సీజేఐకి రాసిన లేఖలో రిటైర్డు జడ్జీల ఆందోళన
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు.
అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు.
‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment