నందినీ రెడ్డి, ఎన్.శంకర్, పి.కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, ముత్యాల రాందాస్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమాల్లో వివిధ శాఖలకు సంబధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. పరిశ్రమలోని అన్ని శాఖలూ ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలను అమలుపరచాలనుకుంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత పి. కిరణ్, నిర్మాత ముత్యాల రాందాస్, దర్శకులు ఎన్. శంకర్, నందినీరెడ్డి పాల్గొని, తాము తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
► సెక్సువల్ హెరాస్‌మెంట్ నియంత్రించడానికి ఏర్పాటు చేస్తున్న ‘క్యాష్’ కమిటిలో 50 శాతం చిత్రపరిశ్రమవారు, 50 శాతం ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండాలి. డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు అందులో మెంబర్లుగా ఉంటారు.
► ప్యానల్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధల రూపకల్పనకు న్యాయ సలహాలు తీసుకుంటాం.
► మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమ వివిధ సంస్థలకి గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి. ఓ మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి. సమాచార సాధనాల్లో భాషను సక్రమంగా వాడేలా చూడాలి.
► 24 క్రాఫ్ట్స్‌లోని మహిళల సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించేందుకు మహిళలందర్ని ఒక చోట కలిపి వర్క్ షాప్ ఏర్పాటు చేయబోతున్నాం.
► లైంగిక వేధింపుల పై ఏర్పాటు చేయనున్న ప్యానల్‌లో ‘షీ’ టీమ్‌లో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుంది. దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
► ఈ–మెయిల్/పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్‌లు ఛాంబర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
► మోడలింగ్ కో–ఆర్డినేటర్స్‌కు సరైన లైసెన్సింగ్/అర్హతలు ఉండేలా చూస్తాం.
► కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించాలనే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనున్నాం.
ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకునే వీలుంటుందని సమావేశంలో ప్రముఖులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment