తెలుగు సినీ పరిశ్రమలో మహిళను ఆటవస్తువుగానే చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. పరిశ్రమలో తెలుగువారికి న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని అంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను దర్శకులు, వారి పిల్లలు, నిర్మాతలు నీచాతి నీచమైన డిమాండ్లతో వేధిస్తారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అంటోంది. శ్రీరెడ్డి కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ ఇంత దారుణంగా ఉందా అని బయటివారు అసహ్యించుకునే ప్రమాదం ఉందని ‘మా’ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినీ పరిశ్రమ ప్రతిష్ఠను మంటగలిపిన శ్రీరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మా’ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు.
టీవీ యాంకర్‌గా పనిచేసిన శ్రీరెడ్డి సినిమాలపై ఇష్టంతో అటువైపు అడుగులు వేశారు. దర్శకుడు తేజతోపాటు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ తమ సినిమాల్లో ఆమెకు అవకాశాలూ ఇచ్చారు. అయితే సినీ పరిశ్రమలో అవకాశాలు ఇస్తామని చెప్పి ఓ అగ్ర నిర్మాత తనయుడు ఒకరు తనను లైంగికంగా ఎక్స్ ప్లాయిట్ చేసి.. ఆ తర్వాత అవకాశాలు ఇవ్వకుండా మోసం చేశారని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును ‘మా’ పెద్దలు పక్కన పెట్టేశారని, వారంతా సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలకు కొమ్ముకాస్తూ.. పెద్దల బాగోతాలను నిలదీసే తనలాంటి వారిని అణచివేస్తున్నారని శ్రీరెడ్డి అంటున్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన వారికే టాలీవుడ్‌లో 75 శాతం వరకు అవకాశాలు కల్పించాలని ‘మా’ అసోసియేషన్‌లో నిబంధనలు ఉన్నప్పటికీ, పరిశ్రమ పెద్దలు తెలుగువారిని పట్టించుకోకుండా, ఉత్తరాది నుంచే హీరోయిన్లను, ఇతర ఆర్టిస్టులను దిగుమతి చేసుకుంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై తాను నెల రోజులుగా ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన తెలుగు కళాకారులు ఎంతోమంది ఉన్నా, వారిని కాదని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని టాలీవుడ్‌ను ఆమె నిలదీస్తున్నారు. అయితే, ఇలా నిరసన వ్యక్తం చేయడానికి ఆమె ఎంచుకున్న మార్గంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి శ్రీరెడ్డి వివరణ ఇస్తూ.. సినీ పరిశ్రమ ఎంత సిగ్గులేకుండా ఉందో, ఎంత అసహ్యంగా ఉందో బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికే తాను అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టారు. అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల నగ్న చిత్రాలు షూట్ చేసి పంపాల్సిందిగా కొందరు దర్శకులు, నిర్మాతలు వేధిస్తున్నారని ఆమె అంటున్నారు. సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆడవాళ్లపై చిన్నచూపే ఉందని అంటున్నారు. టాలీవుడ్‌లో చాలామంది మహిళల విషయంలో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
అట్టుడికిన టాలీవుడ్
శ్రీరెడ్డి వినూత్న నిరసనతో సినీ పరిశ్రమ అట్టుడికింది. శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాలపై చర్చ మొదలైంది. సోషల్ మీడియాలోనూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై పెద్ద రచ్చే జరిగింది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెంటనే స్పందించింది. శ్రీరెడ్డికి అన్ని విధాలుగా సహాయం అందించాలని, ప్రోత్సహించాలని తాము అనుకుంటే.. ఆమె ‘మా’ ప్రతిష్ఠనే మంటగలిపిందని ప్రతినిధులు అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గురించి ఎవరు పల్లెత్తు మాట మాట్లాడినా తాము సహించే ప్రసక్తే లేదని చెప్పారు. మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్‌లో శ్రీరెడ్డికి సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్తులో శ్రీరెడ్డితోపాటు ‘మా’ సభ్యులు ఎవరూ నటించకూడదంటూ ఆంక్షలు విధించారు. శ్రీరెడ్డి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ అంటేనే అందరికీ లోకువైపోయే ప్రమాదం దాపురించిందని ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ ఆరోపించారు. శ్రీరెడ్డి అనుచిత నిరసనతో ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అపవిత్రమైపోయిందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అగత్యం ఏర్పడిందని నటుడు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి అసభ్య ప్రవర్తన తనను కలచి వేసిందన్నారు.
‘శ్రీరెడ్డి ఆరోపణల్లో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో చెప్పలేం. శ్రీరెడ్డి పూర్తిగా అబద్ధాలే ఆడుతున్నారన్న సినీ రంగ ప్రముఖుల వాదనను సమర్ధించలేం. ఎందుకంటే సినీ పరిశ్రమలో కాకలు తీరిన ప్రముఖులే అక్కడక్కడా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చాలా సందర్బాల్లో చెప్పారు. శ్రీరెడ్డి ఆరోపణలకు సంబంధించి ఎవరిమీద అయినా ఆధారాలు ఉంటే.. తప్పు చేసినవారు ఎంత పెద్ద వారయినా వారి పేర్లను బయట పెట్టాలి’ అని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. సినిమాల్లో అవకాశాలిస్తామంటూ ప్రకటనలు ఇచ్చి ఎందరో అమ్మాయిల జీవితాలను నాశనంచేసే కీచకులు చాలామంది ఉన్నారు. అయితే వారికీ సినీ పరిశ్రమకూ సంబంధం లేదని తమ్మారెడ్డి అంటున్నారు. ఒకవేళ పరిశ్రమలోని పెద్దలు అనుచితంగా ప్రవర్తించినట్టయితే.. ఆ సాక్ష్యాలతో ముందుకు రావాలని ఆయన అంటున్నారు.
శ్రీరెడ్డిపై వెలి..!
శ్రీరెడ్డి కారణంగానే తెలుగు సినీ పరిశ్రమకు చెడ్డపేరు వచ్చేసిందన్నట్లు ‘మా’ సభ్యులు మాట్లాడుతున్నారు. ‘మా’ పరువు తీసిన శ్రీరెడ్డిని ఇంచుమించు వెలివేసేశారు. ‘మా’లో సభ్యత్వం ఇచ్చేది లేదనడమే కాకుండా, శ్రీరెడ్డితో ఎవరూ నటించకూడదన్న నిషేధం ఆ వెలిలో భాగమే అంటున్నారు మేధావులు. కఠిన చర్యలతో శ్రీరెడ్డి గొంతు నొక్కేస్తున్నారా? లేక ‘మా’ చెప్పినట్లు సినీ పరిశ్రమ అంతా నిష్కళంకంగా, కడిగిన ముత్యంలా ఉందా అన్నది ఎవరు తేల్చాలి? అని ప్రశ్నిస్తున్నారు హక్కుల నేతలు. ఒక్క సిని పరిశ్రమలోనే కాదు, వ్యవస్థలోని అన్ని రంగాల్లోనూ మహిళలపై వికృత చేష్టలూ, లైంగిక వేధింపులు దారుణంగా ఉంటున్నాయన్నది నిష్ఠుర సత్యమని చెప్తున్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ కచ్చితంగా అతీతం కాదని అంటున్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనను చూసి సిగ్గుపడిపోతున్నామంటున్న సినీ పెద్దలు.. సినిమాల్లో అంతకన్నా దారుణమైన రీతిలో మహిళలను చూపిస్తోంటే ఎందుకు సిగ్గుపడలేదని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సినిమాల్లో అరకొర బట్టలతో అమ్మాయిలను చూపిస్తూ, వారితో హీరోలు వెకిలి వేషాలు వేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తోన్నపుడు ‘మా’ పరువు ఎక్కడికి పోయిందని మహిళా నేతలు నిలదీస్తున్నారు.
జాతీయ మీడియా దృష్టికి..!
తనకు సభ్యత్వం ఇవ్వకపోవడమే కాదు.. తనతో నటించిన ‘మా’ సభ్యులపైనా వేటు వేస్తామని ఆ సంఘం హెచ్చరించడంపై శ్రీరెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. సినీ పరిశ్రమలో మహిళలను వేధించే పెద్దలను కాపాడేందుకే ‘మా’ పని చేస్తోందని, ఆ పెద్దల చిన్నబుద్ధులను సాక్ష్యాలతో సహా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తున్నానని ఆమె ప్రకటించారు. తాను లేవనెత్తిన సమస్యలపై సినీ పరిశ్రమ సమాధానం చెప్పేదాకా తన పోరాటం ఆగదని హెచ్చరించారు. శ్రీరెడ్డి వ్యవహారం జాతీయ దృష్టిని ఆకర్షించడమే కాదు.. అంతర్జాతీయ సమాజం దృష్టిలోనూ పడింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా వ్యక్తుల గొంతులు నొక్కేయాలనుకునే ధోరణి ఎవరికీ మంచిది కాదని మేధావులు అంటున్నారు. ఏ రంగంలోనూ అందరూ మంచివాళ్లే ఉండరు. అలాగని అందరూ చెడ్డవాళ్లూ ఉండరు. కాకపోతే ఫలానా రంగంలో తనకి అన్యాయం జరిగిందని ఎవరు బయటకు వచ్చినా వారి బాధను తెలుసుకుని, వారి సమస్యను అర్థం చేసుకుని పెద్ద మనసుతో నిర్ణయాలు తీసుకోవాలే తప్ప కక్షసాధింపుతో వ్యవహరించకూడదని హక్కుల నేతలు హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment