మంత్రి సోదరి ఇంట్లో దొంగల బీభత్సం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం వేకువజామున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ సహోదరి కల్పనాపాటిల్ ఇంటిలోకి ప్రవేశించిన 15 మంది దుండగులు నలుగురిని తాళ్లతో బంధించి 300 గ్రాముల బంగారు నగలు, రూ.8 లక్షల విలువైన వజ్రం, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. విజయపుర శాంతినికేతన కాలనీలో కల్పనాపాటిల్ నివాసముంటున్నారు.
గురువారం వేకువజామున 2 గంటల సమయంలో ఇంట్లో వారంతా గాఢనిద్రలో ఉండగా దుండగులు తలుపు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. మారణాయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న కల్పనాపాటిల్, మరో ముగ్గురిని తాళ్లతో బంధించారు. కేకలు వేయకుండా నోటిలో దుస్తులు కుక్కారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు నగలు, వజ్రం, నగదును దోచుకుని ఉడాయించారు. కొద్దిసేపటి అనంతరం బాధితులు కట్టు విడిపించుకొని విజయపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.