కొలంబో: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చేసిన తాజా ప్రకటన అక్కడి ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత తప్పదన్న సంకేతాలు ఇచ్చారాయన. అంతేకాదు.. వచ్చే సీజన్‌కు కాకుండా ఆపై సీజన్ సమయానికే రైతులకు ప్రభుత్వం తరపున సాయం అందుతున్న ప్రకటన.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు చచ్చిపోతామేమో అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 28 శాతానికి పెరగ్గా, రానున్న రెండు నెలల్లో అది 40 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు 46 శాతం పెరగడంతో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం కనిపిస్తోంది.
కాగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉందని వెల్లడించారు. అయితే, ఎటువంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రోత్సాహం అందిస్తామని, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, యాలా (మే-ఆగస్టు సీజన్) నాటికి ఎరువులు సమకూర్చుకోలేమని, మహా (సెప్టెంబరు-మార్చి) సీజన్ నాటికి ఎరువులు అందజేతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని విక్రమసింఘే వెల్లడించారు.
దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీలంకలో పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తులా పరిణమించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ లతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమేపీ కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతుండగా, చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసరాలు దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన గ్యాస్, కిరోసిన్ కూడా దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడంలేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment