Hijackers
-
అటు షూటింగ్...
ఇటు అసలుసిసలు హైజాక్! నలభయ్యేళ్ల కిందట... 1976లో ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం ఒకటి టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు బయలుదేరింది. 250 మంది ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయిల్ దేశస్థులు. పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానాన్ని పాలస్తీనా హైజాకర్లు ఉగాండాలోని ఎంటెబేకు మళ్లించారు. ప్రయాణికులను, సిబ్బందిని బందీలుగా చేసుకుని... ఇజ్రాయిల్ సహా మరో నాలుగు దేశాల్లో బందీలుగా ఉన్న 54 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు మిలియన్ డాలర్ల నగదు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు. వారం రోజులు హైడ్రామా నడిచింది. శత్రు దేశాల రాడార్లకు అందకుండా... ప్రతికూల వాతావరణంలో ఇజ్రాయిల్ కమెండోల బృందం ఏకబిగిన ఎనిమిదిన్నర గంటలు... నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ బృందానికి ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు యోనాథన్ నెతన్యాహు నేతృత్వం వహించారు. ఉగాండాలోని ఎంటెబేలో దిగిన ఈ కమెండో బృందం మెరుపుదాడి చేసి ఎనిమిది మంది హైజాకర్లను మట్టుబెట్టింది. 20 మంది ఉగాండా సైనిక సిబ్బందిని కూడా చంపింది. బందీలుగా ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు ఈ ఆపరేషన్‌లో చనిపోగా... మిగతా అందరినీ సురక్షితంగా విడిపించారు. అయితే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన యోనాథన్ అమరుడయ్యాడు. కట్ చేస్తే... సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ హైజాక్ ఉదంతం ఆధారంగా ‘ఎంటెబే’పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 23న (శుక్రవారం) మాల్టా ఎయిర్‌పోర్టులో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇంతలో హైజాక్‌కు గురైన లిబియా విమానం మాల్టా ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. తాము హైజాక్‌పై షూటింగ్ చేస్తుండగా... నిజంగానే హైజాక్‌కు గురైన లిబియా విమానం సీన్లోకి రావడంతో సినిమా బృందం విస్తుపోయింది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసిందని లిజా నగర మేయర్ మాగ్దా మాగ్రి వెల్లడించారు. కాగా, లిబియా విమాన హైజాక్ కథ సుఖాంతమైన విషయం తెలిసిందే. 118 మందిని విడుదల చేసిన ఇద్దరు హైజాకర్లు... తర్వాత లొంగిపోయారు. -
విమానం హైజాక్ సుఖాంతం
లిబియాలో హైజాక్.. మాల్టాలో ప్రత్యక్షం మాల్టా ఆర్మీ చొరవతో ప్రయాణికులు సురక్షితంగా విడుదల.. అనంతరం లొంగిపోయిన హైజాకర్లు వలెటా: లిబియాలోని సభా నుంచి రాజధాని ట్రిపోలీకి అఫ్రికియా ఎయిర్వేస్ విమానం (ఎయిర్‌బస్ ఏ 320) శుక్రవారం ఉదయం బయలుదేరింది.. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో ట్రిపోలీ చేరుకోవాల్సిన విమానం.. దారి మళ్లిందనే సమాచారం కలకలం రేపింది. విమానంలో 118 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. కాసేపటికి విమానం హైజాక్ అయిందనే సమాచారం లిబియా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే హైజాకర్లు విమానాన్ని మధ్యదరాసముద్ర ద్వీప దేశమైన మాల్టాలోని వలెటా విమానాశ్రయంలో ల్యాండ్ చేయటం.. అక్కడి మిలటరీ రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించటంతో కథ సుఖాంతమైంది. అనంతరం ఇద్దరు హైజాకర్లూ లొంగిపోయారు. వారు దివంగత లిబియా నేత గఢాఫీ అనుచరులని.. వారిద్దరూ మాల్టాలో రాజకీయ ఆశ్రయం కావాలని కోరినట్లు తెలిసింది. అసలేం జరిగింది?.. సభా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఇద్దరు అగంతకులు విమానంలోకి కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. చేతిలో గ్రనేడ్లు పట్టుకుని.. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో పైలెట్లతోపాటు విమానంలో ఉన్నవారిలోనూ ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థమయ్యేలోపునే విమానం దారి మళ్లింది. ఈ సమయంలో విమానంలో 28 మహిళలు, ఓ చిన్నారితో సహా 118 మంది ప్రయాణికులున్నారు. దీంతో లిబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. హైజాకర్లు విమానాన్ని మాల్టాకు దారి మళ్లించారు. రన్‌వేపైనే గంటసేపు విమానాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయాధికారులు.. పలు విమానాలను ఇటలీకి దారిమళ్లించారు. మరికొన్ని మొదట వాయిదా పడ్డా.. తర్వాత మొదటి రన్‌వే ద్వారా ల్యాండ్ అయ్యాయి. అటు విమానాశ్రయాధికారుల సూచనతో రంగంలోకి దిగిన మాల్టా ఆర్మీ ఎయిర్‌బస్‌ను చుట్టుముట్టింది. బందీలను వదిలిపెట్టాలని హైజాకర్లకు సూచించింది. రెండున్నర గంటల చర్చల తర్వాత.. ప్రయాణికులను క్షేమంగా హైజాకర్లు వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ‘విమాన సిబ్బంది కూడా క్షేమంగా బయటకు వచ్చేశారు. హైజాకర్లు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్నాం’ అని మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్ ట్వీట్ చేశారు. దీంతో కథ సుఖాంతమైనట్లు అధికారిక సమాచారం అందింది. కాగా, ఇద్దరు హైజాకర్లు గఢాఫీ అనుకూల పార్టీ పెట్టనున్నట్లు తెలిపారని లిబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు.