Bigg Boss 4 Telugu Contestants Dethadi Harika, Ariyana Glory Special Chit Chat With Sakshi - Sakshi
Sakshi News home page

అవినాష్‌ బాగా చూసుకున్నారు: అరియానా

Published Tue, Dec 29 2020 12:00 AM | Last Updated on Tue, Dec 29 2020 11:05 AM

Bigg Boss 4 Telugu Contests Harika And Ariyana Glory With Sakshi

అలేఖ్య హారిక,అరియానా గ్లోరీ

ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. 

‘దేత్తడి’ అంటూ యూట్యూబ్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్‌ మనీ కోసం పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసింది. జాబ్‌ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. 

►యాంకరింగ్‌ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్‌ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. 

ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? 
హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్‌బాస్‌ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్‌ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్‌ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్‌ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్‌. లాక్‌డౌన్‌ టైమ్‌లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. 

అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్‌ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్‌ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్‌ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్‌గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్‌ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్‌బాస్‌ ‘స్పెషల్‌ కేర్‌ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్‌ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో మీ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది?
హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్‌బాస్‌ హౌజ్‌లో అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్‌... మస్తుంది. టాస్క్‌ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్‌ ఎక్స్‌పరిమెంట్‌. టైమ్‌ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. 

అరియానా: బిగ్‌బాస్‌ సీజన్‌ 4 అంతా రికార్డ్‌ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను.  అన్ని రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్‌పీరియెన్స్‌ చేశాను. 

బిగ్‌బాస్‌ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి?
హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. 

అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. 

బిగ్‌బాస్‌లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్‌..?
హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్‌ చేసినా బెస్ట్‌ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్‌ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్‌గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. 

అరియానా: మా ఫ్రెండ్స్‌ ఎలిమినేట్‌ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్‌లు ఎవరికి ఇవ్వాలో నోట్‌ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్‌బాస్‌ నాకు గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ కన్‌సర్న్‌కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో.  

రూమర్స్‌ గురించి.. ఏమనుకుంటారు? 
హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. 

అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్‌ప్లనేషన్‌ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ, ఒక పర్సన్‌కే కనెక్ట్‌ అవుతాం. నా సిచ్యుయేషన్‌ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. 

సింగిల్‌ పేరెంటింగ్‌లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది?
హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్‌ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్‌ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌గా జాబ్‌లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్‌ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్‌ ద్వారా క్రియేటివ్‌ థాట్స్‌ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నా. వీకెండ్‌లో స్కిట్లు ప్లాన్‌ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్‌ అయ్యాను. 

అరియానా: లైఫ్‌లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్‌లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్‌ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్‌వాల్వ్‌ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. 

వర్క్‌లో అధిగమించిన సమస్యల గురించి..
హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్‌ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్‌ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్‌ చేసుకోవడానికి టైమ్‌ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్‌టాక్‌ వీడియోలు చూసి, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్‌ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్‌ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్‌ అప్పుడు చాలా టెన్షన్‌ పడ్డాను. మంచి రిజల్ట్‌ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్‌ చేస్తూనే ఈ వర్క్‌ వీకెండ్‌లో చేసేదాన్ని. ఆఫీస్‌ షూట్‌.. షూట్‌.. ఆఫీస్‌ అన్నట్టుగా చేసేదాన్ని. 

అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్‌ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్‌ క్రియేట్‌ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్‌ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్‌ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్‌ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్‌ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. 

మీ ముందున్న లక్ష్యం? 
హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్‌ చేయాలి. అది సినిమా లేదా వెబ్‌సీరీస్‌. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్‌ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్‌ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్‌. 

అరియానా: మంచి యాంకర్‌ అవ్వాలి. క్రికెట్‌లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్‌ ఛానెల్‌లో ఇంటర్వ్యూస్‌ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్‌ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను.  

– నిర్మలారెడ్డి
సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement