సంక్షోభంలో ఖతార్
దుబాయ్: ఖతార్ తో వ్యాపార, దౌత్యపరంగా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రయిన్, ఈజిప్టులు ప్రకటించాయి. నాలుగు దేశాల నిర్ణయంతో ఖతార్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అందుకు కారణం ఆ దేశం 90 శాతం ఆహార పదార్దాలను దిగుమతి చేసుకుంటుండటం. ఒక్క సౌదీ అరేబియా నుంచే 40 శాతం ఆహారపదార్ధాలను ఖతార్ దిగుమతి చేసుకుంటోంది.
నాలుగు దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక పెద్ద కారణం ఉంది. ఖతార్ మిలిటెంట్ల గ్రూప్ లకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రీజనల్ పాలసీని ఉల్లంఘించినందుకు ఖతార్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ నాలుగు దేశాలు పేర్కొన్నాయి. దీనిపై మాట్లాడిన మిడిల్ ఈస్ట్ ఆహార నిపుణుడు క్రిస్టియన్ హెండర్ట్స్.. ఖతార్ లో తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నిబంధనల కఠినతరంతో డైరీ, మాంసం, కూరగాయలు తదితరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కాగా, ఆహార కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆహారపదార్ధాల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోకుంటే వ్యవస్ధపై తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.