
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోలి, సుధాకర్ బీజేపీ నాయకుడు ఎస్‌ఎం కృష్ణను ఆయన నివాసంలో కలిశారు. దీంతో వీరు బీజేపీలోకి వెళుతారన్న ప్రచారం ఊపందుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 28 సీట్లకుగాను 25 సీట్లు బీజేపీ గెలుచుకోగా, కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ పరాభవం నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
ఇది సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరు తెచ్చే అవకాశముందని కథనాలు వస్తుండగా.. వాటిని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ కొట్టిపారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలోకి వెళ్లబోరని ఆయన పేర్కొన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గతంలో ప్రయత్నించిందని, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుందని, అయినా, తమ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితీరుతుందని ఎంబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌ఎం కృష్ణను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా.. ఇది రాజకీయ భేటీ కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించేందుకు మాత్రమే వచ్చామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment