మనసే జతగా: టేక్... ఓకే | Director shankar, his wife Exclusive interview | Sakshi
Sakshi News home page

మనసే జతగా: టేక్... ఓకే

Published Wed, Aug 14 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

మనసే జతగా: టేక్... ఓకే

మనసే జతగా: టేక్... ఓకే

లైట్స్ ఆన్ ... స్టార్ట్ కెమెరా ... యాక్షన్ ...
 సీన్ కంప్లీట్...  ప్యాకప్!
 ఎవరింటికి వాళ్లు... డైరెక్టర్ ఇంటికి డైరెక్టర్.
 ఇంట్లో మళ్లీ ఇంకో డైరెక్షన్.
 మూవీ డెరైక్షన్ కాదు, ఫ్యామిలీ డైరెక్షన్.
 ఒకరు కాదు, ఇద్దరు డైరెక్టర్లు!
 ఒకర్నొకరు లీడ్ చేసుకుంటూ ఒకరి మూడ్స్ ఒకరు  ఫిల్టర్ చేసుకుంటూ,
 ఫీడింగ్ ఇచ్చుకుంటూ పదహారేళ్లుగా... ‘ఉమ్మడి’ దర్శకత్వం!
 ‘మాధవిదే ప్రధానపాత్ర’ అంటారు శంకర్.
 ‘లేదు లేదు, ఓన్లీ సపోర్టింగ్’ అంటారామె.
 ఈ ఆలుమగల సమన్వయ చిత్రమే...
 ఈవారం ‘మనసే జతగా...’
 
 కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చెప్పరు. కొన్నిరోజులు పోయాక తెలుస్తుంది. అలాగే ఈయనకెరియర్‌లో ఉండే ఒడిదొడుకులను కూడా చెప్పరు. ‘ముందే చెప్పచ్చు’ కదా అంటాను. ‘చెబితే టెన్షన్ అవుతావు, ఆ టెన్షనేదో నేనే పడతాలే’ అంటారు.
 - మాధవి
 కష్టం చెప్పకుండానే మాధవి నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా షూటింగ్‌లో
 పాల్గొనేవారికి భోజన ఏర్పాట్ల కోసం పాట్లు పడుతుంటే  అన్నిరోజులూ అందరికీ తనే దగ్గరుండి వంట చేయించింది. కాస్ట్యూమ్స్ కోసం అప్పటికప్పుడు షాపింగ్ చేసేది.
 - ఎన్.శంకర్
 
 ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, యమజాతకుడు, జయంమనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జయ్ బోలో తెలంగాణ... సినిమాల డెరైక్టర్ ఎన్.శంకర్. ‘సినిమా తీసేటప్పుడు అది పూర్తయ్యేంతవరకు అందరి బాగోగులపై దృష్టిపెడతాను. అప్పుడే ఒక టీమ్‌గా అందరి కృషి మంచి ఫలితాన్నిస్తుంది. కుటుంబంలోనూ అంతే! భార్యాభర్తలు ఒక టీమ్‌గా ఉంటేనే కుటుంబం అనే నిజ జీవిత సినిమా మంచి ఫలితాన్నిస్తుంది’అన్నారు శంకర్, ఆయన భార్య మాధవి. వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి (నవంబర్ 16, 1997)16 ఏళ్లు అయ్యింది. వీరికి దినేష్, మహాలక్ష్మి ఇద్దరు సంతానం. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి రెండేళ్ల క్రితం చిన్న కుటుంబంగా మారిన ఈ దంపతులు తమ జీవితానుభావాలను ఇలా వెల్లడించారు.
 
 బాధ్యతల లోగిలిలో...
 ఉమ్మడికుటుంబంలో భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే పరిణామాలను శంకర్ వివరిస్తూ- ‘‘అమ్మ, నాన్న, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు... ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తించడంలో సంఘర్షణ ఎక్కువే ఉండేది. పెళ్లయిన మొదట్లో ‘రేపటి పరిస్థితి ఏంటి?’ అని మాధవి తరచూ బాధపడటం గమనించాను. ‘ఇంటికి పెద్ద కొడుకు, కోడళ్లుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాటి పైనే మనం ముందు దృష్టి పెట్టాలి. రేపు అంతా మంచే జరుగుతుంది’ అని తరచూ చెప్పేవాడిని. తనూ మెలమెల్లగా ‘నేను ఈ ఇంటికి పెద్ద కోడలిని... ఇలా ఉండాలి... ’ అని ఒక నిశ్చయానికి వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు అండగా నిలిచింది. మా తమ్ముళ్ల పెళ్లిళ్లు, చెల్లెలి పెళ్లి... మాధవి ముందుండి చేసింది. ఇప్పుడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. బాధ్యతలను అందరూ ఒకేసారి అర్థం చేసుకోలేరు. మెల్లమెల్లగా తెలుసుకుని ముందుకు సాగడమే దాంపత్యం’ అని తెలిపారు ఈ డెరైక్టర్.
 
 సర్దుబాట్లు కేరాఫ్ సంసారం
 పుట్టింట్లో చిన్నకూతురుగా, నలుగురు అన్నలకు గారాల చెల్లిగా పెరిగి, అత్తింటికి పెద్దకోడలిగా వెళ్లాక చేసుకున్న సర్దుబాట్లను ప్రస్తావిస్తూ- ‘‘ఇంటి దగ్గర ఉన్నన్నాళ్లూ అమ్మ, వదినలు కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు. అలాంటిది  అత్తింట అడుగుపెట్టాక కొన్నాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. అమ్మ ఎప్పుడూ చెబుతుండేది ‘ఇంట్లో ఎన్నిసమస్యలున్నా సరే, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి’ అని. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉమ్మడి కుటుంబంలో ఏవో మాట పట్టింపులు వస్తూనే ఉండేవి. పెళ్లయిన మొదట్లో వాటిని ఎలా తీసుకోవాలో అర్థమయ్యేది కాదు. అలా కొన్ని సమస్యలను పుట్టింటిలో చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈయన షూటింగ్ అని వెళ్లిపోతే, నేను పుట్టింటికి వెళ్లడమూ ఎక్కువే ఉండేది. మెల్లగా నేనే ఎక్కడ ఎలా ఉండాలి,  ఎలా నడుచుకోవాలనేవి అనుభవంతో తెలుసుకున్నాను’’ అని వివరించారు హోమ్ డెరైక్టర్ మాధవి.
 
 టెలిఫోన్ ధ్వనిలా పెరిగిన చనువు
 ఒకచోట పెరిగిన మొక్కను తీసి మరోచోట నాటితే అక్కడి పరిస్థితులను తట్టుకుంటూ పెరగడానికి కొంత టైమ్ పడుతుంది. పెళ్లికి ముందు అమ్మాయి కూడా అంతే! అంటారు ఈ దంపతులు. తన జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ మాధవి- ‘‘పదహారేళ్ల కిందట.. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఈ సంబంధం బాగుంటుందని నిశ్చయం చేశారు. అప్పటికి ఇంటర్మీడియెట్ చదువుతున్న నేను నా జీవిత భాగస్వామి ‘ఇలాగే ఉండాలి’ అని లెక్కలేం వేసుకోలేదు. అయితే ఎంగేజ్‌మెంట్ అయినరోజు మొదలు ఈయన నుంచి ఫోన్ల తాకిడీ పెరిగింది. ముందుగా ‘ఇంతగా ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి?’ అనుకున్నాను. కానీ, పోనుపోను మా మధ్య ఉన్న సందిగ్ధాలను, సందేహాలను ఫోన్ చెరిపేసింది. తరచూ మాట్లాడుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న భయం స్థానంలో స్నేహం ఏర్పడింది. ఒకసారి ఈయనే ‘జీవితాంతం కలిసి ఉండబోయేవాళ్లం. ఒకరి గురించి ఒకరం ముందే తెలుసుకొని, స్నేహం పెంచుకుంటే మన బంధం ఇంకా బలపడుతుంది. అందుకే ఈ ప్లాన్’ అని చెప్పారు. నాకూ ఇది కరెక్టే అనిపించింది’’ అన్నారు ఆమె.
 
 పెళ్లి తర్వాత పని వల్ల తమ మధ్య ఏర్పడిన ఖాళీని పూరించడానికి తీసుకున్న నిర్ణయాన్ని శంకర్ చెబుతూ- ‘‘పెళ్లి అయిన మూడు రోజులకే ‘శ్రీరాములయ్య’ సినిమా సందర్భంలో కార్ బాంబ్ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మాకేం కాకపోయినా పెళ్లికాగానే ఇలాంటి సంఘటన జరగడమేంటి అని పది రోజుల దాకా మామూలు మనుషులం కాలేకపోయాం. ఆ తర్వాత కొద్దిరోజులకే నేను సినిమా షూటింగ్ అంటూ వెళ్లిపోయాను. పెళ్లయిన వాతావరణం, కార్ బాంబ్ సంఘటన వల్ల మాధవి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేది. దీంతో నాతో సినిమా షూటింగ్స్‌కి రాజస్థాన్, ఢిల్లీ... ప్రాంతాలకు మాధవినీ తీసుకెళ్లాను. అది కాస్త మా ఫ్యామిలీ ట్రిప్ అయ్యింది. అప్పటివరకు కాస్త కినుకగా ఉండే ఈవిడ ప్రవర్తనలో మంచి మార్పులు చూశాను. దీంతో హమ్మయ్య అనుకున్నాను’’ అని చెబుతుంటే భాగస్వామి మనసు తెలుసుకొని భర్త ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ సంఘటన రుజువు చేసింది అనిపించింది.
 
 కోపం నుంచి రియలైజేషన్
 కోపతాపాలు దాంపత్యం మీద చూపిన సందర్భాలు, వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్న విధానాలను శంకర్ చెబుతూ-‘‘బయట ఉండే చికాకులు, కోపాలు ఎక్కడా చూపించలేక అణుచుకోవాల్సిన వృత్తి నాది. అలాంటప్పుడు ఆ కోపం మాధవి మీదకే వెళుతుంది. ఆ సమయంలో తను మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి నేను చేసిన పొరపాటేమిటో అర్థమైపోతుంది. నన్ను అర్థం చేసుకున్నది కాబట్టి మౌనంగా ఉంది. తనూ కోపగించుకుంటే ఇంటి ప్రశాంతత ఎంతగా దెబ్బతినేది, పిల్లలు ఎంత డిస్టర్బ్ అయ్యేవారు అని నాకు నేనే రియలైజ్ అవుతుంటాను’’ అన్నారు.  
 
 కలల కుటీరం
 భవిష్యత్తు పట్ల తన తపనను మాధవి తెలియజేస్తూ- ‘‘రెండేళ్లుగా వ్యవసాయం మీద ఎక్కువగా మనసు పోతోంది. కొంచెం భూమి కొనుక్కొని, కూరగాయలు, పూల తోటలు పెట్టాలి, పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆ విషయంలోనే ఈ మధ్య పోరుతూ ఉన్నాను. కాని వినీవిననట్టుగా ఉంటున్నారు’’ అని ఆమె కంప్లయింట్ చేస్తున్న ధోరణిలో ఉంటే - ‘‘ఆర్థికంగా అన్నీ అమరినప్పుడే ఇలాంటి కలలు సాకారం చేసుకోగలం. అంత తొందరపడవద్దు’ అని సర్దిచెబుతుంటాను’’ అన్నారు శంకర్. ‘భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి’ అని కలలు కనడంలో గృహిణిగా భార్య ఒకలా ఆలోచిస్తే, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వాస్తవానికి దగ్గరగా అనిపించారు శంకర్.
 
 ‘లవ్, అరేంజ్... ఏ తరహా పెళ్లి అయినా నిత్యం ఎవరికి వారు తమని తాము రీ షేప్ చేసుకుంటూ ఉండాలి. వృత్తిలో ఎదిగే క్రమంలోనే బయట ఎవరెవరి దగ్గరో ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటాం. అలాంటిది ఇంట్లో భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఇంకెన్నో సర్దుబాట్లు చేసుకోవాలి. తప్పదు. కొంత కన్విన్స్, మరికొంత కాంప్రమైజ్ అయినప్పుడే ఆ బంధం నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అందుకు ఇద్దరిలోనూ ఆ బంధాన్ని కాపాడుకోవాలనే తలంపు, ఎదురుచూసే సహనం ఉండాలి’ అని తెలిపారు శంకర్, మాధవి. మూడుముళ్ల బంధం ముచ్చటగా సాగాలంటే కన్విన్స్, కాంప్రమైజ్ కంపల్సరీ అని తమ జీవితానుభవాల ద్వారా స్పష్టం చేశారు ఈ జంట.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement