కలలో కూడా అలలపై ఈదాలనే ఆలోచనే రాలేదు. సప్త సముద్రాలు పేర్లు విన్నప్పుడూ.. వాటిపై తన పేరున రికార్డులు సృష్టిస్తానని అనుకోలేదు. కానీ.. సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్న ఆమె ప్రపంచంలోని సముద్రాలను సైతం అలవోకగా ఈదేస్తున్నారు. అది కూడా 47 ఏళ్ల వయసులో. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఎదురొడ్డుతూ.. కారు చీకట్లలో సైతం నడి సంద్రాన్ని వెనక్కి నెట్టేస్తూ అంతర్జాతీయ స్విమ్మర్లను సైతం అబ్బుర పరుస్తున్నారు స్విమ్మర్ గోలి శ్యామల.
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సామర్లకోట గోలి శ్యామల స్వస్థలం. తండ్రి సాధారణ రైతు. చిన్నప్పటి నుంచి శ్యామలను చదువు వైపే ప్రోత్సహించారు. ఎంఏ సోషియాలజీ చేసిన ఆమె వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కళలపై ఆసక్తితో యానిమేషన్ నేర్చుకుని.. ఒక సంస్థను కూడా స్థాపించారు. ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఆ సంస్థను మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన శ్యామల దానినుంచి బయటపడేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. తన స్విమ్మింగ్ శిక్షణ వృథా కాకూడదనే ఆలోచన ఆమెను శ్రీలంక–భారత్ మధ్య గల పాక్ జలసంధిని అధిగమించేలా చేసింది. గతేడాది మార్చిలో 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని 13.47 గంటల్లో పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ, తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకు ముందు భారత దేశానికి చెందిన ప్రముఖ స్విమ్మర్ అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత బులా చౌదురి 2004లో 35 ఏళ్ల వయసులో 14 గంటల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
కఠినమైన ‘కాటాలినా’లోనూ విజయం
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సెవన్ ఓపెన్ ఓషన్ వాటర్ స్విమ్‌లలో (సప్త సముద్రాల్లో ఈత అని కూడా అంటారు) ఒకటిగా పిలిచే కాటాలినా చానల్‌ను గత ఏడాది సెప్టెంబర్ 29న తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు శ్యామల. కాలిఫోర్నియాలోని శాంటా కాటాలినా ద్వీపం నుంచి లాస్ ఏంజెల్స్ మధ్య విస్తరించి ఉన్న 36 కిలోమీటర్ల పొడవైన చానల్‌ను ఈదడం ఆషామాషీ కాదు. 15 డిగ్రీల చల్లని నీరు.. ఎముకలు కొరికే చలి.. సముద్రంలోకి దిగితే రక్తం గడ్డకట్టే వాతావరణం అక్కడ ఉంటాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈదడం అంటే శీతల ప్రాంతాల నుంచి వచ్చిన సాహసికులు సైతం ఐదారు సార్లు ప్రయత్నించక తప్పదు. అలాంటిది ఉష్ణ మండల ప్రాంతం నుంచి వెళ్లిన శ్యామల అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి 19.47 గంటల్లో కాటాలినా లక్ష్యాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. కాటాలినాను అధిగమించిన 10 మంది భారతీయుల్లో ముగ్గురు మహిళలు ఉంటే అందులో తెలుగు గడ్డ నుంచి శ్యామల స్థానం సంపాదించారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ‘కైవీ’
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కైవీ చానల్‌లో సాహసం చేసిన తొలి ఆసియా మహిళగా శ్యామల రికార్డు నెలకొల్పారు. అమెరికాలోని హవాయి దీవుల్లో 48 కిలోమీటర్ల పొడవైన ‘కైవీ చానల్‌ను ఈదడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామల ప్రయత్నించి విఫలమయ్యారు. కేవలం లక్ష్యానికి 4.5 కి.వీ. దూరంలో ఒక్కసారిగా సముద్రంలో చోటుచేసుకున్న మార్పులు.. ఆరు కిలోమీటర్ల వేగంతో వెనక్కి నెడుతున్న అలల మధ్య నాలుగు గంటలు శ్రమించినా మూడు కిలోమీటర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ప్రయత్నాన్ని అర్ధంతరంగా ముగించుకున్నారు. అయితే కైవీ సాహస యాత్రలో నిర్విరామంగా 22 గంటలపాటు 43.5 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది ప్రశంసలు అందుకున్నారు.
‘ఇంగ్లిష్ చానల్’ దిశగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లిష్ చానల్ (ఉత్తర ప్రాన్స్–దక్షిణ ఇంగ్లండ్ మధ్య అట్లాంటిక్ సముద్రం)ను ఈదే లక్ష్యంతో శ్యామల కఠోర సాధన చేస్తున్నారు. జూన్‌లో చేసే ఈ సాహస యాత్రకు శ్యామల రోజుకు 8 గంటలు సాధనలో 6గంటలకు పైగానే స్విమ్మింగ్ పూల్‌లో ఉంటున్నారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా
నేను సముద్రాన్ని ఈదుతా అన్నప్పుడు అన్నిచోట్లా హేళనకు గురయ్యాను. చాలామంది నీ వయసేంటి అన్నారు. కుటుంబ సభ్యులైతే స్విమ్మింగ్ దుస్తుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, నేను ఆత్మ విశ్వాసంతోనే ముందుకు వెళ్లాను. నా దృష్టిలో వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నేను కైవీని అధిగమిస్తున్నప్పుడు అతిపెద్ద వేల్ చేప నన్ను తాకుతూపోతుంటే గుండె ఝల్లుమంది. చాలాచోట్ల షార్క్ పిల్లలు వెంటపడేవి. ఒక్కోసారి భయం వేసేది. ఆర్థిక ఇబ్బందుల్లో ఈదుతున్న నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను.
– గోలి శ్యామల, అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్
Comments
Please login to add a commentAdd a comment