న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణ | Central Government Plans To Indian Judiciary Service At Hyderabad | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌

Published Thu, Feb 20 2020 1:52 AM | Last Updated on Thu, Feb 20 2020 9:58 AM

Central Government Plans To Indian Judiciary System At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌)ల తరహాలో న్యాయ వ్యవస్థలో అఖిల భారత సర్వీసును తెరపైకి తెస్తోంది. ఇండియన్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌ (ఐజేఎస్‌) పేరిట జిల్లా జడ్జీలను నియమించే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు కార్యరూపం ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనతో మన రాష్ట్రానికి కూడా ప్రమేయం ఉండటం, ఇక్కడే ఐజేఎస్‌ అధికారులకు శిక్షణనిచ్చేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ (ఎన్‌జేఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుండటం విశేషం.

ప్రస్తుతం నియామకాలు ఇలా...
న్యాయమూర్తి బాధ్యతల్లో తొలి దశ అయిన జూనియర్‌ సివిల్‌ జడ్జి (మేజిస్ట్రేట్‌), ఆ తర్వాతి దశ అయిన జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు చేపడుతోంది. పోటీ పరీక్షలు నిర్వహించి ఈ రెండు స్థాయిల్లో న్యాయమూర్తుల పోస్టులను హైకోర్టే భర్తీ చేస్తోంది. ఇక హైకోర్టు న్యాయమూర్తుల కోసం కొలీజియం ఏర్పాటు చేసి భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు నుంచి కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ద్వారా చేపట్టాలనేది కేంద్రం ఆలోచన. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు న్యాయవాద డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఈ పరీక్ష రాసి ఐజేఎస్‌కు ఎంపికయ్యే విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలోనే శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నేరుగా వారు జిల్లా జడ్జి లేదా సమాన హోదాలో అఖిల భారత సర్వీసుల్లో చేరిపోతారు.

స్వయం ప్రతిపత్తి ఎలా?
ఐజేఎస్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి భంగం వాటిల్లదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యూపీఎస్సీ ద్వారా ఐజేఎస్‌కు ఎంపిక చేసినప్పటికీ జిల్లా జడ్జీలుగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం, బదిలీలు, సర్వీసు వ్యవహారాలు వంటివి హైకోర్టుల పరిధిలోనే ఉంటాయి. ఈ విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. ఇక జిల్లా జడ్జి కంటే దిగువన ఉండే జూనియర్‌ సివిల్‌ జడ్జీల నియామకాలను ఎప్పటిలాగే హైకోర్టులే చేపడతాయి. ఐజేఎస్‌కు ఎంపికై జిల్లా జడ్జిలుగా నియమితులైన వారు పదోన్నతులపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. సీనియారిటీ ప్రాతిపదికన వారి నియామకాలు ఉంటాయి. ఐజేఎస్‌ వ్యవస్థ ఏర్పాటుపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ ఊపందుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ సర్వీసు ఏర్పాటులో వచ్చే సానుకూల, ప్రతికూలతలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా జడ్జీల నియామకాలను యూపీఎస్సీ ద్వారా చేపడితే జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా నియమితులయ్యే వారు సర్వీసు, పనితీరు ఆధారంగా ఐజేఎస్‌కు ఎంపికవుతారు. వారు జిల్లా జడ్జీలుగా పదోన్నతి పొందేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఉన్నట్లుగానే ఐజేఎస్‌లో కూడా మేజిస్ట్రేట్ల పదోన్నతుల కోసం కన్‌ఫర్డ్‌ సర్వీసు ఉంటుందని, అయితే ఎంత శాతం ఉంటుందన్నదే తేలాల్సి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇప్పుడేం జరుగుతోంది?
నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఐఏఎస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉండగా ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చే నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) హైదరాబాద్‌లోనే ఉంది. జ్యుడీషియల్‌ శిక్షణకు కూడా దక్షిణాదిలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది కేంద్రం భావనగా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్న అపప్రథ నుంచి బయటపడటం కోసం ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థను దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర కూడా దీని కోసం శతథా ప్రయత్నాలు చేస్తోంది. తమ రాష్ట్రంలోనే ఎన్‌జేఏ వస్తోందని, ఇందుకు స్థలం ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల స్థల పరిశీలన కూడా జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ మండలాల్లో అనువుగా ఉన్న రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. దీంతో ఇప్పుడు ఎన్‌జేఏ హైదరాబాద్‌లో ఏర్పాటవుతుందా లేక మహారాష్ట్ర తీసుకెళ్తుందా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వాజ్‌పేయి హయాంలోనే తెరపైకి...
వాస్తవానికి న్యాయ వ్యవస్థ అఖిల భారత సర్వీసు తీసుకురావాలన్న అంశం వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలోనే తెరపైకి వచ్చింది. సుశిక్షుతులైన న్యాయ విద్యార్థులను దేశం ఉపయోగించుకోలేకపోతోందని, న్యాయ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన యువతరం కార్పొరేట్లకు, విదేశాలకు సేవలందిస్తోందని, వారిని దేశ న్యాయ వ్యవస్థలో మిళితం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదనను అప్పట్లో తీసుకువచ్చారు. అయితే సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లో నియమితులయ్యే జడ్జీలకు స్థానిక భాష సమస్యగా మారుతుందని, నిరక్షరాస్యులైన కక్షిదారులను అర్థం చేసుకోవడం, వారి వాదనలను వినడం సమస్యగా మారుతుందనే ఆలోచనతో అప్పట్లో 14 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారులు స్థానిక మాతృభాషను కచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధన ఉండటంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో భాష నేర్చుకోవడం సమస్య కాదనే ఉద్దేశంతోనే మళ్లీ ఇప్పుడు ఐజేఎస్‌ను కేంద్రం తెరపైకి తెస్తోంది.

చాలా మంచి పరిణామం...
ఇది చాలా మంచి పరిణామం. దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. న్యాయ వ్యవహారాల్లో స్థానిక జోక్యం తగ్గుతుంది. భాషా సమస్య ఎదురవుతుందని కొందరు అంటున్నారు. కానీ బ్రిటిష్‌ హయాంలోనే మన వాళ్లు భాషా సమస్యను అధిగమించారు. అందువల్ల భాష పెద్ద సమస్యే కాదు. మొత్తంమీద న్యాయ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి ఈ ప్రతిపాదన దోహదపడుతుంది.
– జస్టిస్‌ ఎస్‌.రామలింగేశ్వర్‌రావు, రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి

లా పట్టభద్రులకు గొప్ప అవకాశం...
ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచే 50 వేల మంది లా డిగ్రీలు పొందుతున్నారు. లా విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశం. ప్రతిష్టాత్మకమైన జాతీయ న్యాయ సంస్థల్లో చదువుకున్న వారిలో జడ్జీలుగా ఒక శాతం మంది కూడా వెళ్లడం లేదు. ఐజేఎస్‌ ద్వారా ప్రతిభగల న్యాయ విద్యార్థులకు జిల్లా జడ్జీలుగా అఖిల భారత సర్వీసుల్లోకి వెళ్లే అవకాశం వస్తుంది.
– ఎం. సునీల్‌ కుమార్‌ (భూమి సునీల్‌), నల్సార్‌ యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement