ్యక్తితో తనకు ఎప్పుడు పరిచయం లేదని, అతడిని ఒక్కసారి కూడా చూడలేదన్నారు. -
ట్విటర్లో మంత్రి ఆశ్చర్యకర ప్రకటన
సాక్షి, బెంగళూరు : తనపై త్వరలోనే ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారంటూ కర్ణాటక మంత్రి ఒకరు ట్విటర్లో ఆశ్చర్యకర ప్రకటన చేశారు. బీజేపీని విమర్శించడం వల్లే అది జరగబోతోందంటూ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత సదరు వ్యక్తి స్పందించడం జరుగుతుంటుంది. కానీ, అధికారంలో ఉన్న ఓ మంత్రి తనపై రైడింగ్ జరగకమునుపే జరుగుతుందని ముందే చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. విమర్శలు కురిపించుకుంటున్నాయి. వీలయినంత మేరకు తమ ప్రత్యర్థిని కార్నర్ చేసేలా, ప్రజల సానుభూతి చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కర్ణాటక నీటివనరుల శాఖా మంత్రి ఎంబీ పాటిల్ ట్విటర్ వేదికగా పరోక్షంగా బీజేపీని లక్ష్యం చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైతే బీజేపీ అనుసరిస్తున్న విధానాలను, వైఖరిని నిలదీస్తారో వారిని ఆ పార్టీ పెద్దలు టార్గెట్ చేసుకుంటారు. కేంద్రంలోని అత్యున్నత సంస్థలతో ప్రతి దాడి చేస్తారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నా ఇంటిపై దాడులు నిర్వహిస్తారని అంచనా వేస్తున్నాను' అని ఎంబీ పాటిల్ చెప్పారు. -
మాకే నీళ్లు లేవు!
సాక్షి, చెన్నై : తమకే నీళ్లు లేవు అని, కావేరిని తమిళనాడుకు విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక నీటి పారుదల శాఖ మత్రి ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. సంబా పంట ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, తదితర డెల్టా జిల్లాల్లో సాగు కావేరి నీటి రాక మీదే ఆధార పడి ఉన్న విషయం తెలిసిందే. కావేరి ట్రిబ్యునల్ ఒప్పందాల మేరకు క్రమం తప్పకుండా నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా నీటి విడుదలలో సాగుతున్న వివాదం డెల్టా అన్నదాతల్ని కన్నీటి మడుగులో ముంచింది. లక్షలాది ఎకరాల్లో సాగుబడి ఒకప్పుడు జరిగితే, ప్రస్తుతం గణనీయంగా సాగుబడి తగ్గుతోంది. ఇందుకు కారణం కావేరి జలాలు సకాలంలో అందకపోవడమే. ప్రస్తుతం కొన్ని లక్షల ఎకరాల్లో సంబా సాగుబడి సాగుతూ వస్తున్నది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కొంత మేరకు సాగుబడి మీద దృష్టిపెట్టారు. అయితే, సంబా చేతికి రావాలంటే, మరింతగా నీళ్లు తప్పనిసరి కానున్నాయి. ఈ దృష్ట్యా, తమిళనాడుకు వాటాగా ఇవ్వాల్సిన నీటిని విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్ చేసే పనిలో పాలకులు నిమగ్నమయ్యారు. అయితే, పాలకుల పిలుపునకు కర్ణాటకలో స్పందించే వాళ్లు లేరని చెప్పవచ్చు. దీంతో కావేరి కోసం అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వారం రోజులుగా డెల్టాలో కావేరి జాలల నినాదం మార్మోగుతోంది. అన్నదాతలు ఆందోళనలు సాగిస్తూ రావడంతో సీఎం పళనిస్వామి మేల్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీకి సిద్ధపడ్డారు. అయితే, ఈపర్యటన ఎప్పుడు సాగుతోందోనన్న ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నీళ్లు లేనే లేవంటూ ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి స్పష్టం చేయడం గమనార్హం. నీళ్లు లేవు: తమకే నీళ్లు లేవు అని, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి విడుదల చేయాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పటిల్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి వస్తే, ఆయన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్లి, తమ రాష్ట్రంలో నీటి కోసం పడుతున్న పాట్లు, కావేరిలో పరిస్థితి గురించి వివరిస్తామని వ్యాఖ్యానించారు. అంతేగానీ, తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని,అస్సలు నీళ్లే లేవని ఆయన స్పందించడం డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. గతంలో వలే ఈ సారి కూడా సంబాను కోల్పోవాల్సిందేనా అన్న వేదనలో మునిగారు. అసలే అప్పుల ఊబిలో ఉన్న తమకు ఇక, ఆత్మహత్యలే శరణ్యం అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ పేర్కొంటూ, తమిళ అన్నదాతల్ని ఆదుకునే రీతిలో కర్ణాటక నీటిని విడుదల చేయాలని కోరారు. అసలే రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, పరిస్థితి మరో రకంగా మారేలోపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధ పడాలని విజ్ఞప్తి చేశారు. -
15 టీఎంసీలు విడుదల చేయండి
కర్ణాటక జల వనరుల మంత్రికి హరీశ్ లేఖ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల తాగునీటి అవస రాల నిమిత్తం ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు.. కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం పాటిల్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తిగా నీటి మట్టాలు పడిపోవడం,ప్రస్తుతమున్న నిల్వలు మరో పది రోజులకు మించి సరిపోవన్న ఆందోళన నేప థ్యంలో ఈ లేఖకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తు తం నాగార్జునసాగర్ పరిధిలోని పుట్టంగండి నుంచి హైదరాబాద్, నల్లగొండలకు నీటి సరఫరా చేస్తున్నామని, ఇక్కడ కనీస నీటి మట్టం 510 అడుగులకు గానూ ప్రస్తుతం 500.50 అడుగులకు చేరిందని హరీశ్ పేర్కొన్నారు. సాగర్‌కు ఎలాంటి ప్రవాహాలు లేనం దున నీటి సమస్య తీవ్రమవుతోం దన్నారు. ఈ దృష్ట్యా, నారాయ ణపూర్ నుంచి తక్షణమే 15టీఎంసీలు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాల్వలకు కొనసాగుతున్న విడుదల... కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నా దిగువకు చుక్క వదలడం లేదు. వచ్చింది వచ్చినట్లు కాల్వలకే వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు గానూ 128 టీఎంసీల నిల్వలున్నాయి. 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వెయ్యి క్యూసెక్కులు కాల్వ లకు, మరో 5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారా యణపూర్‌లో 37టీఎంసీలకు 36టీఎంసీలుండగా, 4,770 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అయినా చుక్క కూడా వదలక పోవడంతో జూరాలకు ప్రవాహాలు తగ్గుతున్నాయి. -
మంత్రి సోదరి ఇంట్లో దొంగల బీభత్సం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం వేకువజామున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ సహోదరి కల్పనాపాటిల్ ఇంటిలోకి ప్రవేశించిన 15 మంది దుండగులు నలుగురిని తాళ్లతో బంధించి 300 గ్రాముల బంగారు నగలు, రూ.8 లక్షల విలువైన వజ్రం, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. విజయపుర శాంతినికేతన కాలనీలో కల్పనాపాటిల్ నివాసముంటున్నారు. గురువారం వేకువజామున 2 గంటల సమయంలో ఇంట్లో వారంతా గాఢనిద్రలో ఉండగా దుండగులు తలుపు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. మారణాయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న కల్పనాపాటిల్, మరో ముగ్గురిని తాళ్లతో బంధించారు. కేకలు వేయకుండా నోటిలో దుస్తులు కుక్కారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు నగలు, వజ్రం, నగదును దోచుకుని ఉడాయించారు. కొద్దిసేపటి అనంతరం బాధితులు కట్టు విడిపించుకొని విజయపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. -
ఆల్మట్టి ఎత్తు పెంపు తప్పనిసరి
భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ నీటి కేటాయింపులపై సుప్రీం కోర్టులో సమర్థ వాదనలు వినిపిస్తాం ఐదు మీటర్ల ఎత్తు పెంపుతో 92 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన 94,640 ఎకరాల భూమి ముంపు 20 గ్రామాలకు పునరావాసం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజాపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అనివార్యమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. శాసనమండలిలో బుధవారం ప్రశోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు అశ్వత్థనారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ఆల్మట్టి డ్యాం ఎత్తును ప్రస్తుత 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల రోజూ అదనంగా 92 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. ఎగువకృష్ణా పథకం కింద ఎత్తును పెంచే దశలో 20 గ్రామాలను తరలించి, పునరావాసం కల్పించాలనుకున్నట్లు చెప్పారు. బ్యాక్ వాటర్ వల్ల బీజాపుర, బాగలకోటె జిల్లాల్లోని గ్రామాలతో పాటు 94,640 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తేల్చి చెప్పారు. బాగలకోటె పట్టణం కూడా పాక్షికంగా ముంపునకు గురవుతుందన్నారు. పునరావాస కేంద్రాల నిర్మాణానికి 43 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. ఎత్తును పెంచడం వల్ల అవసరమయ్యే అదనపు నీటి కేటాయింపులను సుప్రీం కోర్టులో సమర్థ వాదనలను వినిపించడం ద్వారా పొందగలుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ గతంలో జారీ చేసిన ఆదేశాలను స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టులో సవాలు చేసినట్లు ఆయన తెలిపారు. -
కావేరి నీటిలో తమిళనాడు వాటా ఇప్పటికే వదిలాం
మంత్రి ఎంబీ.పాటిల్ దావణగెరె, న్యూస్‌లైన్ : తమిళనాడు వాటా కావేరి నీటిని ఇప్పటికే కర్ణాటక విడుదల చేసిందని, ఈ ఏడాదిలో మళ్లీ నీరు వదలడం సాధ్యం కాదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్గదర్శనం మేరకు ఏటా తమిళనాడుకు కర్ణాటక 192 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రం బిళిగుండ్లు వద్ద ఉన్న నీటిమాపన కేంద్రం నుంచి 220 టీఎంసీల నీరు విడుదల చేసినందున ఈ ఏడాది తమిళనాడు వాటా కన్నా ఎక్కువ నీటినే వదిలామన్నారు. అందువల్ల తమిళనాడుకు మళ్లీ నీరు విడుదల చేసే ్రపసక్తే లేదని స్పష్టం చేశారు. జలవనరుల శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఇంజనీర్లు, 500 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 200 మంది ఇంజనీర్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంకా 500 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆర్థిక శాఖ అనుమతించాయన్నారు. ఇంకా 700 నుంచి 800 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నీటిపారుదల పథకాల అమలుకు చాలా సమస్యలున్నాయన్నారు. ఈ విషయంపై డిసెంబర్లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసి తుది తీర్పు వెలువడనుందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులతో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొంటామన్నారు. బాగల్‌కోట, బీజాపూర్ జిల్లాల్లో నీటిపారుదల పథకాలు కల్పించే ఉద్దేశంతో 1.20 లక్షల హెక్టార్ల భూమిని స్వాధీన పరచుకునే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలోని 22 చెరువులకు నీరు నింపే ఎత్తిపోతల పథకాలను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రయోగాత్మకంగా చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఏటా రూ.10 వేల కోట్లతో నీటిపారుదల పథకాల పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో పనులు చేపడతామన్నారు. అప్పర్‌కృష్ణా, ఎత్తినహొళె, మల్లాబాద్ పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 8 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నీటిపారుదల శాఖ మేనేజింగ్ డెరైక్టర్ రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.