సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది. ఎగువ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో కురుస్తున్న వర్షాలకు తోడు, కర్ణాటక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి రోజురోజుకీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. బుధవారం ఈ ప్రాజెక్టుల్లోకి లక్ష క్యూసెక్కుల మేర వరద రాగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. మరోపక్క తుంగభద్రలోనూ వరద రెండ్రోజుల్లో లక్ష క్యూసెక్కుల నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. మరో వారం రోజులపాటు ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరో 63 టీఎంసీలు వస్తే శ్రీశైలం నిండుకుండ..
ఆల్మట్టిలోకి బుధవారం సాయంత్రం 1.08 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలతో నారాయణపూర్‌కు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేనీటిని దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు మంగళవారం 1.12 లక్షల క్యూసెక్కుల మేర వరద రాగా, అది బుధవారానికి 1.55 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో 95 టీఎంసీల నిల్వ ఉండటంతో అక్కడి నుంచి 2లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలు పెరగడంతో రాష్ట్ర పరిధిలోని జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నుంచి వస్తున్న నీటికి తోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 152.16 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 63 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.
గురువారం నుంచి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి శ్రీశైలం, తుంగభద్ర నుంచి శ్రీశైలం వరకు నదీ గర్భంలోనే కనిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేర శ్రీశైలానికి నీరు చేరినా, ప్రస్తుత సీజన్లో తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరినట్టేనని అంటున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 39,090 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 31,802 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టుమట్టం 312 టీఎంసీలకు గానూ 155.92 టీఎంసీలకు చేరింది. మరో 157 టీఎంసీల నీరు చేరితే సాగర్ నిండే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం నుంచి ఏపీ ఎప్పటికప్పుడు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కేసీ కెనాల్ ద్వారా నీటిని తోడేస్తుండటంతో సాగర్ ఎప్పటిలోగా నిండుతుందనేది చెప్పడం కష్టంగా మారింది.
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది
Published Thu, Aug 16 2018 3:16 AM | Last Updated on Thu, Aug 16 2018 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment