నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : సినిమా పరిశ్రమలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలపై నటుడు కొణిదెల నాగబాబు ఘాటుగా స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌పై తెలుగు సినిమా పరిశ్రమపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. బుధవారం ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ‘మా’ ఎవరికి అవకాశాలు ఇప్పించదని, కేవలం సభ్యుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తుందని చెప్పారు.
మా అసోసియేషన్‌లో సభ్యత్వ నమోదుపై జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు. ఉచితంగా మా సభ్యత్వం ఇవ్వరని తెలిపారు. ఈ విషయంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజాను నిందించడం తప్పని అన్నారు. అవగాహన లేకుండా మా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి పరిశ్రమలో జరిగే సంఘటనలు గమనిస్తున్నానని, శ్రీరెడ్డి వ్యవహారం అసలు విషయం వదిలేసి పక్కదారి పట్టిందని చెప్పారు.
‘ప్రతి విషయానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదలి రావాల్సిన పని లేదు. నా లాంటి ఎవరో ఒకరు చాలు. ఈ విషయాన్ని చాలా సులువుగా పరిష్కరించవచ్చు. తెలుగువాళ్లకే క్యారెక్టర్లు ఇవ్వాలి అంటున్నారు. తెలుగు వాళ్లకు కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం?. హీరో, హీరోయిన్లు, కొన్ని విలన్ క్యారెక్టర్లు సదరు సినిమా అవసరాన్ని బట్టి నిర్మాతలు తీసుకుంటున్నారు.
మా అసోసియేషన్ తెలుగు అమ్మాయిలకు, తెలుగువాళ్లకు క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలదు. అంతేగానీ వారి మెడలు వంచి అవకాశాలు ఇప్పించలేదు. అలా చెయ్యదు కూడా. ఎందుకంటే నిర్మాత కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రాలను తెరకెక్కిస్తారు. వాళ్లను మేం చెప్పినట్లు చేయమని ఎలా అడగుతాం. ఆ అధికారం మాకు లేదు. వాళ్లకు నష్టం వస్తే మా అసోసియేషన్ ఇవ్వలేదు కదా. చాలామంది నిర్మాతలు జీవితాలను ఫణంగా పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు.
ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. ఒకరు రాకూడదు. చేయకూడదు అనేది లేదు. మా అసోసియేషన్ 100 శాతం నిర్మాతలను తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వమని అడుగుతుంది. వాళ్లు హిందీ, తమిళం ఇలా ఎక్కడి నుంచైనా హీరోయిన్లను తెచ్చుకోవచ్చు. వాళ్లను నియంత్రించలేం. ఈ మధ్య ప్రతి వాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చులకనగా చూస్తున్నారు.
ఏ అన్ని సినిమాలు బ్యాడ్‌గానే తీసున్నామా? బ్యాడ్‌గానే చూపిస్తున్నామా. సినిమాల్లో ఉండేవాటిని చూసి జనాలు చెడిపోతున్నారా?. సినిమాల్లోని అంశాలను చూసి జనాలు చెడిపోతున్నారని మీరే అంటున్నారు కదా. సినిమాల్లో చూపించే మంచిని ఎందుకు ఫాలో కావడం లేదో మీరే చెప్పండి. నోరు మూసుకుని ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీ అందరికీ ఒక సాఫ్ట్ టార్గెట్‌గా మారింది. ఇక్కడకు వచ్చి చూడండి. బయట నిలబడి ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మీకు మీ సంఘాలకు ఎంత గొప్పతనం ఉందో మాకూ అంతే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఇండస్ట్రీపై నోటికి వచ్చినట్లు పేలొద్దు. టాలీవుడ్ నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇప్పటికీ తీస్తున్నారు. 10 శాతం నుంచి 20 శాతం వరకూ వచ్చే చెత్త సినిమాల పేరిట ఇండస్ట్రీ మొత్తాన్ని బాధ్యులను చేయడం సరికాదు. కమర్షియల్ సినిమాలు తీస్తే తప్పేంటి? రామాయణ, మహాభారతాలు తప్ప మరే సినిమాలు తీయకూడదా?. మీరు అలాంటి సినిమాలు చూడకండి. సినిమాల్లో హింస తదితర అంశాలను తగ్గించడానికి ప్రయత్నిస్తాం. సెన్సార్ అప్రూవల్ తర్వాతే సినిమాలు విడుదల అవుతున్నాయి. సెన్సార్ అనుమతితో విడుదలైన సినిమాలపై మీరు ఎలా మాట్లాడతారు? సినిమా ఇండస్ట్రీలో నీతి, నిబద్దత కలిగిన వారు చాలామంది ఉన్నారు.
కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పదం ఇప్పుడే తెలిసిందా?. సినిమా పరిశ్రమలో అందరూ పాడైపోయిన అమ్మాయిలే అంటున్నారు. అలా అయితే నా కూతురిని సినిమాల్లోకి ఎందుకు తెస్తాను. వచ్చిన అమ్మాయిలందరూ కాస్టింగ్ కౌచ్‌కు బలై పెద్ద హీరోయిన్లు అవలేదు. చాలామంది అమ్మాయిలు గౌరవప్రదంగానే వచ్చి మంచి స్థాయికి ఎదిగారు. అందరినీ చులకనగా చూడకండి. మహానటి సావిత్రి, భానుమతి లాంటి వారూ గౌరవప్రదంగా ఇండస్ట్రీకి వచ్చి గొప్పస్థాయికి ఎదిగినవారే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తం సినిమా పరిశ్రమను బలి చేయకండి.
ఇంతకాలం జరిగింది నన్ను కదిలించలేదు. మంగళవారం ఎంతోమంది ఆడవాళ్లు మాట్లాడిన మాటలు నన్ను కదిలించింది. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రావాల్సిన పని లేదు. ఒక మంచి పనికి ఎవరైనా రావొచ్చు. పవన్ ఏం తప్పు మాట్లాడాడు? సమస్యపై పోలీసు స్టేషన్‌కు వెళ్లి రిపోర్ట్ చేయమనడం తప్పా?. ఎదుటివ్యక్తులపై బురద జల్లడానికి యత్నించకండి. పని ప్రదేశంలో మహిళలకు అన్ని సదుపాయాలు అందుబాటులు ఉండేలా చూస్తాం.’ అని నాగబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment