ఎస్సీ,ఎస్టీలకు ‘ఉచిత’షాక్ !
బొబ్బిలి : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తాం.. ఎవరూ బిల్లులు చెల్లించక్కరలేదని గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు లబ్ధిదారుల కొంపముంచుతోంది. అప్పటి సీఎం హామీతో బిల్లులు చెల్లించని వారికి ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు అందుతున్నాయి. వాటిని చూసిన వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలా అని వారు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి డివిజన్‌లోని పది మండలాల్లో ఎస్సీ వినియోగదారులు 11,814 మంది ఉండగా, ఎస్టీ వినియోగదారులు 5,141 మంది ఉన్నారు. జిల్లా వాప్తంగా వీరి సంఖ్య భారీగా ఉంది.
వీరిలో చాలా మందికి ఇప్పుడు ఉచిత విద్యుత్ షాక్ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలు నెలకు 50 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చని కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించడంతో రంగంలోకి దిగిన ట్రాన్స్‌కో అధికారులు గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలపై దృష్టి సారించి, వినియోగదారులను గుర్తించారు. వారందరికీ ‘ఉచితం’ పథకంలోకి తీసుకువచ్చారు. కుల ధ్రువీకరణపత్రాన్ని అందజేసిన వారికి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ప్రకటించడంతో తహశీల్దార్ల చుట్టూ తిరిగి సర్టిపికేట్లు చేయించుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి పేర్లను మొదటి లిస్టుల్లో నమోదు చేశారు. పత్రాలు లేనివారిని పక్కన పెట్టి రెండో లిస్టుకు సిద్ధం చేశారు. అయితే వీటిని ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి పూర్తి స్థాయిలో అమలులోనికి తెచ్చారు. 50 యూనిట్ల లోపు వినియోగించిన వారి నుంచి విద్యుత్ అధికారులు డబ్బులు కట్టించుకోవడం లేదు గానీ, బిల్లులు మాత్రం పంపుతున్నారు.
అయితే ప్రభుత్వం నుంచి ఈ రాయితీకి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకూ పైసా కూడా ట్రాన్స్‌కోకు జమ కాాలేదు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ఆ సొమ్మును వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వినియోగదారులకు పంపుతున్న బిల్లుల్లోనే ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాలను కూడా వేసి చూపిస్తున్నారు. బిల్లులు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు చెల్లించని వారి కనెక్షన్లను తొలగిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది అప్పులు చేసి వేలాది రూపాయలను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి మండలంలోని పణుకువలస గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇప్పుడు వేలాది రూపాయలు బిల్లులు అందుతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు.
రూ. 1,314 బిల్లు వచ్చింది
మేము, మా కొడుకులం కలిసి ఉంటున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరంటు ఇస్తారంటే మేమెవ్వరమూ బిల్లులు కట్టలేదు. ఇప్పుడు 1,314 రూపాయలు వచ్చింది. పేదోళ్లం ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కడతాం.
- జలుమూరు వెంకన్నదొర, చిన్నమ్మి,
ఎం పణుకువలస