విమానం హైజాక్ సుఖాంతం
లిబియాలో హైజాక్.. మాల్టాలో ప్రత్యక్షం
మాల్టా ఆర్మీ చొరవతో ప్రయాణికులు సురక్షితంగా విడుదల..
అనంతరం లొంగిపోయిన హైజాకర్లు
వలెటా: లిబియాలోని సభా నుంచి రాజధాని ట్రిపోలీకి అఫ్రికియా ఎయిర్‌వేస్ విమానం (ఎయిర్‌బస్ ఏ 320) శుక్రవారం ఉదయం బయలుదేరింది.. షెడ్యూల్ ప్రకారం కాసేపట్లో ట్రిపోలీ చేరుకోవాల్సిన విమానం.. దారి మళ్లిందనే సమాచారం కలకలం రేపింది. విమానంలో 118 మంది ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. కాసేపటికి విమానం హైజాక్ అయిందనే సమాచారం లిబియా ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే హైజాకర్లు విమానాన్ని మధ్యదరాసముద్ర ద్వీప దేశమైన మాల్టాలోని వలెటా విమానాశ్రయంలో ల్యాండ్ చేయటం.. అక్కడి మిలటరీ రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించటంతో కథ సుఖాంతమైంది. అనంతరం ఇద్దరు హైజాకర్లూ లొంగిపోయారు. వారు దివంగత లిబియా నేత గఢాఫీ అనుచరులని.. వారిద్దరూ మాల్టాలో రాజకీయ ఆశ్రయం కావాలని కోరినట్లు తెలిసింది.
అసలేం జరిగింది?.. సభా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఇద్దరు అగంతకులు విమానంలోకి కాక్‌పిట్‌లోకి చొరబడ్డారు. చేతిలో గ్రనేడ్లు పట్టుకుని.. విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. దీంతో పైలెట్లతోపాటు విమానంలో ఉన్నవారిలోనూ ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థమయ్యేలోపునే విమానం దారి మళ్లింది. ఈ సమయంలో విమానంలో 28 మహిళలు, ఓ చిన్నారితో సహా 118 మంది ప్రయాణికులున్నారు. దీంతో లిబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. హైజాకర్లు విమానాన్ని మాల్టాకు దారి మళ్లించారు. రన్‌వేపైనే గంటసేపు విమానాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఆందోళన చెందిన విమానాశ్రయాధికారులు.. పలు విమానాలను ఇటలీకి దారిమళ్లించారు. మరికొన్ని మొదట వాయిదా పడ్డా.. తర్వాత మొదటి రన్‌వే ద్వారా ల్యాండ్ అయ్యాయి. అటు విమానాశ్రయాధికారుల సూచనతో రంగంలోకి దిగిన మాల్టా ఆర్మీ ఎయిర్‌బస్‌ను చుట్టుముట్టింది.
బందీలను వదిలిపెట్టాలని హైజాకర్లకు సూచించింది. రెండున్నర గంటల చర్చల తర్వాత.. ప్రయాణికులను క్షేమంగా హైజాకర్లు వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ‘విమాన సిబ్బంది కూడా క్షేమంగా బయటకు వచ్చేశారు. హైజాకర్లు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్నాం’ అని మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్ ట్వీట్ చేశారు. దీంతో కథ సుఖాంతమైనట్లు అధికారిక సమాచారం అందింది. కాగా, ఇద్దరు హైజాకర్లు గఢాఫీ అనుకూల పార్టీ పెట్టనున్నట్లు తెలిపారని లిబియా విదేశాంగ మంత్రి వెల్లడించారు.