అటు షూటింగ్...
ఇటు అసలుసిసలు హైజాక్!
నలభయ్యేళ్ల కిందట... 1976లో ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం ఒకటి టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు బయలుదేరింది. 250 మంది ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయిల్ దేశస్థులు. పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానాన్ని పాలస్తీనా హైజాకర్లు ఉగాండాలోని ఎంటెబేకు మళ్లించారు. ప్రయాణికులను, సిబ్బందిని బందీలుగా చేసుకుని... ఇజ్రాయిల్ సహా మరో నాలుగు దేశాల్లో బందీలుగా ఉన్న 54 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు మిలియన్ డాలర్ల నగదు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు. వారం రోజులు హైడ్రామా నడిచింది. శత్రు దేశాల రాడార్లకు అందకుండా... ప్రతికూల వాతావరణంలో ఇజ్రాయిల్ కమెండోల బృందం ఏకబిగిన ఎనిమిదిన్నర గంటలు... నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ బృందానికి ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు యోనాథన్ నెతన్యాహు నేతృత్వం వహించారు.
ఉగాండాలోని ఎంటెబేలో దిగిన ఈ కమెండో బృందం మెరుపుదాడి చేసి ఎనిమిది మంది హైజాకర్లను మట్టుబెట్టింది. 20 మంది ఉగాండా సైనిక సిబ్బందిని కూడా చంపింది. బందీలుగా ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు ఈ ఆపరేషన్‌లో చనిపోగా... మిగతా అందరినీ సురక్షితంగా విడిపించారు. అయితే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన యోనాథన్ అమరుడయ్యాడు. కట్ చేస్తే... సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ హైజాక్ ఉదంతం ఆధారంగా ‘ఎంటెబే’పేరుతో సినిమా తెరకెక్కుతోంది.
ఈ నెల 23న (శుక్రవారం) మాల్టా ఎయిర్‌పోర్టులో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇంతలో హైజాక్‌కు గురైన లిబియా విమానం మాల్టా ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. తాము హైజాక్‌పై షూటింగ్ చేస్తుండగా... నిజంగానే హైజాక్‌కు గురైన లిబియా విమానం సీన్‌లోకి రావడంతో సినిమా బృందం విస్తుపోయింది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసిందని లిజా నగర మేయర్ మాగ్దా మాగ్రి వెల్లడించారు. కాగా, లిబియా విమాన హైజాక్ కథ సుఖాంతమైన విషయం తెలిసిందే. 118 మందిని విడుదల చేసిన ఇద్దరు హైజాకర్లు... తర్వాత లొంగిపోయారు.