శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారంట్రేడ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. " దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలుసు. అలాగే దేశం ఎదుర్కొంటున్న కష్టాలు గురించి కూడా తెలుసు. ఉపాధి తగ్గింది. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం జీవన వ్యయాన్ని పెంచడమే గాక జీవనశైలిని కూడా మార్చింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గం" అని పునరుద్ఘాటించారు.
ఈ ఘోరమైన ఆర్థిక పరిస్థితి విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేయడంతో ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ సమస్యలను ఎదుర్కొనడానకి గల కారణాల గురించి మాట్లాడటం వ్యర్థం అని, ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్‌వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని తెలిపారు. ఇప్పటికే ఈ విషయం గురించి జపాన్‌తో చర్చలు పూర్తి చేశామని అన్నారు. తాము రుణా సాయం పొందిన మూడు ప్రధాన దేశాలు (చైనా, జపాన్, భారత్)లో జపాన్ కూడా ఒకటని చెప్పారు.
అలాగే యూరప్‌లో ఆర్థిక వృద్ధి మందగించిందని చెప్పారు. ఇలాంటి స్థితిలో వచ్చే ఏడాది తమ ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉన్నందున పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలు తదితరాలపై రణిల్ చర్చించారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి విశ్వాసాన్ని పొందేలా విజయవంతమైన చర్చలు జరపడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తునట్లు చెప్పారు. 2024 కల్లా మెరుగైన ఆర్థిక ప్రగతిని సాధించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేటు రంగాన్నికూడా బలోపేతం చేస్తూ.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించాలి, తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని రణిల్ చెప్పారు.
(చదవండి: నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం.. 72 మంది ప్రయాణికులు..)
Comments
Please login to add a commentAdd a comment