
సాక్షి, బెంగళూరు : తనపై త్వరలోనే ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారంటూ కర్ణాటక మంత్రి ఒకరు ట్విటర్‌లో ఆశ్చర్యకర ప్రకటన చేశారు. బీజేపీని విమర్శించడం వల్లే అది జరగబోతోందంటూ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత సదరు వ్యక్తి స్పందించడం జరుగుతుంటుంది. కానీ, అధికారంలో ఉన్న ఓ మంత్రి తనపై రైడింగ్ జరగకమునుపే జరుగుతుందని ముందే చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
వివరాల్లోకి వెళితే.. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. విమర్శలు కురిపించుకుంటున్నాయి. వీలయినంత మేరకు తమ ప్రత్యర్థిని కార్నర్ చేసేలా, ప్రజల సానుభూతి చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కర్ణాటక నీటివనరుల శాఖా మంత్రి ఎంబీ పాటిల్ ట్విటర్ వేదికగా పరోక్షంగా బీజేపీని లక్ష్యం చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైతే బీజేపీ అనుసరిస్తున్న విధానాలను, వైఖరిని నిలదీస్తారో వారిని ఆ పార్టీ పెద్దలు టార్గెట్ చేసుకుంటారు. కేంద్రంలోని అత్యున్నత సంస్థలతో ప్రతి దాడి చేస్తారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నా ఇంటిపై దాడులు నిర్వహిస్తారని అంచనా వేస్తున్నాను' అని ఎంబీ పాటిల్ చెప్పారు.