సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్‌మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది.
ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్‌ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్‌మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు.
రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్‌డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్‌మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను సైతం అలాగే రూపొందించారని వివరించారు.
ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్‌ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment