N shankar
-
తెరవెనుక థ్రిల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెరవెనుక’. విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టీఎన్నార్, శ్వేతా వర్మ, సంపత్ రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాతో తను మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నెలుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ –‘‘సామాజిక స్పహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాత మురళి జగన్నాథ్ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ–మాటలు: బాబా, కెమెరా: రాము కంద, సంగీతం: రఘురామ్. -
డైరెక్టర్ శంకర్‌కు భూమి, హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు ఎన్.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేంటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిగింది. శంకర్‌పల్లిలోని మోకిల్లాలో దర్శకుడు శంకర్‌కు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, కారు చౌకగా భూమిని కేటాయించారని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో రూ.50 కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు శంకర్ ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి లభిస్తుందని పేర్కొన్నారు. (‘దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదు’) అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఎంత ఉంటుందని హైకోర్టు ప్రశ్నించగా.. మార్కెట్ విలువ ప్రకారం రూ.2.50 కోట్లు ఉంటుందని హెచ్ఎండీఏ పేర్కొంది. మరి రూ.2.50 కోట్ల భూమిని ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు ఎకరా చొప్పున కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించగా.. తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. (ఏవిధంగా సమర్థించుకుంటారు..? ) -
దక్షయజ్ఞం టీజర్ బాగుంది
‘‘దక్షయజ్ఞం’ టైటిల్ చాలా బాగుంది. చారిగారు మంచి అభిరుచి, అనుభవం గల నిర్మాత. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే కథలను ఎన్నుకోవడం ఆయన ప్రత్యేకత. దర్శకుడు తోట కృష్ణ నిర్మాతల పక్షపాతి. ‘దక్షయజ్ఞం’ టీజర్ చాలా బాగుంది’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. సూర్య, మధులగ్న దాస్, శివప్రసాద్, సంజన, మేఘనా చౌదరి, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దక్షయజ్ఞం‘ (ది టార్గెట్). మహతి సాయి జస్వంత్ సమర్పణలో కస్తూరి ఫిలిమ్స్, విజయలక్ష్మీ మూవీస్ పతాకాలపై మెట్రో స్టూడియోస్ అధినేత ఈవీఎన్ చారి సారధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని ఎన్. శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తోట కృష్ణ– చారిగారి కాంబినేషన్లో మరెన్నో మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్, కెమెరా: ఆనంద్, నిర్మాతలు: చిన్న శ్రీశైలం యాదవ్, పున్న శ్యామ్‌రావు, బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్. -
రూ.5 కోట్ల విలువైన భూమి రూ.5 లక్షలా..!
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు ఎకరం రూ.5 కోట్ల విలువైన భూమిని రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సినీ స్టూడియో కోసం ఔటర్ రింగ్‌రోడ్‌కు సమీపంలోని నివాస ప్రాంతంలో ఖరీదైన భూమిని ఏవిధంగా కేటాయించారో, ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇదే తరహాలో ప్రభుత్వం పలువురికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని తక్కువ ధరలకే కేటాయించడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఆ కేసులన్నింటనీ కలిపి విచారిస్తామని, ఈ కేసుల్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
జూలైలో పుర ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. జూలైలోనే వాటిని పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలైలో అయిపోతుందని, ఆలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం కేబినెట్ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త మున్సిపాలిటీలు రావడంతో వాటి సంఖ్య 142కు పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలని అనుకుంటున్నామని, ఇం దుకు అసెంబ్లీలో చట్టం చేయాలా లేక ఆర్డినెన్స్ తేవాలా అని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు. వెంటనే బీసీ రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్లను పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు వెల్లడించారు. ‘‘రిజర్వేషన్లు అయిపోతే వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించవచ్చు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నం. పది పదిహేను రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తాం. జూలైలో 100 శాతం ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తం. మున్సిపల్ ఎన్నికలు అయిపోతే పరిపాలన చూసుకోవచ్చు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. భూ కేటాయింపులకు ఆమోదం: తెలంగాణ ప్రాంత సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు శంకర్‌పల్లిలోని మోకిల ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘స్టూడియో కట్టుకోవడానికి శంకర్ చాలా రోజుల నుంచి స్థలం కోరుతున్నరు. తెలంగాణవాది కావడం, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం, తెలంగాణ బిడ్డ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నం. విశాఖ శారదా పీఠం ట్రస్టుకు కూడా రెండెకరాల స్థలం కేటాంచాలని నిర్ణయించినం. సంస్కృత పాఠశాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్థలం కావాలని రెండు మూడేళ్లగా పీఠంవారు అడుగుతున్నరు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల స్థాపన కోసం స్థల కేటాయింపులు జరపాలని నిర్ణయించాం. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే నిర్మించినం. వరంగల్ రూరల్ జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థల కేటాయింపుల్లో మార్పు చేయాలని ఆ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అభిప్రాయపడడంతో ఆ జిల్లా పార్టీ కార్యాలయానికి స్థల కేటాయింపులను వాయిదా వేశాం. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నం’’ అని తెలిపారు. కిషన్‌రెడ్డి జోక్‌గా మారారు.. ఉగ్రవాదానికి హైదరాబాద్ అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విని జనం నవ్వుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. కిషన్‌రెడ్డి ఒక జోక్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్ర తిరిగేసి చూస్తే ప్రతి సంవత్సరం పది, పన్నెండుసార్లు మత కల్లోలాలు జరిగేవని, గత 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి కూడా మత కలహాలు జరగలేదని గుర్తుచేశారు. విపరీతంగా నేరాలు తగ్గాయని కేంద్ర హోంశాఖ స్వయంగా చెప్పిందన్నారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిందని అనడానికి ఏమైనా అర్థం ఉందా అని పేర్కొన్నారు. బాధ్యత గల వ్యక్తులు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక చిన్న సంఘటన లేదని, ఒక ఉగ్రవాద దాడి జరగలేదని, తాము చాలా క్రియాశీలంగా ఉన్నామని స్పష్టంచేశారు. ప్రభుత్వంగా ఏమేం చేస్తామో చాలా విషయాలు చెప్పమని, భారత దేశంలో ఇంత చక్కగా ఏ రాష్ట్రం లేదని వ్యాఖ్యానించారు. టీఆర్టీ అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు టీఆర్టీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించినట్టు కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టీఆర్టీ అభ్యర్థులు నిర్వహించిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం రాజకీయ ప్రేరేపితమని, అలాంటి ధర్నాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే తామే పిలిపించి మాట్లాడతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోర్టు కేసులున్న పోస్టులను పక్కనబెట్టి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
ప్రేక్షకులను నిరాశపరచదు
‘‘వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశప రచదు’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా గోరేటి వెంకన్న కీలక పాత్రలో నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఎన్.శంకర్ విడుదల చేశారు. మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. ఈ నెల రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి వింత కేసులు వస్తాయన్నదే ఈ చిత్ర కథాంశం. సరదాగా, సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నాగసాయి మాకం. -
తిత్లీ బాధితులకు ‘సినీ’ సాయం
తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం కలిగిన సంగతి తెలిసిందే. బాధితులకు తమవంతుగా సాయం అందించేందుకు మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ దర్శకుల సంఘం తరఫున తిత్లీ తుఫాన్ బాధితులకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మరికొంత మంది దర్శకుల సంఘం సభ్యులు కూడా వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు. వీటన్నిటినీ త్వరలోనే వసూలు చేసి ఏక మొత్తంగా తుఫాన్ బాధితుల సహాయనిధికి అందిస్తామని వారు తెలిపారు. ఎటువంటి ప్రకృతి విపత్తు జరిగినా సినిమా పరిశ్రమ స్పందించటం పరిపాటి. ఈ కోవలోనే ‘తిత్లీ’ బాధితుల కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షలు, కల్యాణ్ రామ్ 5 లక్షలు, హీరో కార్తికేయ 2లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందించారు. మరో హీరో నిఖిల్ కూడా 25 క్వింటాళ్ల బియ్యం, 500 దుప్పట్లను బాధితులకు స్వయంగా అందజేశారు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా తనవంతుగా రెండు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. -
నా సెల్ఫీ.. ఓ సందేశం
శ్రీ చరణ్ సెన్సేషనల్ మూవీస్‌పై చిరుగురి చెంచయ్య, సుగుణమ్మ సమర్పిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్ ప్రభాకర్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల వినోద్, ఆరోహి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. సతీశ్రాయ్ కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మాలపాటి స్వరాలు అందించారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకులు యన్.శంకర్, దేవీ ప్రసాద్, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. సీహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఇది నా సెల్ఫీ’ అనగానే అందమైన సెల్ఫీల గురించి అనుకుంటారు. సెల్ఫీల వల్ల జరిగే అనర్థాలను, జ్ఞాపకాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు యన్.శంకర్ మాట్లాడుతూ– ‘‘నటీనటులందరూ బాగా నటించారు. పాటలన్నీ బాగున్నాయి. అన్ని ఎమోషన్స్‌తో కూడిన పాటలు ఉన్నాయి’’ అన్నారు. -
లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక కమిటీ
-
ఇక కెమెరా సాక్షిగా ఆడిషన్స్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమాల్లో వివిధ శాఖలకు సంబధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. పరిశ్రమలోని అన్ని శాఖలూ ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలను అమలుపరచాలనుకుంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత పి. కిరణ్, నిర్మాత ముత్యాల రాందాస్, దర్శకులు ఎన్. శంకర్, నందినీరెడ్డి పాల్గొని, తాము తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ► సెక్సువల్ హెరాస్మెంట్ నియంత్రించడానికి ఏర్పాటు చేస్తున్న ‘క్యాష్’ కమిటిలో 50 శాతం చిత్రపరిశ్రమవారు, 50 శాతం ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండాలి. డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు అందులో మెంబర్లుగా ఉంటారు. ► ప్యానల్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధల రూపకల్పనకు న్యాయ సలహాలు తీసుకుంటాం. ► మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమ వివిధ సంస్థలకి గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి. ఓ మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి. సమాచార సాధనాల్లో భాషను సక్రమంగా వాడేలా చూడాలి. ► 24 క్రాఫ్ట్స్‌లోని మహిళల సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించేందుకు మహిళలందర్ని ఒక చోట కలిపి వర్క్ షాప్ ఏర్పాటు చేయబోతున్నాం. ► లైంగిక వేధింపుల పై ఏర్పాటు చేయనున్న ప్యానల్లో ‘షీ’ టీమ్‌లో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుంది. దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ► ఈ–మెయిల్/పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్లు ఛాంబర్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ► మోడలింగ్ కో–ఆర్డినేటర్స్‌కు సరైన లైసెన్సింగ్/అర్హతలు ఉండేలా చూస్తాం. ► కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించాలనే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకునే వీలుంటుందని సమావేశంలో ప్రముఖులు తెలిపారు. -
టాలీవుడ్లో లైంగిక దాడుల నిరోధానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో దుమారం రేగడంతో మహిళా రక్షణకు సినీ పరిశ్రమ నడుం బిగించింది. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలుగు సినిమా డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కమిటీ తుది రూపుదిద్దుకోవాలంటే కొన్ని న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉందని అన్నారు. ఈ కమిటీలో సగం మంది ఇండస్ట్రీ బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారని ఎన్.శంకర్ తెలిపారు. డాక్టర్లు, లాయర్లు, విశ్రాంత ఉద్యోగులు విద్యావేత్తలు, సైకాలజిస్టులు సభ్యులుగా ఉండడంతో.. లైంగిక వేధింపులపై పారదర్శకంగా చర్చించేందుకు వీలు అవుతుందన్నారు. ఇకపై ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు వీడియోగ్రఫీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అదే సమయంలో ఆడిషన్స్ జరిగేటప్పుడు ఒక మహిళా పర్యవేక్షకురాలు ఉండేలా నిబంధనలు రూపొందించామన్నారు. కమిటీలో ‘షీ టీమ్ హాట్ లైన్’ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని శంకర్ పేర్కొన్నారు. తద్వారా ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశముంటుందని అన్నారు. మోడలింగ్ కో-ఆర్డినేటర్స్కి సరైన లైసెన్సింగ్, అర్హతలు ఉండేలా చర్యలు మొదలు పెట్టామని తెలిపారు. సినిమా రంగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి పలు అసోషియేషన్స్ ఉన్నట్లే మహిళా సమస్యల పరిష్కారానికి కూడా కొన్ని సంఘాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు తాము ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్ని వేరే ప్లాట్ ఫాంలలో వ్యక్తం చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. అలాగే మీడియా నియంత్రణపై వస్తున్న వార్తలను ఎన్.శంకర్ ఖండించారు. ఇండస్ట్రీలో ఎక్కడా మీడియా నియంత్రణ గురించి మాట్లాడలేదని, మీడియా, సినీ పరిశ్రమ రెండు కలిసే ఉంటాయని, ఉండాలని ఆయన అన్నారు. ఇక చిత్ర పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టైటిల్ క్యాచీగా ఉంది – ఎన్.శంకర్
‘‘మనం తరచుగా వాడే పదం ‘వాడేనా’ని టైటిల్‌గా పెట్టడం క్యాచీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, ఆర్.ఆర్ బాగున్నాయి. టైటిల్ ఇంట్రెస్ట్‌గా ఉంటే సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. శివ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయిసునీల్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వాడేనా’. ఓం సాయిరామ్ సమర్పణలో మణిపాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్నారు. కిరణ్ వెన్న స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎన్.శంకర్ విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి ట్రైలర్ ఆవిష్కరించారు. సాయిసునీల్ నిమ్మల మాట్లాడుతూ– ‘‘ఎన్.శంకర్‌గారిని చూసి ఇన్స్పైర్ అయ్యా. రాజ్ కందుకూరిగారి ‘పెళ్ళి చూపులు‘ సినిమాను 22 సార్లు చూసి ఎంతో నేర్చుకున్నా. అందుకే వీరిద్దరినీ ఈ వేడుకకు పిలిచాం. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాలు చూసి, చాలామందిని స్ఫూర్తిగా తీసుకుని ‘వాడేనా’ చేశా. నేను దర్శకత్వం వహించడంతో పాటు 4పాటలు రాశా. కొరియోగ్రఫీ కూడా చే శా. మంచి విషయం ఉన్న చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు ధృవ్, మణిపాల్ మచ్చి, శివ తాండేల్, నేహా దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.ఆర్. వెంకట్. -
'2 కంట్రీస్' మూవీ రివ్యూ
టైటిల్ : 2 కంట్రీస్ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ సంగీతం : గోపీ సుందర్ నిర్మాత, దర్శకత్వం : ఎన్. శంకర్ హాస్యనటుడిగా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్.. కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు దక్కినా.. వరుస ఫ్లాప్ లతో కెరీర్ కష్టాల్లో పడింది. జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు ఎన్ శంకర్ మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందించిన 2 కంట్రీస్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సునీల్. మరీ ఈ సినిమాతో అయినా సునీల్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా..? లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన ఎన్.శంకర్ మరో విజయాన్ని సాధించాడా..? కథ : ఉల్లాస్ కుమార్ (సునీల్) బాధ్యత లేకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నించే పల్లెటూరి కుర్రాడు. తను డబ్బు సంపాదించటం కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. పటేల్ అనే రౌడీ దగ్గర తను తీసుకున్న అప్పును తీర్చలేక వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. (సాక్షి రివ్యూస్) అయితే అదే సమయంలో ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది. ఆమె కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ వాళ్ల సంబంధం కాదని లయను పెళ్లి చేసుకుంటాడు. చిన్నతనంలో అమ్మ నాన్నలు విడిపోవటంతో లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ అయితే తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో అతడితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లి తరువాత లయ గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, లయతో మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకొని ప్రేమతో ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా..? ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టాలు పడుతున్న సునీల్, 2 కంట్రీస్ సినిమా విజయం కోసం తనవంతు ప్రయత్నం చేశాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది. (సాక్షి రివ్యూస్) మద్యానికి బానిసైన పొగరుబోతు అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంది. ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, నరేష్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగు ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించటంలో దర్శకుడు ఎన్.శంకర్ ఫెయిల్ అయ్యాడు. సునీల్ గత చిత్రాల్లో కనిపించిన రొటీన్ కామెడీ సన్నివేశాలతో సినిమాను నడిపించిన దర్శకుడు నిరాశపరిచాడు. రెండు గంటల 40 నిమిషాల సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది. గోపిసుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. (సాక్షి రివ్యూస్) సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి. పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు : ఎన్. శంకర్
జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ త్వరలో 2 కంట్రీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా 2 కంట్రీస్ ను అదే పేరుతో తెలుగులో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇన్నాళ్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశా.. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా చేశా. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. 2 కంట్రీస్ మలయాళ చిత్ర టీం నాకు మంచి మిత్రులు. వారే నేను ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. షారూఖ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా గురించి స్పందించటంతో నాకు ఆసక్తి కలిగింది. అందుకే నేనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. దాదాపు 40 మంది 40 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. చాలా కొత్త లొకేషన్లలో సినిమాలు తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫి కారణంగా సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. మలయాళంలో ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా.. గోపిసుందర్ టైం ఇచ్చి ఈ సినిమాకు పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. రీ రికార్డింగ్ చేసిన తరువాత చూసిన ఒరిజినల్ వర్షన్ దర్శక నిర్మాతలు సినిమా ఘనవిజయం సాధిస్తుందన్నారు. మలయాళ వర్షన్ కంటే తెలుగు 2 కంట్రీస్ బాగుంటుంది. సునీల్ బాడీ లాంగ్వేజ్, ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ ఇది. మలయాళంలో మమతా మోహన్ దాస్ హీరోయిన్ చేశారు. తెలుగులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించాం. కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు.. కొంత మంది డేట్స్ లేవన్నారు. తరువాత అమెరికాలో పుట్టి పెరిగిన మనీషా రాజ్ ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాం. తొలి సినిమానే అయినా హావభావాల్లో సునీల్ ని డామినేట్ చేసింది మనీషా. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని తెలిపారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘2 కంట్రీస్’
దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘2 కంట్రీస్’. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ సాధించి డిసెంబర్ 29న విడుదలకు సన్నద్ధమవుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘2 కంట్రీస్’కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ‘జై బోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం, జయం మనదేరా’ లాంటి సినిమాలతో తనదైన మార్క్ వేసిన శంకర్ ‘2 కంట్రీస్’తో మరోమారు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శంకర్..‘ఈ సినిమాను గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కించాము. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరిగింది.సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ నేరేషన్ హైలైట్స్ గా నిలుస్తాయి. అలాగే.. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్ సినిమాలోని ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న పూర్తి నమ్మకం మాకుంది. సెన్సార్ పూర్తయ్యింది, డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు. -
ఇది యూనివర్శల్ మూవీ
- దర్శకుడు శంకర్ మలయాళంలో ఘన విజయం సాధించిన ‘టూ కంట్రీస్’ చిత్రాన్ని తెలుగులో సునీల్ హీరోగా ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రికార్డింగ్ ప్రారంభించగా, టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ స్క్రిప్ట్ అందించారు. ఎన్. శంకర్ మాట్లాడుతూ-‘‘‘టూ కంట్రీస్’ చిత్రం నాకు నచ్చింది. అందులో దిలీప్‌గారు చేసిన పాత్రను సునీల్ తప్ప ఎవరూ చేయలేరనిపించింది. అందుకే తనను కూడా సినిమా చూడమన్నాను. సునీల్‌కు కూడా బాగా నచ్చడంతో ఈ చిత్రం మొదలైంది. గతంలో నేను తీసిన చిత్రాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్. కానీ, ఇది మాత్రం యూనివర్శల్ మూవీ. మలయాళ మాతృతకు సంగీతం అందించిన గోపీసుందర్ మా చిత్రానికి స్వరాలు అందించనున్నారు. పదిహేను రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత డెబ్బై శాతం చిత్రీకరణ అమెరికాలో ఉంటుం ది’’ అని తెలిపారు. సునీల్ మాట్లాడుతూ-‘‘దిలీప్‌గారు చేసిన ఓ చిత్రాన్ని ‘పూలరంగడు’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నాం. మరోసారి ఆయన మూవీ రీమేక్‌లో నటిస్తుండటం సంతోషంగా ఉంది. రెడీమేడ్ షర్ట్‌లా ఈ చిత్రానికి అన్నీ పక్కాగా సమకూరాయి. నా ‘పూలరంగడు’, ‘భీమవరం బుల్లోడు’ చిత్రాలకు డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన మళ్లీ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. -
సునీల్ హీరోగా టూ కంట్రీస్ రీమేక్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకుంనేందుకు కష్టపడుతున్న సునీల్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే కన్నా... ఆల్రెడీ సక్సెస్ సాధించిన కథలైతే సేఫ్ అని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్ తెలుగు రీమేక్‌లో నటించే ఆలోచనలో ఉన్నాడు సునీల్. మలయాళంలో దిలీప్ నటించిన పాత్రకు సునీల్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా డైరెక్టర్ ఎన్ శంకర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ మహాలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. -
తొలియత్నం : ఆ తల్లి గర్భశోకమే నా కథ!
రంగురంగుల కలలు కనే వయసు రాజ్యం ఇనుప పదఘట్టనల కింద అత్యంత క్రూరంగా నలిపివేయబడినపుడు... ప్రజాస్వామ్యపు వాకిటిలో జీవించే ప్రాథమిక హక్కు నిర్దాక్షిణ్యంగా నేలరాలినపుడు... దేహపు తీరమంతా దుఃఖంతో కోసుకుపోయిన ఓ తల్లి గర్భశోకం ఒక కథకు ఊపిరి పోసింది. తిరిగిరాని లోకాలకు తరలిన కొడుకు కోసం ఆ మాతృమూర్తి పడిన ఆవేదన ఒక యువకుడిలో ఆవేశం రగిలించింది. కథ సమాజానికి దూరమై సినిమా కేవలం వినోద సాధనంగా మారినవేళ జీవితం- కథ-సినిమా కలగలిసి వెండితెరపై రాసిన మానవీయ కథాంశం ‘ఎన్కౌంటర్’. ఈ కథ పుట్టిన కల్లోలిత క్షణాల గురించి డెరైక్టర్ ఎన్.శంకర్ మనసు విప్పిన సందర్భమిది! ఒక కళాకారుడు తాను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తాడు, తాను ఏడుస్తూ ఎదుటివారిని ఏడిపిస్తాడు. కానీ ఇక్కడ ఒక మాట్లాడలేని, చూడల్లేని, కదల్లేని ఒక శవం ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. నేను మద్రాసులో కో-డెరైక్టర్‌గా పనిచేసేటప్పుడు ఒకసారి హైదరాబాద్ వచ్చాను. ఒక పెద్ద హీరోకి కథ చెప్పాను. ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ మధ్యలో ఒకసారి మా ఊరికి వెళ్లాను. ప్రజా ఉద్యమాలు మంచి ఊపులో ఉన్న కాలమది. అప్పట్లో ఏ పేపర్లో చూసినా ఎన్కౌంటర్ వార్తలే. అప్పుడు మా నల్లగొండ జిల్లాలో వలిగొండ దగ్గర నలుగురు నక్సలైట్లను పోలీసులు చెట్లకి కట్టేసి ఎన్కౌంటర్ చేశారు. వాళ్లకు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసుంటుంది. విషయం తెలిసి చాలా బాధనిపించింది. వీళ్లు దేశానికి చేసిన నష్టమేమిటి, వీళ్లను పోలీసులు అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆలోచించాను. ఆ నలుగురి నేపథ్యం తెలుసుకుంటే మరింత బాధేసింది. నలుగురివీ పేద కుటుంబాలు. తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి పిల్లలను చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనుకున్నాను. విషయాన్ని ఒక మానవీయ కోణంలో చెప్పాలని ఆలోచించా. నక్సలైట్లు, పోలీసులు ఇద్దరూ మనుషులే, ఇద్దరూ పోరాటం చేస్తున్నారు. ఐతే ఎవరు ఎందుకోసం పోరాడుతున్నారనేది నా కథలో స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ దశలో చాలామంది పోలీస్ ఆఫీసర్లను, యాంటీ నక్సల్స్ స్క్వాడ్, కవులు, కళాకారులను, నక్సల్స్ సానుభూతిపరులను కలుసుకుని మాట్లాడాను. వాళ్ల అభిప్రాయాలను నా ఆలోచనలతో బేరీజు వేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ని. ఈ క్రమంలో ఒకసారి చౌటుప్పల్‌లో అమరవీరుల తల్లిదండ్రుల సమావేశానికి వెళ్లాను. వలిగొండలో చనిపోయిన నలుగురిలో ఒకరి తల్లిని స్టేజ్ వెనుకకు పిలిచి మాట్లాడటం మొదలుపెట్టాను. ఆమె బండిమీద జామకాయలు అమ్మేది. ఎన్కౌంటర్లో చనిపోయిన కొడుకు సైకిల్ షాప్‌లో పంక్చర్లు వేసేవాడు. ఎన్కౌంటర్ చేసిన తరువాత కుర్రాడి మేనమామను పిలిచి పోలీసులు బెదిరించారు. అతని ద్వారా తల్లికి కబురు పంపించారు. ఆమె అక్కడికి వెళ్లి చూస్తే కొడుకు మొహమంతా గుర్తుపట్టరాని విధంగా ఉంది. ఆమె ఆ హృదయవిదారక సన్నివేశాన్ని అలా చెప్పుకుపోతూనే ఉంది. ఆమె మాటలకు అడ్డుతగులుతూ మరి ఆ శవం నీ కొడుకుదేనని ఎలా గుర్తుపట్టావమ్మా అని అడిగాను. చేతులు, కాళ్లు చూసి గుర్తుపట్టానని చెప్పింది. అదేంటమ్మా అంటే, కొడుకుకు స్నానం చేయించేటప్పుడు కాళ్లకు వేళ్లకు నూనె పెట్టి రుద్దేదాన్ని. అలా వేల మార్లు నునుపయ్యే వరకూ రుద్దినదాన్ని, నా కొడుకు కాళ్లను, వేళ్లను నేను గుర్తుపట్టలేనా నాయనా అంది. పోలీసులు చంపారంటే ఏదో కొంచెమైనా తప్పు చేసుంటాడు కదా అన్న ధోరణిలో, ఇంతకూ నీ కొడుకు మంచోడా చెడ్డోడా అని అడిగాను. మాట్లాడేదల్లా ఒక్క క్షణం ఆగి, కళ్లనిండా నీరు తెచ్చుకుంది. బిడ్డా నా కొడుకు చెడ్డోడా అంటే ఏం చెప్పను, వాడు తిట్టినోళ్లను తిట్టెటోడు కాదు, కొట్టినోళ్లను కొట్టెటోడు కాదు అంది. ఆ మాటతో ఒక్క క్షణం నా గుండె బరువెక్కింది. ఆవిడతో ఇంకేం మాట్లాడలేకపోయాను. అలాగే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటికి రాత్రి రెండైంది. బరువు దించుకోవడానికి ఆ రాత్రిపూట స్నానం చేస్తుంటే నా ఒంటిమీద నీళ్లు, కంట్లో కన్నీళ్లు కలగలసిపోయాయి. అప్పటికప్పుడు ‘ఎనకొచ్చే ఆవుల్లారా’ పాట రాయడం మొదలుపెట్టాను. ఆలోచన సాగిపోతోంది. ఆవేశం అక్షరమై కాగితం మీద దూకుతోంది. అనైతికమైన, అరాచకమైన, అప్రజాస్వామికమైన సమాజంలో ఒక తల్లి తన కొడుకు ఎక్కడికి పోయాడు, తన కొడుకు జాడ ఎక్కడని ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నే ఒక పాటైంది. చివరకు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు, ఆర్థిక, సామాజిక అసమానతల నుండి పుట్టిన సమస్య అని; భూమి కోసం, భుక్తి కోసం జరుగుతున్న పోరాటమని నా కథ ద్వారా చెప్పే ప్రయత్నం మొదలుపెట్టాను. సెల్వమణి నిర్మాతగా, నేను దర్శకుడిగా తెలుగు, తమిళం, మలయాళంలో సినిమా చేయాలనుకున్నాం. పోలీస్ ఆఫీసర్‌గా మమ్ముట్టిని, హీరోగా ప్రశాంత్‌ను అనుకున్నాం. కృష్ణన్న పాత్రకు కృష్ణగారు న్యాయం చేస్తారని ఆయనను అడిగితే సరేనన్నారు. ప్రాజెక్ట్ మరీ ఆలస్యమవుతుండటంతో కృష్ణగారు పద్మాలయా బ్యానర్లో తీయడానికి ముందుకొచ్చారు. ఐతే, సినిమా కేవలం తెలుగుకే పరిమితం కావడంతో మమ్ముట్టి స్థానంలో వినోద్‌కుమార్‌ను, ప్రశాంత్ బదులు రమేశ్‌బాబును తీసుకున్నాం. షూటింగ్ చాలా ప్రాంతాల్లో చేయాల్సి వచ్చింది. వికారాబాద్ ఫారెస్ట్, మదనపల్లి, తలకోన, హార్సిలీ హిల్స్, భద్రాచలం, చింతూరు, చిత్తూరు జిల్లాలో తెట్టు, కదిరి స్థూపం దగ్గర చిత్రీకరణ జరిపాం. చింతూరు అడవుల్లో పాట షూట్ చేస్తున్నప్పుడు కింది నుంచి నక్సలైట్లు పాట మళ్లీ వినిపించమని చెప్పి పంపేవాళ్లు. వికారాబాద్‌లో ఒక ఊళ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నక్సలైట్లు కృష్ణగారి దగ్గరకు వచ్చి ఏకే 47 అలా కాదు, ఇలా పట్టుకోవాలి అని చూపించి మెరుపువేగంతో మాయమయ్యారు. ఒక సన్నివేశంలో డైలాగ్‌లకు, మాకు సెక్యూరిటీగా ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు చప్పట్లు కొట్టారు. అలా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్నో మరిచిపోలేని అనుభవాలు. షూటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు నిన్ను కూడా ఏమైనా చేస్తారని చాలామంది భయపెట్టారు. ఐనా, ఏమాత్రం వెనక్కు తగ్గకుండా షూటింగ్ చేశాను. మరోవైపు పోలీసులు షూటింగ్లో రోజూ ఏం జరుగుతుందో నోట్ చేసుకుని డీజీపీ దొరకు పంపేవాళ్లు. సినిమాలో స్వర్ణక్క డెత్ సీన్ చాలామందిని కదిలించింది. ఇక్కడ ఒక ప్రయోగం చేశాను. మామూలుగా ఏ ప్రక్రియలోనైనా ఒక కళాకారుడు తాను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తాడు. తాను ఏడుస్తూ ఎదుటివారిని ఏడిపిస్తాడు, కానీ ఇక్కడ ఒక మాట్లాడలేని, చూడల్లేని, కదల్లేని ఒక శవం ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. చాలా చోట్ల థియేటర్లలో సినిమా చూసిన నక్సలైట్లు ఈ సన్నివేశం చూసి గన్స్ ఆఫ్ హానర్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే సీన్ ప్రేక్షకుల భావోద్వేగాలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. కొడుకును డాక్టర్‌ను చేసి పల్లెలో అందరికీ మంచి వైద్యం అందించాలని కలగన్న తల్లి, చివరకు తన కొడుకుతో నువ్వు రోగాల్ని నయం చేయాల్సింది వ్యక్తికి కాదు, సమాజానికి. నీ చేతిలో ఉండాల్సింది సూది కాదు తుపాకీ అంటుంది. ఈ సన్నివేశం కథకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. తన కొడుకు కోసం ఎదురుచూసే తల్లిగా రాధిక నటన ప్రేక్షకులను కదిలించింది. కృష్ణన్నగా కృష్ణ, స్వర్ణక్కగా రోజా తమ పాత్రలో ఇమిడిపోయారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం, ప్రజాకవుల సాహిత్యం సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసింది. ముఖ్యంగా ఊరువాడ అక్కల్లారా, అమరవీరులకు జైబోలో, పల్లె తెల్లవారుతున్నదా, ఎనకొచ్చే ఆవుల్లార పాటలు జనం గుండెల్లో మారుమోగాయి. ప్రజాకవి గోరటి వెంకన్నను ఈ సినిమా ద్వారా సినీరచయితగా పరిచయం చేశాను. తను రాసిన అమరవీరులకు జైబోలో పాట పెద్ద హిట్ అయింది. తన పల్లె కన్నీరు పెడుతుందో పాటను ఈ సినిమాలో వాడుదామనుకున్నాం కానీ, అది చాలా పెద్దగా ఉండటం వల్ల కుదరలేదు. కుదించి వాడితే పాటకు న్యాయం చేయలేమని చాలా తర్జన భర్జన పడ్డాం. అప్పుడు అశోక్ తేజ పల్లె తెల్లవారుతున్నదో పాట రాశాడు. సినిమా విడుదలయ్యాక, నేను, కొండపల్లి సీతారామయ్య, ఇంకా చాలామంది కలిసి విజయవాడలో ఫస్ట్ షో చూశాం. గద్దరన్న అంతకుముందు రాత్రే ప్రసాద్ ల్యాబ్స్‌లో చూశాడు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
మనసే జతగా: టేక్... ఓకే
లైట్స్ ఆన్ ... స్టార్ట్ కెమెరా ... యాక్షన్ ... సీన్ కంప్లీట్... ప్యాకప్! ఎవరింటికి వాళ్లు... డైరెక్టర్ ఇంటికి డైరెక్టర్. ఇంట్లో మళ్లీ ఇంకో డైరెక్షన్. మూవీ డెరైక్షన్ కాదు, ఫ్యామిలీ డైరెక్షన్. ఒకరు కాదు, ఇద్దరు డైరెక్టర్లు! ఒకర్నొకరు లీడ్ చేసుకుంటూ ఒకరి మూడ్స్ ఒకరు ఫిల్టర్ చేసుకుంటూ, ఫీడింగ్ ఇచ్చుకుంటూ పదహారేళ్లుగా... ‘ఉమ్మడి’ దర్శకత్వం! ‘మాధవిదే ప్రధానపాత్ర’ అంటారు శంకర్. ‘లేదు లేదు, ఓన్లీ సపోర్టింగ్’ అంటారామె. ఈ ఆలుమగల సమన్వయ చిత్రమే... ఈవారం ‘మనసే జతగా...’ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చెప్పరు. కొన్నిరోజులు పోయాక తెలుస్తుంది. అలాగే ఈయనకెరియర్లో ఉండే ఒడిదొడుకులను కూడా చెప్పరు. ‘ముందే చెప్పచ్చు’ కదా అంటాను. ‘చెబితే టెన్షన్ అవుతావు, ఆ టెన్షనేదో నేనే పడతాలే’ అంటారు. - మాధవి కష్టం చెప్పకుండానే మాధవి నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా షూటింగ్లో పాల్గొనేవారికి భోజన ఏర్పాట్ల కోసం పాట్లు పడుతుంటే అన్నిరోజులూ అందరికీ తనే దగ్గరుండి వంట చేయించింది. కాస్ట్యూమ్స్ కోసం అప్పటికప్పుడు షాపింగ్ చేసేది. - ఎన్.శంకర్ ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, యమజాతకుడు, జయంమనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జయ్ బోలో తెలంగాణ... సినిమాల డెరైక్టర్ ఎన్.శంకర్. ‘సినిమా తీసేటప్పుడు అది పూర్తయ్యేంతవరకు అందరి బాగోగులపై దృష్టిపెడతాను. అప్పుడే ఒక టీమ్‌గా అందరి కృషి మంచి ఫలితాన్నిస్తుంది. కుటుంబంలోనూ అంతే! భార్యాభర్తలు ఒక టీమ్‌గా ఉంటేనే కుటుంబం అనే నిజ జీవిత సినిమా మంచి ఫలితాన్నిస్తుంది’అన్నారు శంకర్, ఆయన భార్య మాధవి. వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి (నవంబర్ 16, 1997)16 ఏళ్లు అయ్యింది. వీరికి దినేష్, మహాలక్ష్మి ఇద్దరు సంతానం. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి రెండేళ్ల క్రితం చిన్న కుటుంబంగా మారిన ఈ దంపతులు తమ జీవితానుభావాలను ఇలా వెల్లడించారు. బాధ్యతల లోగిలిలో... ఉమ్మడికుటుంబంలో భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే పరిణామాలను శంకర్ వివరిస్తూ- ‘‘అమ్మ, నాన్న, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు... ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తించడంలో సంఘర్షణ ఎక్కువే ఉండేది. పెళ్లయిన మొదట్లో ‘రేపటి పరిస్థితి ఏంటి?’ అని మాధవి తరచూ బాధపడటం గమనించాను. ‘ఇంటికి పెద్ద కొడుకు, కోడళ్లుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాటి పైనే మనం ముందు దృష్టి పెట్టాలి. రేపు అంతా మంచే జరుగుతుంది’ అని తరచూ చెప్పేవాడిని. తనూ మెలమెల్లగా ‘నేను ఈ ఇంటికి పెద్ద కోడలిని... ఇలా ఉండాలి... ’ అని ఒక నిశ్చయానికి వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు అండగా నిలిచింది. మా తమ్ముళ్ల పెళ్లిళ్లు, చెల్లెలి పెళ్లి... మాధవి ముందుండి చేసింది. ఇప్పుడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. బాధ్యతలను అందరూ ఒకేసారి అర్థం చేసుకోలేరు. మెల్లమెల్లగా తెలుసుకుని ముందుకు సాగడమే దాంపత్యం’ అని తెలిపారు ఈ డెరైక్టర్. సర్దుబాట్లు కేరాఫ్ సంసారం పుట్టింట్లో చిన్నకూతురుగా, నలుగురు అన్నలకు గారాల చెల్లిగా పెరిగి, అత్తింటికి పెద్దకోడలిగా వెళ్లాక చేసుకున్న సర్దుబాట్లను ప్రస్తావిస్తూ- ‘‘ఇంటి దగ్గర ఉన్నన్నాళ్లూ అమ్మ, వదినలు కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు. అలాంటిది అత్తింట అడుగుపెట్టాక కొన్నాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. అమ్మ ఎప్పుడూ చెబుతుండేది ‘ఇంట్లో ఎన్నిసమస్యలున్నా సరే, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి’ అని. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉమ్మడి కుటుంబంలో ఏవో మాట పట్టింపులు వస్తూనే ఉండేవి. పెళ్లయిన మొదట్లో వాటిని ఎలా తీసుకోవాలో అర్థమయ్యేది కాదు. అలా కొన్ని సమస్యలను పుట్టింటిలో చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈయన షూటింగ్ అని వెళ్లిపోతే, నేను పుట్టింటికి వెళ్లడమూ ఎక్కువే ఉండేది. మెల్లగా నేనే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేవి అనుభవంతో తెలుసుకున్నాను’’ అని వివరించారు హోమ్ డెరైక్టర్ మాధవి. టెలిఫోన్ ధ్వనిలా పెరిగిన చనువు ఒకచోట పెరిగిన మొక్కను తీసి మరోచోట నాటితే అక్కడి పరిస్థితులను తట్టుకుంటూ పెరగడానికి కొంత టైమ్ పడుతుంది. పెళ్లికి ముందు అమ్మాయి కూడా అంతే! అంటారు ఈ దంపతులు. తన జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ మాధవి- ‘‘పదహారేళ్ల కిందట.. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఈ సంబంధం బాగుంటుందని నిశ్చయం చేశారు. అప్పటికి ఇంటర్మీడియెట్ చదువుతున్న నేను నా జీవిత భాగస్వామి ‘ఇలాగే ఉండాలి’ అని లెక్కలేం వేసుకోలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయినరోజు మొదలు ఈయన నుంచి ఫోన్ల తాకిడీ పెరిగింది. ముందుగా ‘ఇంతగా ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి?’ అనుకున్నాను. కానీ, పోనుపోను మా మధ్య ఉన్న సందిగ్ధాలను, సందేహాలను ఫోన్ చెరిపేసింది. తరచూ మాట్లాడుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న భయం స్థానంలో స్నేహం ఏర్పడింది. ఒకసారి ఈయనే ‘జీవితాంతం కలిసి ఉండబోయేవాళ్లం. ఒకరి గురించి ఒకరం ముందే తెలుసుకొని, స్నేహం పెంచుకుంటే మన బంధం ఇంకా బలపడుతుంది. అందుకే ఈ ప్లాన్’ అని చెప్పారు. నాకూ ఇది కరెక్టే అనిపించింది’’ అన్నారు ఆమె. పెళ్లి తర్వాత పని వల్ల తమ మధ్య ఏర్పడిన ఖాళీని పూరించడానికి తీసుకున్న నిర్ణయాన్ని శంకర్ చెబుతూ- ‘‘పెళ్లి అయిన మూడు రోజులకే ‘శ్రీరాములయ్య’ సినిమా సందర్భంలో కార్ బాంబ్ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మాకేం కాకపోయినా పెళ్లికాగానే ఇలాంటి సంఘటన జరగడమేంటి అని పది రోజుల దాకా మామూలు మనుషులం కాలేకపోయాం. ఆ తర్వాత కొద్దిరోజులకే నేను సినిమా షూటింగ్ అంటూ వెళ్లిపోయాను. పెళ్లయిన వాతావరణం, కార్ బాంబ్ సంఘటన వల్ల మాధవి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేది. దీంతో నాతో సినిమా షూటింగ్స్‌కి రాజస్థాన్, ఢిల్లీ... ప్రాంతాలకు మాధవినీ తీసుకెళ్లాను. అది కాస్త మా ఫ్యామిలీ ట్రిప్ అయ్యింది. అప్పటివరకు కాస్త కినుకగా ఉండే ఈవిడ ప్రవర్తనలో మంచి మార్పులు చూశాను. దీంతో హమ్మయ్య అనుకున్నాను’’ అని చెబుతుంటే భాగస్వామి మనసు తెలుసుకొని భర్త ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ సంఘటన రుజువు చేసింది అనిపించింది. కోపం నుంచి రియలైజేషన్ కోపతాపాలు దాంపత్యం మీద చూపిన సందర్భాలు, వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్న విధానాలను శంకర్ చెబుతూ-‘‘బయట ఉండే చికాకులు, కోపాలు ఎక్కడా చూపించలేక అణుచుకోవాల్సిన వృత్తి నాది. అలాంటప్పుడు ఆ కోపం మాధవి మీదకే వెళుతుంది. ఆ సమయంలో తను మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి నేను చేసిన పొరపాటేమిటో అర్థమైపోతుంది. నన్ను అర్థం చేసుకున్నది కాబట్టి మౌనంగా ఉంది. తనూ కోపగించుకుంటే ఇంటి ప్రశాంతత ఎంతగా దెబ్బతినేది, పిల్లలు ఎంత డిస్టర్బ్ అయ్యేవారు అని నాకు నేనే రియలైజ్ అవుతుంటాను’’ అన్నారు. కలల కుటీరం భవిష్యత్తు పట్ల తన తపనను మాధవి తెలియజేస్తూ- ‘‘రెండేళ్లుగా వ్యవసాయం మీద ఎక్కువగా మనసు పోతోంది. కొంచెం భూమి కొనుక్కొని, కూరగాయలు, పూల తోటలు పెట్టాలి, పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆ విషయంలోనే ఈ మధ్య పోరుతూ ఉన్నాను. కాని వినీవిననట్టుగా ఉంటున్నారు’’ అని ఆమె కంప్లయింట్ చేస్తున్న ధోరణిలో ఉంటే - ‘‘ఆర్థికంగా అన్నీ అమరినప్పుడే ఇలాంటి కలలు సాకారం చేసుకోగలం. అంత తొందరపడవద్దు’ అని సర్దిచెబుతుంటాను’’ అన్నారు శంకర్. ‘భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి’ అని కలలు కనడంలో గృహిణిగా భార్య ఒకలా ఆలోచిస్తే, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వాస్తవానికి దగ్గరగా అనిపించారు శంకర్. ‘లవ్, అరేంజ్... ఏ తరహా పెళ్లి అయినా నిత్యం ఎవరికి వారు తమని తాము రీ షేప్ చేసుకుంటూ ఉండాలి. వృత్తిలో ఎదిగే క్రమంలోనే బయట ఎవరెవరి దగ్గరో ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటాం. అలాంటిది ఇంట్లో భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఇంకెన్నో సర్దుబాట్లు చేసుకోవాలి. తప్పదు. కొంత కన్విన్స్, మరికొంత కాంప్రమైజ్ అయినప్పుడే ఆ బంధం నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అందుకు ఇద్దరిలోనూ ఆ బంధాన్ని కాపాడుకోవాలనే తలంపు, ఎదురుచూసే సహనం ఉండాలి’ అని తెలిపారు శంకర్, మాధవి. మూడుముళ్ల బంధం ముచ్చటగా సాగాలంటే కన్విన్స్, కాంప్రమైజ్ కంపల్సరీ అని తమ జీవితానుభవాల ద్వారా స్పష్టం చేశారు ఈ జంట. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి