‘నేను రణిల్ విక్రమసింఘేను... రణిల్ రాజపక్సను కాదు’ అన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే భారత్ పర్యటనకొచ్చేముందు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావొస్తుండగా తన తొలి విదేశీ పర్యటనకు ఆయన మన దేశాన్నే ఎంచుకున్నారు. సందర్భం ఏమైనా కావొచ్చుగానీ, రణిల్ అలా వ్యాఖ్యానించక తప్పని పరిస్థితులైతే శ్రీలంకలో ఈనాటికీ ఉన్నాయి. రణిల్‌ను ఇప్పటికీ రాజపక్స ప్రతినిధిగానే చాలామంది పరిగణిస్తున్నారు.
నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటి, ఎక్కడా అప్పుపుట్టని స్థితి ఏర్పడిన పర్యవసానంగా నిరుడు జనాగ్రహం కట్టలు తెంచుకుని అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఐఎంఎఫ్ 290 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాక దేశం కాస్త కుదుటపడిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, అధిక ధరలు పీడిస్తున్నాయి. సుమారు 68 శాతం మంది జనాభా అర్ధాకలితో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విక్రమసింఘే భారత పర్యటనకొచ్చారు. ఆపత్స మయాల్లో ఆదుకోవటం నిజమైన మిత్ర ధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రణిల్ ఏలుబడి మొదలయ్యాక 400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. ఆ తర్వాతే ఐఎంఎఫ్ రుణం మంజూరైంది. శ్రీలంక దాదాపు 8,300 కోట్ల డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోగా, అందులో సగం విదేశీ రుణాలే.
హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండటం లంకకు వరం. మన దేశం నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహ హస్తం అందించటంలోని మర్మం అదే. ఎల్‌టీటీఈని ఎదుర్కొనడానికి కావాల్సిన 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు, ఎఫ్ 7 జెట్ ఫైటర్లు, విమాన విధ్వంసక తుపాకులు, జేవై–11 రాడార్ ఇవ్వటంతో లంక, చైనాల మధ్య అనుబంధం పెరిగింది.
ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు తలుపులు బార్లా తెరిచారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70 శాతం ప్రాజెక్టులు చైనావే. ఒక్క హంబన్ టోటా నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా 3 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. సింగపూర్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న హంబన్‌టోటా నౌకాశ్రయం పడకేసింది.
దాన్ని నిర్వహించటం చేతకాక 99 ఏళ్లపాటు చైనాకు ధారాదత్తం చేయడానికి లంక అంగీకరించాల్సివచ్చింది. ఏమైతేనేం శ్రీలంక విదేశీ రుణాల్లో 10 శాతం చైనావే. కానీ నిరుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఒక లెక్క ప్రకారం 2025 వరకూ శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించాల్సిన స్థితిలో పడింది. గత ఏణ్ణర్ధంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది.
లంకనుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి గణనీయంగా నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచీ, ఐఎంఎఫ్ నుంచీ అందు తున్న సాయం లంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదనీ, దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనీ శుక్రవారం మన విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో అతిశయోక్తి లేదు.
మన ఇతిహాసం రామాయణం లంకతో ముడిపడి వుంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు అక్కడున్నాయి. ఇవన్నీ ఇక్కడినుంచి వెళ్లే యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగాన్ని కుంగ దీస్తున్నాయి. కనీసం జెనరేటర్లతో నడిపిద్దామన్నా ఇంధన కొరత పీడిస్తోంది.
దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52 శాతం. పరిశ్రమల్లో వీటి వాటా 75 శాతం. ఉపాధి కల్పనలోనూ దీనిదే ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవటం,ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రణిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి.
అయితే ఇరు దేశాల మధ్యా సమస్యలు లేకపోలేదు. లంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండికొడుతున్నాయని లంక ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాకుతో తరచు లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందనీ, గత రెండేళ్లుగా 619 మంది జాలర్లు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారనీ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు.
గతంలో మన దేశం అప్పగించిన కచ్చాతీవు దీవిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక లంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలనీ, స్వయంపాలనకు అవకాశమీయాలనీ, వారు గౌరవప్రదంగా జీవించటానికి తోడ్పడాలనీ మన దేశం అడుగుతోంది. రణిల్ తాజా పర్యటన ఇలాంటి సమస్యల పరిష్కారానికి దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ భవిష్యత్తులో మరింత పటిష్టమవుతాయి.
లంకకు స్నేహహస్తం
Published Sat, Jul 22 2023 12:40 AM | Last Updated on Sat, Jul 22 2023 5:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment