సాక్షి, చెన్నై : తమకే నీళ్లు లేవు అని, కావేరిని తమిళనాడుకు విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక నీటి పారుదల శాఖ మత్రి ఎంబీ పాటిల్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. సంబా పంట ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తిరుచ్చి, తదితర డెల్టా జిల్లాల్లో సాగు కావేరి నీటి రాక మీదే ఆధార పడి ఉన్న విషయం తెలిసిందే. కావేరి ట్రిబ్యునల్ ఒప్పందాల మేరకు క్రమం తప్పకుండా నీటిని కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా నీటి విడుదలలో సాగుతున్న వివాదం డెల్టా అన్నదాతల్ని కన్నీటి మడుగులో ముంచింది. లక్షలాది ఎకరాల్లో సాగుబడి ఒకప్పుడు జరిగితే, ప్రస్తుతం గణనీయంగా సాగుబడి తగ్గుతోంది.
ఇందుకు కారణం కావేరి జలాలు సకాలంలో అందకపోవడమే. ప్రస్తుతం కొన్ని లక్షల ఎకరాల్లో సంబా సాగుబడి సాగుతూ వస్తున్నది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కొంత మేరకు సాగుబడి మీద దృష్టిపెట్టారు. అయితే, సంబా చేతికి రావాలంటే, మరింతగా నీళ్లు తప్పనిసరి కానున్నాయి. ఈ దృష్ట్యా, తమిళనాడుకు వాటాగా ఇవ్వాల్సిన నీటిని విడుదల చేయాలని కర్ణాటకను డిమాండ్ చేసే పనిలో పాలకులు నిమగ్నమయ్యారు. అయితే, పాలకుల పిలుపునకు కర్ణాటకలో స్పందించే వాళ్లు లేరని చెప్పవచ్చు. దీంతో కావేరి కోసం అన్నదాత రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వారం రోజులుగా డెల్టాలో కావేరి జాలల నినాదం మార్మోగుతోంది. అన్నదాతలు ఆందోళనలు సాగిస్తూ రావడంతో సీఎం పళనిస్వామి మేల్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీకి సిద్ధపడ్డారు. అయితే, ఈపర్యటన ఎప్పుడు సాగుతోందోనన్న ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నీళ్లు లేనే లేవంటూ ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి స్పష్టం చేయడం గమనార్హం.
నీళ్లు లేవు: తమకే నీళ్లు లేవు అని, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి విడుదల చేయాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పటిల్ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి వస్తే, ఆయన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్లి, తమ రాష్ట్రంలో నీటి కోసం పడుతున్న పాట్లు, కావేరిలో పరిస్థితి గురించి వివరిస్తామని వ్యాఖ్యానించారు. అంతేగానీ, తమిళనాడుకు నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని,అస్సలు నీళ్లే లేవని ఆయన స్పందించడం డెల్టా అన్నదాతల్లో ఆందోళనకు దారి తీసింది. గతంలో వలే ఈ సారి కూడా సంబాను కోల్పోవాల్సిందేనా అన్న వేదనలో మునిగారు. అసలే అప్పుల ఊబిలో ఉన్న తమకు ఇక, ఆత్మహత్యలే శరణ్యం అన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ పేర్కొంటూ, తమిళ అన్నదాతల్ని ఆదుకునే రీతిలో కర్ణాటక నీటిని విడుదల చేయాలని కోరారు. అసలే రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, పరిస్థితి మరో రకంగా మారేలోపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధ పడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment