సాక్షి, బెంగళూరు: నింగికి రివ్వున ఎగిరే తారాజువ్వల తళుకులు, చిన్నారుల చేతుల్లో మిలమిలా మెరిసిన కాకరపూల నవ్వులు, ‘ఢాం’అని మోగే టపాసుల మోతలు వీటన్నింటితో పాటు అమావాస్య చీకట్లను దూరంగా తరిమేస్తూ ప్రతి ముంగిలిని కాంతివంతం చేసిన ప్రమిదల వెలుగులు ఇవన్నీ కలగలిసి రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు రాచనగరి మైసూరుతో పాటు రాయచూరు, బెళ్గాం, హుబ్లీ, మంగళూరు, మణిపాల్ తదితర అన్ని నగరాల్లోనూ దీపావళి సంబరాలు ఘనంగా సాగాయి.
దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ విద్యుత్ దీపాల వెలుగులతో కాంతులీనాయి. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ దీపావళి తమ జీవితాల్లో ఆనందపు వెలుగులను నింపేలా దీవించమని వేడుకున్నారు. ఇక ఉద్యాన నగరిలో దీపావళి సంబరాలు ఘనంగా సాగాయి. గురువారం సాయంత్రం ప్రతి ఇంటి ముందు బాణసంచా వెలుగులు కనిపించాయి.
బుధవారం సాయంత్రం నుంచే ప్రారంభమైన ఈ బాణసంచా వెలుగులు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఇక ఈ దీపావళికి టపాసులతో పాటు పోటీపడి అమ్ముడైనవి డ్రైఫ్రూట్స్ అని చెప్పవచ్చు. సాధారణంగా దీపావళి అంటే మిఠాయిలను బహుమతిగా అందజేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం నగరవాసులు మిఠాయిలకు బదులు డ్రైఫ్రూట్స్‌ను బహుమతిగా ఇచ్చి పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కాగా ఈ ట్రెండ్‌ను వ్యాపారులు కూడా బాగానే వినియోగించుకున్నారు.
డ్రైఫ్రూట్స్‌ను అందమైన డిజైనర్ బాక్సుల్లో పేర్చి వినియోగదారులను ఆకర్షించారు. పిస్తా, బాదం, కిస్‌మిస్ తదితర నాలుగు రకాల డ్రైఫ్రూట్స్ కలిగిన 450 గ్రాముల డిజైనర్ బాక్సు దాదాపు రూ.800 ధర పలికింది. దీంతో ఈ ఏడాది మిఠాయిల కంటే డ్రైఫ్రూట్స్ అమ్మకాలే ఎక్కువగా కనిపించాయని నగర వ్యాపారులు వెల్లడించారు.
వినీలాకాశంలో తళుకులు
Published Sat, Oct 25 2014 3:15 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement
Advertisement