‘ఓడిన పార్టీలు కోర్టుల ద్వారా రాజకీయా లను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వైపుగా ఇవి పదే పదే కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేస్తున్నాయి’ – కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్
బీజేపీ(ఎన్డీఏ) కేంద్రమంత్రి ఈ ప్రకటన చేసే ముందు కాంగ్రెస్ హయాంలోనూ, బీజేపీ హయాంలోనూ పరస్పరం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటూ నిన్నమొన్నటిదాకా కోర్టుల ద్వారా కూడా రాజకీయాల్ని నియంత్రించడానికి శాయశక్తులా ప్రయత్నించి పబ్బం గడుపుకుంటూ వచ్చినవేనని ప్రజలు మరచిపోరు. ఎందుకంటే, అసలు దేశ ప్రజలు అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న ఈ మాత్రపు సెక్యులర్ రాజ్యాంగాన్ని కూడా నిలవనివ్వకుండా తూట్లు పొడుస్తూ వచ్చిన రాజకీయ పక్షాలు కూడా ఇవేనని మరవరాదు. నేటికి 44 ఏళ్లనాడు సుప్రీంకోర్టును అధివసించిన విశిష్ట న్యాయమూర్తుల్లో ఒక రైన వీఆర్ కృష్ణయ్యర్ దేశంలో రాజ్యాంగమూ, దానికి లోబడి పని చేయాల్సిన మూడు వ్యవస్థలకు (ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయ వ్యవస్థ) తమ పరిధులు దాటకుండా వ్యవహరించాలని ఎందుకు సూచించవలసి వచ్చిందో ఒక సందర్భంగా వివరించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన కంప్యూటర్‌పై వచ్చిన ఒక ‘ఈ–మెయిల్’ సందే శాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ఉదహరించారు.
ఆ ఈ–మెయిల్ సందేశం 1996 నాటిది. అది చెప్పిన వివరాల ప్రకారం... పార్లమెంటు సభ్యుల్లో 29 మందిపై భార్యల్ని హింసించిన ఆరోపణలున్నాయి. ఇక ఏడుగురు మోసాలు చేసి అరెస్టయినవారు, 19 మంది క్రిమినల్ కేసుల్లో నిందితులు, 117 మంది హత్యా నేరాలు, అత్యాచారాలు, దాడులు, దొమ్మీలు, దొంగతనాల కేసుల్లో నింది తులు, 71 మంది అప్పులు తీసుకుని జవాబుదారీ లేకుండా అయిపూ పత్తాలేని కేసుల్లో ఉన్నవారు, 21మంది అనేకానేక చట్టవిరుద్ధ లావా దేవీల్లో ఉన్నవారు, 84 మంది వివిధ దాడుల్లో పాల్గొని, జరిమానాలు చెల్లించాల్సి వచ్చిన బాపతు.
పార్లమెంటులో బిలియనీర్లదే ఆధిపత్యం
పార్లమెంటు దిగువసభ 545 మంది సభ్యులున్న సభ. మనందర్నీ క్రమశిక్షణలో ఉంచాల్సిన, వందలాది చట్టాల్ని రూపొందించాల్సిన ప్రతినిధుల సభ. వీరి ఈ భాగోతాన్ని సరిదిద్దడానికి మనమేమైనా చేయగలమా? అంటూ ఆనాడు జస్టిస్ కృష్ణయ్యర్‌కు ఈ–మెయిల్ పంపిన వ్యక్తి అడిగారు (‘ఫ్రమ్ ది బెంచ్ టు ది బార్’, పే.88). దాదాపు ఈ అజ్ఞాత సందేశానికి రుజువుగా బడా కోటీశ్వరుడు బిర్లా ‘మా చేతుల్లో 70 మందికి పైగా పార్లమెంట్ సభ్యులున్నార’ని ప్రకటించాడు. ఇప్పుడు 44 ఏళ్లనాటి పరిస్థితి కూడా చేయి దాటిపోయింది. దఫదఫాలుగా ‘ప్రజాస్వామ్యం’ విలసిల్లుతున్న తీరుపైన సాధికార నివేదికలు వెలువరిస్తూ వస్తున్న జాతీయ ప్రజాస్వామ్య వేదిక (ఏడీఆర్) సైతం.. నేటి పార్లమెంట్ సభ్యులలో కనీసం 150 మందికి పైగా వివిధ రకాల అవినీతిపరులతో, నేరాలతో, అత్యాచారాలతో, ఏదో రూపంలో సంబంధాలున్న సభ్యులేనని అభిప్రాయపడింది. ఇప్పుడు టాటా, బిర్లాలకు తోడు అదానీలు, అంబానీలు, విజయ్ మాల్యాలు, నీరవ్‌మోదీలు ఇత్యాది బిలియనీర్ల సంఖ్య పెరిగి సుమారు 200 మంది దాకా తేలుతున్నారని మరికొన్ని అంచనాలు. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు మూడే కాదు, ప్రజాస్వామ్యానికి ‘నాల్గవ’ స్తంభంగా కేవలం ‘పేరు’కే భావిస్తున్న మీడియా కూడా రాజ్యాంగమూ, దాని వ్యవస్థల సరసనే ‘బతుకు జీవుడా’ అనే దశకు చేరుకుంది. చివరికి న్యాయ వ్యవస్థ చేతులు ఎలా మెలిపెట్టవచ్చునో కూడా పాలకులు ‘మతలబు’ కనిపెట్టారు.
న్యాయమూర్తుల ప్రమోషన్ల ‘ఎర’తో, సరుకు లేకపోయినా తమ వృత్తిలో ఎలాంటి ప్రావీణ్యతను స్థాపించుకోలేని కొందరు న్యాయ మూర్తుల్ని పాలకవర్గాలు, అనుకూల తీర్పుల కోసం కోర్టులలో నియ మింపజేసుకోవడమూ మన దేశంలో ఇటీవల కాలంలో మరింత తెంపరితనంతో జరుగుతున్నది. కేంద్రస్థాయిలో సీబీఐ ప్రత్యేక న్యాయ మూర్తి జస్టిస్ లోయా హత్యపై విచారణను తాత్సారం చేయడంలోనే కాక ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ గొగోయ్ ఇత్యాదులను పరిరక్షించడం లోనూ పాలకవర్గాల రాజకీయ వ్యాపార ప్రయోజనాలు చాలా బాహాటంగానే బయటపడ్డాయి.
ఏడాదిలోపు 57 కేసులా?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో వ్యవహారాలు చూద్దామా... రాష్ట్ర శాసనసభలో అస్తుబిస్తు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు కాళ్లు తెగిపోయిన ‘ఒంటరి ఒంటె’ బతుకులా గడుపుతున్నారు. అయినా, అధికారంలో ఉన్నప్పటిలాగే అన్ని వ్యవస్థలనూ పాత పద్ధతుల్లోనే వాడుకోవాలన్న కండూతి ఆయనలో ఇంకా తొలగలేదు. దీనికి తిరుగులేని తాజా ఉదాహరణ– రాష్ట్రంలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీని చికాకుపర్చడానికి చంద్రబాబు ‘దింపుడు కళ్లం’ ఆశ కొద్దీ చేయని ప్రయత్నమంటూ లేదు. దీని ఫలితమే జగన్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి కావడానికి ముందే జగన్ పాలనపై దాదాపు 50–57 కేసులు బనాయిస్తే న్యాయస్థానం ప్రశ్నించి, రుజు వుల కోసం నిలదీసినట్టు కన్పించదు. పైగా మీడియా చర్చల్లో, విశ్లేషణల్లో సహజమూ, సర్వసామాన్యమూ అయిన ఎదురు బొదురు ప్రశ్నలు–సమాధానాలూ ఆధారంగా కోర్టులు ప్రశ్నించడం వక్రమార్గం పట్టిన మన ప్రజాస్వామ్యంలో మరొక తంతు. ఆ మేరకు నోటీసులు ఇవ్వడం అనే ఈ పద్ధతులపై, నలభై రెండేళ్ల క్రితమే త్రిసభ్య అత్యున్నత ధర్మాసనం (సుప్రీం).. పత్రికాధిపతి ఎడిటర్ ముల్గావ్‌కర్ కేసులో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అది ఆ రోజుకీ, ఈ రోజుకీ పత్రికా రంగంపై పరువు నష్టం, కోర్టుధిక్కార కేసులన్నిటా శిలా శాసనంగానే అమలులోనే ఉంది (1978 సుప్రీంకోర్టు కేసులు పే.339).
ఈ కేసుకు ముందు కోర్టు ధిక్కార, పరువు నష్టం తాలూకు వచ్చిన పలు కేసులను తూర్పారబడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత న్యాయమూర్తుల బెంచ్‌లో అమెరికా, ఇంగ్లండ్‌లలో తిరుగులేని తీర్పులు వెలువరించి పత్రికా స్వేచ్ఛకు, మీడియా వ్యాఖ్యాతల స్వేచ్ఛకు స్వాగత తివాసీలు పరిచారు. అదే సమయంలో కనీస పరిమితులనూ ప్రతిపాదించారు. 1978 నాటి సుప్రీం తీర్పులో జస్టిస్ బేగ్, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ కైలాసంలతో కూడిన ఉన్నత ధర్మాసనం ఇలా స్పష్టం చేసింది. మీడియా (పత్రికలు, మాధ్యమాలు) రంగం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనివార్యమైన మధ్యంతర శక్తి. ప్రజా స్వామ్య శక్తులకు ఊతమిచ్చి బలోపేతం చేయడానికి మీడియా బలమైన సాధనం. బాధ్యతాయుతమైన పరిమితుల్లో స్వేచ్ఛగా వ్యవ హరించగల శక్తిగలది మీడియా. అత్యున్నత న్యాయస్థానం సహా అన్ని కోర్టులకు ఇది వర్తిస్తుంది. స్వేచ్ఛ తన పరిధుల్లో తాను వ్యవహరిం చడం అనివార్యం. అలాగే న్యాయమూర్తులు న్యాయం చేయడానికి జంకిపోతే ఆ న్యాయం కాస్తా ఓడిపోయినట్టేనని కోర్టు ధిక్కార నేరా రోపణల్ని సుప్రీం ఆనాడే కొట్టిపారేసింది.
న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా ఉండాలి
ఇంగ్లండ్ క్వీన్ కౌన్సిల్ గౌరవ సభ్యుడు సుప్రసిద్ధ న్యాయ శాస్త్ర వేత్త డేవిడ్ పానిక్, ఇంగ్లండ్‌లో మహా గొప్ప న్యాయమూర్తి అయిన జస్టిస్ ఆలివ్ వెండెల్ హోమ్స్ చరిత్రాత్మక సందేశాన్ని ఇలా ఉదహరించారు: ‘సమాజాల నిర్వహణలో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర, కేంద్రీయ స్థానం. ప్రజా జీవితానికి సంబంధించిన ఈ కీలకమైన అంశాన్ని యాసిడ్ లాంటి అత్యంత పదునైన క్షార పదార్థంతో ప్రక్షాళనం చేసి కడిగిన ముత్యంలా సిద్ధం చేయాలి. న్యాయమూర్తుల్ని నిర్దుష్టమైన మచ్చలేని మానవులుగా మనం చూడగలగాలి. అప్పుడు ప్రభుత్వం లోని ఇతర శాఖల అధికారిక ప్రవర్తనపట్ల ఎంత నిశితంగా వ్యవ హరిస్తామో అంత నిశితంగానూ న్యాయమూర్తులపట్ల వ్యవహరిం చాల్సిందే. అలా చేయనంత కాలం న్యాయమూర్తులు కూడా సమా జంలోని మిగతా సభ్యుల జీవితాల్ని శాసించే మతాధిపతుల్లో ఒకరుగా మిగిలిపోతారు. దాంతో న్యాయమూర్తులు ప్రజలనుంచి దూరమవు తారు, వారిని జనం వేరే విధంగా భావిస్తారని జడ్జీలు గుర్తించాలి. కనుక న్యాయమూర్తులు, మీడియా ఎన్నడూ స్వార్థపర వర్గాల ప్రయో జనాలకు వత్తాసు పలకరాదు, గొడుగు పట్టరాదు. ఎందుకంటే, అలాంటి వారు సామాజిక న్యాయానికి నిలబడలేరు, మానసికంగా వికలాంగులవుతారు’.
అంతేగాదు సుప్రసిద్ధ బ్రిటిష్ న్యాయమూర్తులలో లబ్దప్రతిష్టుడైన లార్డ్‌డెన్నింగ్ ‘ఈ మా అధికారాన్ని మా సొంత పరువును, బిరుద బీరాల్ని కాపాడుకునే సాధనంగా ఎన్నడూ వినియోగించుకోజాలం’ అని కోర్టులోనే ఎలుగెత్తి చాటాడు. అంతేగాదు, ‘మాకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని అణచివేయడానికి మా పద్ధతుల్ని ఉపయోగించబోము. విమర్శ అంటే మేం భయపడం, విమర్శను నిరసించం. ఎందుకంటే, ఇంతకన్నా అత్యంత ముఖ్యమైన సత్యం బలి కాకూడదు. అదే– భావ ప్రకటనా స్వేచ్ఛ. పార్లమెంటులోగానీ, పత్రికల ద్వారాగానీ– ఈ స్వేచ్ఛ ప్రతి మానవుని హక్కు’ అని లార్డ్ డెన్నింగ్ ప్రపంచ న్యాయ మూర్తులందరికీ పాఠం చెప్పాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 90 మందికిపైగా నేతలకు, పాత్రికేయులకు, ఇతరులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులిచ్చిందన్న వార్త డెన్నింగ్‌కే కాదు, భారత న్యాయ వ్యవస్థకూ, సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకూ కూడా అవమానంగానే భావించాలి. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలూ బజారులో చివరికి ‘చాకి రేవు’కు చేరినట్టు ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఈ చాకిరేవు వెనకాల కానరాని బహిరంగ రహస్యం పేదవర్గాల ప్రయోజనాల్ని అణగదొక్క బోవడం..!
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment