ఇండోనేసియాలోని సురబయ సిటీ రోడ్డుపై క్రిమి సంహారిణిని స్ప్రే చేస్తున్న పోలీసు వాహనం
ప్యారిస్/మాస్కో/జెరూసలెం/వాషింగ్టన్: కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 7,43,190 మంది ఈ వ్యాధి బారిన పడగా 35,349 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొత్తం 183 దేశాల్లో చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,57,069 వరకూ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి అమెరికా మొత్తమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
మొత్తం 2,606 మంది ప్రాణాలు కోల్పోగా 4,574 మంది కోలుకున్నారు. ఇటలీలో కరోనాతో 10,779 మంది మరణించగా లక్ష మంది బాధితులుగా మారారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 13,030 మంది ఉన్నారు. స్పెయిన్‌లో మొత్తం 7,340 మంది కరోనాకు బలికాగా వీరిలో గత 24 గంటల్లో మరణించిన వారు 812 మంది కావడం గమనార్హం. మొత్తమ్మీద చూస్తే ఈ వైరస్ యూరప్‌లో 25 వేల మందిని పొట్టనబెట్టుకుంది. సుమారు నాలుగు లక్షల మంది వ్యాధి కోరల్లో చిక్కుకున్నారు. చైనాలో 81,470 మంది ఈ వ్యాధికి గురికాగా, 3,304 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 31 కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. ఇరాన్‌లో 41,495 మందికి వైరస్ సోకగా ఇప్పటివరకు 2,757 మంది ప్రాణాలు కోల్పోయారు.
క్వారంటైన్‌లోకి ఇజ్రాయెల్ ప్రధాని
సహాయకుడు ఒకరికి కరోనా సోకిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ముందు జాగ్రత్తగా సోమవారం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో కరోనా బాధితుల సంఖ్య సోమవారానికి 4347కు చేరుకోగా 16 మంది మరణించారు.
అమెరికాలో ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం
కరోనా నుంచి అమెరికా జూన్ ఒకటో తేదీకల్లా తప్పించుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈలోగా వచ్చే రెండు వారాల్లో కేసులు, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చునని ఆయన హెచ్చరించారు. అందుకే ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం(సోషల్ డిస్టెన్సింగ్) నిబంధనలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే 1.45 లక్షల మంది వైరస్ బారిన పడగా, 2,606 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే.
రష్యాలో లాక్‌డౌన్
రష్యా రాజధాని మాస్కోలో సోమవారం లాక్‌డౌన్ ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా చర్యలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాస్కో జనాభా కోటీ 20 లక్షలు. రష్యాలో ఇప్పటివరకూ 1,835 మంది కోవిడ్ బారిన పడగా 9 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment