లెబనాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరిక
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్‌బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.
గతంలో ఎన్నడూలేనంతగా హెజ్‌బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్‌బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.
ఈ క్రమంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment