undermined
-
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్‌గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్‌లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి విజయవాడ (మొగల్రాజపురం) : చట్టాలు అమలు చేయాల్సిప్రభుత్వం ఆ చట్టాలకుతూట్లు పొడిచి ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. బందరురోడ్డులోని ఆల్ ఇండియా రేడియో ఎదురుగా ఉన్న ౖవైట్హౌస్ బిల్డింగ్‌లో నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ (ఎన్ఏపీఎం), ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోషియేషన్ సంయుక్తంగా ‘ప్రజాహిత వ్యాజ్యాలు– న్యాయస్థానాల వైఖరి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటంలో ప్రజాప్రయోజనాల వాజ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఇదే మాదిరిగా వేసిన ‘ఫిల్స్’ వల్లనే బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి బహిర్గతమై వేల కోట్ల రుపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడగలిగారన్నారు. అమరావతిలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్న వైఖరి, రాజధాని నిర్మాణానికి ని«ధులు అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌ను కోర్టు స్వీకరించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2013 ల్యాండ్ ఎక్విజేషన్ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే దానిని కాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఫూలింగ్ అంటూ కొత్త విధానాన్ని అమలు చేస్తుండటం అదేదో గొప్ప కార్యం మాదిరిగా మంత్రివర్గం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కుని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందని పిల్ వేస్తే విచారించకుండా మీకేం సంబంధం అంటూ ప్రశ్నించడం సరికాదన్నారు. పంట పొలాలను తీసుకోవద్దని మేధావులతో పాటుగా శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల వాజ్యం వేసే వారు 50 వేల రుపాయలను డిపాజిట్ చేయాలంటూ విధించిన నిబంధన సరికాదన్నారు. పిల్ వేయడం వల్ల ప్రజాధనం వృద్ధా కాకుండా ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఈ నిబంధన వల్ల అవినీతి జరుగుతుందని పౌరులకు తెలిసినా పిల్ వేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎన్ఏపీఎం రాష్ట్ర కన్వీనర్ బీఆర్కే రాజు, క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మల్లెల శేషగిరిరావు, రైతు, రైతు కూలీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ అనుమోలు గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని«ధులు కొలనుకొండ శివాజి, ఎన్.నరసింహారావు, రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాసరావుతో పాటుగా కొంత మంది రైతులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులు అమలు చేయాలని, తక్షణమే నవ్యాంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఫిల్ వేసే వారు రూ.50 వేలు చెల్లించాలని హైదరాబాద్ హైకోర్టు విధించిన నిబంధన తొలగించాలని, సుప్రీం, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులు రాజకీయ నాయకులకు వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇవ్వడం వలన ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇచ్చే ముందు ఒక సారి ఆలోచించాలని తీర్మానాలు చేశారు.