లాభసాటి వ్యవసాయానికి కృషి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆహార కొరత తీర్చేందుకు ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా మరోవైపు కృషి జరుగుతుందని చెప్పారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తమిళనాడుకు చెందిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా వర్సిటీలోని డైక్‌మెన్ హాలులో ఏర్పాటు చేసిన ఆరవ ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు సోమవారం కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం శాఖ మంత్రి వై.ఎస్. చౌదరి(సుజనా చౌదరి)జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి.
తొలిరోజు సమావేశంలో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతుకు 50 నుంచి 75 శాతం వరకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నట్టు మంత్రి చెప్పారు. బయో టెక్నాలజీతో వ్యవసాయం చేయాలని, ఈ-మార్కెటింగ్ ద్వారా పంటకు గిట్టుబాటు ధర పొందేలా రైతులు చైతన్యవంతం కావాలని కోరారు. గుంటూరులో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతిక పరమైన అభివృద్ధి ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు సరైన విధానంలో చేరడంలేదన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో యువత అధిక పరిశోధనలు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. నూతన రాజధాని గుంటూరును సైన్స్ సిటీగా గుర్తించాలని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరిని కోరారు. వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగితేనే ఆకలిచావుల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు.
గుంటూరును కూడా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలా అభివృద్ధి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ కోరారు. ప్రస్తుతం ఆహార ధాన్యాల దిగుబడిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరగాలని కోరారు.
మండలి చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ స్వామినాథన్ ఫౌండేషన్ వ్యవసాయాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టానికి తగిన పరిహారం రైతుకు చేరడం లేదన్నారు.
పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, ఆహారభద్రత, ఆకలి చావులు గురించి మాట్లాడేటప్పుడు గిట్టుబాటు ధర గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు.
వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ ఎరువులకు సబ్సిడీ కల్పించాలని, యువశాస్త్రవేత్తలు నూతన వంగడాలపై విస్తృత పరిశోధనలు చేయాలని కోరారు.
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మధ్య అంతరాన్ని తొలగించాలని కోరారు. ప్రస్తుతం భూముల ధరలకు, వాటి నుంచి లభిస్తున్న ఆదాయానికి పొంతన లేదన్నారు.
ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిపోయాయన్నారు. 1997 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరిలో 90 శాతం మంది కౌలురైతులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఆహార కొరతపై సమావేశాలు నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం యువత విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగ ఫలాలను సమాజానికి మరింత చేరువచేయాలని కోరారు.
ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ అజయ్ ఫరీదా, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరైక్టర్ ఆచార్య డి.నారాయణరావు, ఆర్‌జీఎన్‌వైడీ డెరైక్టర్ డాక్టర్ లతాపిళ్ళై, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ పాల్గొన్నారు. సమావేశాలు మూడురోజులపాటు జరగనున్నాయి.