పట్టెడన్నం దొరక్క బక్కచిక్కిపోయి.. డొక్కలు ఎండుకుపోయి ఆకలితో నకనకలాడుతూ పసికందుల దృశ్యాల నడుమ.. పాలబుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా తండ్రి చెయ్యిలో చెయ్యేసి నడయాడుతున్న కిమ్ తనయ దృశ్యాలు మరోవైపు..
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ఒకవైపు ప్రజలు దీనావస్థలో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు విలాసవంతమైన జీవనశైలితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు కిమ్ కుటుంబం ప్రయత్నిస్తోంది. నానాటికీ దిగజారిపోతున్న అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పతనం గురించి రేడియో ఫ్రీ ఏషియా.. రహస్యంగా అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో చాలామంది కిమ్, ఆయన కుటుంబం అనుభవిస్తున్న రాజభోగాలపై మండిపడ్డారు.
నా కుటుంబం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పూట తిండికి చాలా కష్టంగా గడుస్తోంది. నాకూ పదేళ్ల పాప ఉంది. ఆకలితో నా బిడ్డ అల్లలాడిపోతోంది. కానీ, ఈ దేశ అధ్యక్షుడి కూతురు రంగు రంగుల బట్టలతో నిత్యం టీవీల్లో కనిపిస్తోంది. ఆమె పాల బుగ్గలే చెబుతున్నాయి.. ఆమెకు ఎలాంటి తిండి అందుతుందో!. పైగా ఈగ కూడా వాలకుండా ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. మరి.. మా పిల్లలు ఏం పాపం చేశారు? లక్షల మంది ఉసురు ఊరికే తగలకుండా ఉంటుందా? అంటూ ఆ వ్యక్తి కిమ్‌కు శాపనార్థాలు పెట్టాడు.
ఇదిలా ఉంటే.. మరోవ్యక్తి సైతం కిమ్ కూతురి ప్రస్తావన తెచ్చి విమర్శలు గుప్పించాడు. దేశంలో ఎంతో మంది పిల్లలు తిండి దొరక్క అల్లలాడిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. బక్కచిక్కిపోయిన మా బిడ్డల రూపాలు చాలవా? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. అయినా.. ఇవేం కిమ్‌కు పట్టవు అంటూ మరో వ్యక్తి విమర్శించాడు. మొత్తం వెయ్యికి పైగా ప్రజల అభిప్రాయాలను.. వాళ్ల గుర్తింపును బయటకు రానీయకుండా జాగ్రత్త పడింది. రాజధాని ప్యాంగ్యాంగ్‌తో సహా చాలా చోట్ల ఆకలి మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ అంకెలను బయటకు పోకుండా కఠిన వైఖరి అవలంభిస్తోంది కిమ్ ప్రభుత్వం.
ఇదిలా ఉండగా.. కిమ్ గారాల కూతురు కిమ్ జు ఏ గత కొంతకాలంగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. క్షిపణి పరీక్షల దగ్గరి నుంచి రకరకాల ఈవెంట్స్‌కు ఆమెను వెంటేసుకుని వెళ్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్. దీంతో.. తదుపరి కిమ్ తర్వాత ఆ చిన్నారేనంటూ చర్చ మొదలైంది. అయితే పాలనలో పురుషాధిపత్యం ప్రదర్శించే ఉత్తర కొరియాలో ఆ అవకాశం లేదంటూ కొట్టిపారేస్తున్నారు విశ్లేషకులు.
ఉత్తర కొరియా అధికారిక మీడియా ఏనాడూ కిమ్ కుటుంబ సభ్యుల వివరాలను గురించి బయటి ప్రపంచానికి తెలియజేయలేదు. అయితే సియోల్ నిఘా ఏజెన్సీలు మాత్రం ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు(13, 10, 6 వయసు) ఉన్నారని మాత్రం చెబుతోంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ బీజేపీనే!
Comments
Please login to add a commentAdd a comment