ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు | Gwalior judge quits over alleged sexual harassment by HC judge | Sakshi
Sakshi News home page

ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు

Published Tue, Aug 5 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు

ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు

మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిపై మహిళా న్యాయమూర్తి ఆరోపణలు
 
లైంగిక వేధింపులపై సీజేఐకి లేఖ రాసిన మహిళా న్యాయమూర్తి
ఆరోపణలను ఖండించిన హైకోర్టు న్యాయమూర్తి
నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమని సీజేఐకి లేఖ

 
భోపాల్: అత్యున్నతమైన న్యాయవ్యవస్థను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గ్వాలియర్‌లోని మహిళా అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనను ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారని, జడ్జి వేధింపులు భరించలేక తాను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఆర్‌ఎం లోథాకు 9 పేజీల లేఖ రాశారు. అయితే మహిళా న్యాయమూర్తి ఆరోపణలను సదరు హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు రుజువైతే మరణ శిక్షను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఓ న్యాయాధికారి భార్యతో ఫోన్ చేయించి ఓ పెళ్లి వేడుకలో తాను ఓ ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జడ్జి చెప్పించారని, అయితే అందుకు నిరాకరించానని మహిళా న్యాయమూర్తి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఆదేశాలపై ముగ్గురు న్యాయాధికారులూ తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పుడు నివేదికలు సమర్పించారని, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే దానినని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను గత నెలలో గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించారని పేర్కొన్నారు. బదిలీపై హైకోర్టు జడ్జితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తన కోరిక తీర్చకపోవడం వల్ల, ఒంటరిగా తన బంగళాకు రాకపోవడం వల్లే బదిలీ చేసినట్టు చెప్పారని ఆరోపించారు. బదిలీకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అపాయింట్‌మెంట్ కోరితే నిరాకరించారని, గత్యంతరం లేక ఆత్మాభిమానాన్ని, కుమార్తె కెరీర్‌ను కాపాడుకునేందుకు జూలై 15న రాజీనామా చేసినట్టు చెప్పారు.

సీబీఐ విచారణకైనా సిద్ధం: హైకోర్టు జడ్జి

ఈ ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టు న్యాయమూర్తి మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్‌కులేఖ రాశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, సీబీఐతో విచారణ చేయించవచ్చన్నారు. మహిళా జడ్జి మాత్రమే కాదు, ఏ మహిళనైనా తాను లైంగికంగా వేధించినట్టు, దూషించినట్టు రుజువైతే మరణశిక్షకూ సిద్ధమని చెప్పారు. ఈ లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి పంపారు.

ఇది తీవ్రమైన అంశం.. సీజేఐ

 ఈ ఆరోపణల అంశం తీవ్రమైనదని,  తగిన రీతిలో వ్యవహరిస్తామని సీజేఐ లోథా చెప్పారు. ఈ అంశం ఇంకా తన వద్దకు రాలేదని, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు మహిళా జడ్జి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది.  బదిలీకి సంబంధించి జడ్జి అభ్యర్థనలను నిరాకరించామని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆమె  ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కాగా, మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తిని తక్షణం విధుల నుంచి తప్పించాలని, మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా జడ్జి ఆరోపణలకు సంబంధించి హైకోర్టు జడ్జిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ  సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement