ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ, ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్న ప్రతి పిటిషన్‌నూ విచారణకు స్వీకరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న ఏపీ హైకోర్టు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పిటిషన్లను టోకున కొట్టివేయడం, స్టేలు విధించడం చూస్తున్న సగటు మనిషికి కూడా హైకోర్టు తీరులో ఏదో తేడా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయంటే దీనికి ఎవరు కారణం? ప్రభుత్వ యంత్రాంగంలో కూడా తప్పులు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిచేయడానికి హైకోర్టుకు అధికారాలు ఉంటాయి. కానీ కోర్టువారు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలనీ; కొన్నిసార్లు అలా లేవేమో అన్న సంశయాలు వచ్చినప్పుడే ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దీనివల్ల ఏపీ ప్రభుత్వం పట్ల న్యాయస్థానం వ్యతిరేక ధోరణితో ఉందా అన్న సందేహం సామాన్య ప్రజల్లో తలెత్తే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వస్తున్న తీర్పులు ప్రభుత్వానికి అత్యధికంగా వ్యతిరేకంగా ఉండడం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తప్పులు చేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. గౌరవ హైకోర్టువారికి కానీ, న్యాయమూర్తులకు కానీ దురుద్దేశాలు ఆపాదించజాలం. కానీ వారి తీర్పులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అనిపిస్తే, కొన్ని తీర్పులు పరస్పర విరుద్ధంగా కనిపిస్తే ప్రజలలో అనుమానాలు రావడం సహజం. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక బాధ్యత కలిగిన వైద్యుడు విశాఖ నడిరోడ్డుమీద అల్లరి చేస్తే హైకోర్టు వారు సంబంధిత కానిస్టేబుల్, ఇతర పోలీసులపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. దీనిమీద కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిపై కోర్టు ధిక్కారమన్నంతవరకు ఫర్వాలేదు. కానీ అలాంటి నిర్ణయాల వల్ల తాగుబోతు డాక్టర్‌కు మద్దతు ఇచ్చినట్లు అవుతుందేమో, ఇది సమాజానికి మంచిది కాదేమోనని పద్ధ్దతిగా మాట్లాడినవారికి కూడా ధిక్కార నోటీసులు ఇచ్చారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లినప్పుడు అక్కడ కొంత నిరసన అనండి, లేదా గొడవ అనండి జరిగింది. ఆ ఘటనలో పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక ప్రతిపక్ష నేతను తిరగనివ్వరా? అనుకోవచ్చు. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో ఆనాటి విపక్షనేత వైఎస్ జగన్‌ను, మరికొందరు నేతలను అసలు రన్‌వే మీదే నిలిపివేసిన ఘట్టాలు చూసినవారికి కొంత అభ్యంతరం అనిపించి ఉండవచ్చు. అప్పుడు కోర్టుదాకా వ్యవహారం వెళ్లలేదు కనుక ఇప్పుడు కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టలేమనుకుందాం.
కరోనా సంక్షోభ ఆరంభ సమయంలో పేదలకు పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రకరకాలుగా సాయం చేశారు. ఆ సమయంలో ఎవరో వీరివల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వెంటనే కోర్టువారు ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ ఆ తర్వాత ప్రతిపక్ష నేత బాబు తన కుమారుడితో కలిసి ఒక ర్యాలీగా హైదరాబాద్ నుంచి విజయవాడ కృష్ణానది తీరాన కరకట్టమీద ఉన్న తన ఇంటి వరకు వెళ్లే సందర్భంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు తీశారు. అప్పుడు కరోనా నిబంధనలు పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దానిపై ఎవరో పిటి షన్ వేస్తే అప్పుడు బాబుకు హైకోర్టు నోటీసు జారీ చేయలేదు. డీజీపీ లేదా సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశం ఇచ్చారు.
తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కనీసం చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి కరోనా సమస్యపై మాట్లాడి ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకుని ఉంటే గొడవ లేదు. కానీ ఆ పని చేయలేదు. హైకోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనబడలేదు. పైగా ఎన్నికలు లేకపోయినా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోడ్ అమలులో లేకుండా చేసుకోవలసి వచ్చింది. తదుపరి ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. కానీ అందులో అసలు ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం లేదని కొత్త వాదన తెచ్చింది. సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డను కొనసాగించాలన్నం తవరకు చెప్పింది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాల జోలికి ఇంకా పోలేదు. ఇక ఎన్నికల కమిషనర్ పేరుతో కేంద్రానికి వెళ్లిన ఒక లేఖను గమనిస్తే అందులో పలు కోణాలు కనిపించాయి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు ఎన్నికల కమిషనర్ ఆఫీస్‌లో ఆ లేఖ తయారు కాలేదని సీఐడీ విచారణలో తేలింది. అయినా ఆ దర్యాప్తునే కొనసాగించవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై చర్య తీసుకోవడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని కేంద్రం కూడా తెలిపినా, ఆయనపై సస్పెన్షన్‌ను గౌరవ హైకోర్టు వారు రద్దు చేశారు.
తెలుగుదేశం కార్యాలయం ఒక ఆక్రమిత ప్రాంతంలో నిర్మితమైందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్ వేస్తే మీకేం సంబంధం అని తోసిపుచ్చిన న్యాయస్థానం వారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరో పిటీషన్లు వేసినా స్వీకరించి విచారణ జరి పించడం చర్చనీయాంశం అయింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఎవరో రాజుపాళెం మండలంలో మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరగా, హైకోర్టు స్పందించి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన అక్రమ మైనింగ్ అభియోగాలపై కూడా సీబీఐ విచారణకు ఓకే చేసింది. అయితే ఆసక్తికరంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, గత ప్రభుత్వ హయాంలోనే నోటీసులు వెళ్లాయి. ఆయన కంపెనీకి 216 కోట్ల్ల జరిమానా విధిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సాంకేతిక కారణాలతో హైకోర్టువారు స్టే ఇచ్చారు. అలాగే మరో మాజీ టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు స్టే లభించింది. విశాఖలో ఎల్జీ పాలి మర్స్ సంస్థ నుంచి స్టెరైన్ గ్యాస్ విడుదల అయి పదమూడు మంది మరణించినప్పుడు హైకోర్టు తీవ్రస్థాయిలో సుమోటోగా స్పందించి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కానీ విజ యవాడలో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది మరణించినా, అందుకు బాధ్యుడైన ఆస్పత్రి యజమాని జోలికి వెళ్లవద్దని, అలా వెళితే కలెక్టర్‌ను కూడా బాధ్యుడిని చేస్తామని చిత్రమైన వాదనను హైకోర్టువారు తెచ్చారు.
ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. స్థల సేకరణలో అవినీతి జరిగిందని కొన్ని పిటిషన్లు, ఫలానా స్థలాన్ని పేదలకు ఇవ్వకూడదని మరికొన్ని పిటిషన్లు పడ్డాయి. అవినీతి ఎక్కడ జరిగినట్లు ఆరోపణలు వచ్చినా విచారించవచ్చు. కానీ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టినా స్టే ఇచ్చారు. అమరావతి భూముల స్కామ్‌పై విచారణ జరపవద్దని, మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వార్తలను ఎక్కడా ప్రచారం చేయవద్దని ఆదేశాలను ఇవ్వడం విమర్శలకు గురవుతోంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య కూడా ఈ భూముల స్కామ్‌పై విచారణ జరపరాదని, సిట్ ఏర్పాటు చెల్లదంటూ వేసిన పిటిషన్‌లో కూడా స్టే ఇచ్చారు. చట్టం ప్రకారం ఏసీబీ దర్యాప్తును నిలువరించే అధికారం హైకోర్టుకు లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు.
ఇక టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ ఒక పత్రిక కథనంపై హైకోర్టువారు దేశంలో ఉన్న అన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారు కానీ సంబంధిత వార్త రాసిన పత్రికకు మాత్రం నోటీసు ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఏ న్యాయమూర్తి ఫోన్ టాప్ అయింది? అన్న విషయాలు ఇంతవరకు తెలియదు. ఈఎస్‌ఐ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు పైల్స్‌కు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి డాక్టర్లు సర్టిఫై చేస్తే, హైకోర్టు వారు మాత్రం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి పంపించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం చేస్తే దానిని తాత్కాలికంగా నిలుపుదల చేయిం చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం పెట్టాలనుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్లలో పెద్దవాళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకుంటున్నారు కదా, మరి పేదలకు ఆ అవకాశం ఇవ్వరాదా? మాతృభాషను పరిరక్షించుకుంటూనే ఇలా చేయరాదా అని ఎవరైనా సామాన్యుడు భావిస్తే దానికి ఏమి జవాబు దొరుకుతుంది? ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయం కూడా వివాదం అయింది. కరోనా వేళ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలలో కోత పెట్టాయి. కానీ ఏపీ హైకోర్టు వారు వారందరికీ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం ఇచ్చి ఆశ్చర్యం కలిగించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం వారు తమకు వడ్డీ అవసరం లేదనీ, తమ బకాయిలు చెల్లించగలిగితే చాలనీ అనడం విశేషం.
ఈ అంశాలలో ప్రభుత్వ యంత్రాంగంలో కూడా తప్పులు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిచేయడానికి హైకోర్టుకు అధికారాలు ఉంటాయి. కానీ కోర్టువారు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలనీ; కొన్నిసార్లు అలా లేవేమో అన్న సంశయాలు వచ్చినప్పుడే ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దీనివల్ల ఏపీ ప్రభుత్వం పట్ల న్యాయస్థానం వ్యతిరేక ధోరణితో ఉందా అన్న సందేహం సామాన్య ప్రజల్లో తలెత్తే ప్రమాదం ఉంది.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
సంశయాలు రావడంలో తప్పేముంది?
Published Wed, Sep 23 2020 2:22 AM | Last Updated on Wed, Sep 23 2020 2:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment