ఢమాల్...
సాక్షి,బెంగళూరు : ఈ ఏడాది దీపావళి నగరవాసులకు కొంత సంతోషాన్ని, మరి కొంత విచారాన్ని మిగిల్చింది. గత ఏడాదితో పోలిస్తే టపాసులు కాల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా చూపు పోగుట్టుకున్న వారి సంఖ్య చాలా తగ్గింది. అయితే అదే సందర్భంలో శబ్ద కాలుష్యం మాత్రం పెరిగినట్లు కర్ణాటక రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (కేఎస్‌పీసీబీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీపావళి సమయంలో టపాసుల వల్ల ప్రమాదాలకు గురై చాలా సందర్భాల్లో చిన్నారులు గాయపడుతుండటం తెల్సిందే. బెంగళూరు ఇందుకు మినహాయింపు కాదు.
అందులోనూ తమిళనాడు సరిహద్దు దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువ పరిమాణంలో టపాసులు తీసుకువచ్చి నగరవాసులు కాల్చేవారు. దీంతో రాష్ట్రంలో మిగిలినపాంతాలతో పోలిస్తే బెంగళూరులో ‘దీపావళి’ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నగరంలోని మింటో ఆస్పత్రిలో ఏకంగా ఒక ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే గత మూడేళ్ల నుంచి ‘ప్రమాద రహిత దీపావళి’ గురించి పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై అనేక ఎన్‌జీఓలు సమాచారాన్ని అందజేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా దీపావళికి రెండు రోజుల ముందు నుంచే విద్యార్థుల్లో సేఫ్ దీపావళి ఆవశ్యకతను తెలియజెప్పుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందని చెప్పవచ్చు. గత ఏడాది దీపావళి సమయంలో టపాసుల పేలుడు వల్ల గాయపడి 60 మంది మింటో ఆస్పత్రిలో చికిత్స పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 31కు తగ్గిపోయింది. ఈ విషయమై ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న నళిని మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందువల్లే ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఈ విషయంపై మరింత అవగాహన పెంచాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
పెరిగిన శబ్ధకాలుష్యం...
రాత్రి పదిగంటల తర్వాత టపాసులు కాల్చరాదని సుప్రీం కోర్టు 2005లోనే ఆదేశిచింది. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఆ ఆదేశాలను పాటిస్తున్న దాఖలాలు లేవు. అర్ధరాత్రి వరకూ టపాసుల మోతతో నగరం దద్దరిల్లుతూనే ఉంది. టపాసుల్లో శబ్ధాన్ని సృష్టించే రసాయనాలు ఏడాదికేడాది పెంచుతూ పోవడం వల్ల శబ్ధతీవ్రత కూడా అదే రీతిలో పెరుగుతోంది. 2004 నుంచి కేఎస్‌పీసీబీ నగరంలోని ప్రముఖ ప్రాంతాలై వైట్‌ఫీల్డ్, పీణ్యా పరిశ్రామిక వాడలతో సహా పది చోట్ల శబ్ధ, వాయు కాలుష్యాన్ని నమోదు చేస్తోంది.
అందులో భాగంగానే దీపావళి రోజున కేఎస్‌పీసీబీలో నమోదైన గణాంకాలను అనుసరించి మొత్తం పది చోట్లా కూడా రాత్రి సమయంలో శబ్ధకాలుష్యం పెరిగిపోయినట్లు స్పష్టమవుతోంది. ఐదు చోట్ల సాధారణ రోజుల్లో పగటి సమయం కంటే శబ్ధకాలుష్యం తక్కువగా ఉండటం కూడా గమనించవచ్చు. ఈ విషయమై కేఎస్‌పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ... పండుగ సెలవు కావడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు తక్కువగా తిరగడం, పీణ్యా వంటి ప్రాంతాల్లో పరిశ్రమల్లో యంత్రాలు పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల శబ్ధకాలుష్యం తగ్గింది.
అయితే రాత్రి సమయంలో మాత్రం అన్ని ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం పెరగడానికి టాపాసుల పేలుళ్లే కారణం. ఈ శబ్ధకాలుష్యం పరిమాణం గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా పెరిగింది. దీపావళి రోజున నగరం మొత్తం మీద చిన్నపాటి జల్లులు పడ్డాయి. అందువల్ల వాయుకాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.’ అని పేర్కొన్నారు.