గోలి శ్యామల
దేన్ని చూసి భయపడతామో దానితోనే తలపడితే... ధైర్యం విజయసోపానాలతో స్వాగత సత్కారం చేస్తుంది. నీళ్లను చూసి భయపడిన ఆ నీళ్లతోనే ఫైట్ చేసింది రికార్డులను కొల్లలుగా కొల్లగొడుతోంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ నీటి మెరుపుతో ముచ్చటించిన విశేషాలు ఇవి.
వయసు మీద పడుతున్నకొద్దీ ఆడవారిలో సహజంగా ఓ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఆ భయం వెనక దాగున్న వాస్తవం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగిన సాధన విషయంలో అంతగా శ్రద్ధ ఉండదు. ఈ విషయాన్ని తన సంభాషణలో తొలుతగా ప్రస్తావించిన శ్యామల పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో.
సోషియాలజీ విభాగంలో పట్టభద్రురాలైన శ్యామల నీళ్లు తనతో స్నేహం చేసిన తొలినాళ్ల గురించి చెబుతూ– ‘‘నేను యానిమేషన్ మూవీస్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా ఉండేదాన్ని. దీంట్లో నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. బిజినెస్ క్లోజ్ చేశాను. మైండ్‌ను మరోవైపుకు మళ్లించాల్సిన అవసరం అది. అప్పుడు స్విమ్మింగ్ ఎంచుకున్నాను. ఎవరైనా నీళ్లలో ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు వెయిట్‌లాస్, ఫిట్‌నెస్ గురించో ఆలోచిస్తారు.
కానీ, నేను ఒక లక్ష్యం ఉండాలనుకున్నాను. అయితే, నీళ్లంటే విపరీతమైన భయం ఉండేది. నాలుగేళ్ల క్రితం సమ్మర్ టైమ్‌లోనే మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాను. ఆ రోజు నీళ్లలో దిగినప్పుడు వచ్చిన వణుకు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్ని రోజుల్లో ఏడు అడుగుల దూరం డైవింగ్ బోర్డ్ నుంచి జంప్ చేసినప్పుడు వణికిపోయాను. కానీ, మూడు నెలల్లోనే పోటీలో పాల్గొనేంతగా సాధన చేశాను. మొదటిసారే కాంస్య పతకం వచ్చింది’’ అని తెలిపిన శ్యామల యుద్ధంలో దిగేంతవరకే భయం. దిగితే ఎంతటివారినైనా ఓడించాల్సిందేననే తపనను కనబర్చింది.
సంద్రంవైపు గురి
నాటి నుంచి పాల్గొన్న ప్రతీ పోటీలో మెడల్స్, అవార్డ్స్ వరిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్తలు కంటబడ్డాయి. ఆ విషయాన్ని శ్యామల ప్రస్తావిస్తూ ‘నేనూ సముద్రాన్ని ఈదుతాను.. అని స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్లు నా వయసు గురించి ప్రస్తావించారు. పాతికేళ్లలోపైతే ఓకే కానీ, నలభై ఏళ్లు దాటాక చాలా కష్టం అన్నారు. ఆ కష్టాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలనుకున్నాను. వయసు అనే అడ్డంకిని దాటాలనుకున్నాను.
అయితే, ఇంగ్లిష్ ఛానెల్ కన్నా మన దేశంతో కలిసి ఉన్న సముద్రం అయితే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకు రామసేతు దృష్టిలోకి వచ్చింది. అక్కణ్ణుంచి నా ప్రయత్నం, ప్రయాణం ఆగలేదు. నిరంతరం సాధన. దానికి తోడు ఇప్పటి వరకు ఎవరైనా రామసేతును క్రాస్ చేశారా.. అనే శోధన. అలాంటి వారి కోసం అన్వేషణ.. నిరంతరం సాగుతూనే ఉంది. అప్పుడే రామసేతును క్రాస్ చేసిన రాజా త్రివేది గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రోత్సహించి, తగు సూచనలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన, ఏడాది క్రితమే పూర్తి చేయాలనుకున్నాను. కానీ, కోవిడ్ కారణంగా మరో ఏడాది పట్టింది’ అంటూ సముద్రంపై తను గురిపెట్టిన లక్ష్యాన్ని వివరించారు.
సముద్రమంత సాధన!
స్త్రీ, పురుషులు ఎవరైనా వారు చేసే పనుల ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఈ విషయం గురించి అడిగితే.. ‘నిజమే, కానీ జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి’ అంటారు శ్యామల. మా వారు ‘ఏం ఫర్వాలేదు. నువ్వు తిరిగి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కి ‘ఇండియా,–శ్రీలంక ఫ్రెండ్‌షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టాం. ఫెడరేషన్ వాళ్లు ఒక అబ్జర్వేటర్, మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వేటర్ వచ్చారు.
కుటుంబ సభ్యులతో శ్యామల
క్రూలో 14 మందిమి వెళ్లాం. ఒక డాక్టర్, ఫీడింగ్‌కి సాయం చేయడానికి ఫ్రెండ్‌ని తీసుకెళ్లాను. ఉదయం 4 గంటలకు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. రీచ్ అయ్యేసరికి సాయంకాలం 5:35 గంటలు అయ్యింది. స్విమ్మింగ్ మొదలయ్యే క్షణం నుంచి ధనుష్కోటికి చేరుకునే క్షణం వరకు నా మదిలో ఒకటే ఆలోచన స్విమ్.. స్విమ్.. అంతే! 13 గంటల 43 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ పాక్ జలసంధి ని బులా చౌదరి 13 గంటలు 55 నిమిషాల్లో ఈది రికార్డ్‌లో ఉన్నారు. ఆ రికార్డ్‌కి దరిదాపుల్లో వెళ్లగలనా అనుకున్నాను. కానీ, ఆ రికార్డ్‌ను ్ర»ే క్ చేయాలనే సంకల్పం నన్ను ముందు నిలబెట్టింది’ అని వివరిస్తున్నప్పుడు విజయం తాలూకు ఆనందం ఆ కళ్లలో కనిపించింది.
ధైర్యం వెన్నుదన్ను
సముద్రాన్ని దూరం నుంచి చూడటం ఓ ఆహ్లాదం. కానీ, సముద్రాన్ని ఈదడం అంటే.. ‘షార్క్స్ ఉంటాయి. ఏ క్షణమైనా అవి దాడి చేయవచ్చు. మింగేయచ్చు. ఇలా వీటి గురించి భయపెట్టి కొందరు కిందటేడాది స్విమ్మర్స్ ఆలోచనను మార్చేశారు. కానీ, చావో రేవో తేల్చుకోవాలనుకున్నాను. ఏమీ సాధించకుండా ఉండేదానికన్నా ఒక ధీరలాగా పోరాడైన పోవాలనుకున్నాను. అందుకే భయానికి ఏ మాత్రం తావివ్వలేదు. నేను గమనించిందేంటంటే స్విమ్మర్స్‌ని షార్క్స్ దాడి చేసిన ఘటనలైతే ఏమీ లేవు.
ఈ రికార్డ్‌లో భాగంగా నీళ్లలో ఉన్నంతసేపు ఏదీ పట్టుకోకూడదు, దేనినీ ముట్టుకోకూడదు. శ్రీలంక నుంచి స్విమ్ చేస్తున్నప్పుడు అక్కడి నీళ్లలో సులువు అనిపించింది. అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటరయ్యేటప్పుడు ముఖ్యంగా చివరి 3 గంటలు చాలా కష్టమనిపించింది. గట్టి అలలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడా కష్టమంతా మర్చిపోయాను. సక్సెస్ ను ఆనందిస్తున్నాను’ అని స్విమ్మింగ్ పూల్ నుంచి సముద్రాన్ని జయించిన విజయ ప్రవాహం గురించి వివరిస్తూనే ఉన్నారు శ్యామల.
ఒక దారి మూసుకుపోతే దేవుడు వేయి అవకాశాల దారులను మన ముందుంచుతాడు. ఏ దారిలో వెళ్లినా లక్ష్యం వైపుగా గురి ఉంటే విజయం వరించి తీరుతుంది. 47 ఏళ్ల వయసులో 30 మైళ్ల పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన శ్యామల విజయం ఒక్కనాటితో కాదు నిరంతర సాధనతో, పట్టుదలతో ఆమె సొంతమైంది.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment