ఎన్.శంకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో దుమారం రేగడంతో మహిళా రక్షణకు సినీ పరిశ్రమ నడుం బిగించింది. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలుగు సినిమా డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కమిటీ తుది రూపుదిద్దుకోవాలంటే కొన్ని న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉందని అన్నారు.
ఈ కమిటీలో సగం మంది ఇండస్ట్రీ బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారని ఎన్.శంకర్ తెలిపారు. డాక్టర్లు, లాయర్లు, విశ్రాంత ఉద్యోగులు విద్యావేత్తలు, సైకాలజిస్టులు సభ్యులుగా ఉండడంతో.. లైంగిక వేధింపులపై పారదర్శకంగా చర్చించేందుకు వీలు అవుతుందన్నారు. ఇకపై ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు వీడియోగ్రఫీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అదే సమయంలో ఆడిషన్స్ జరిగేటప్పుడు ఒక మహిళా పర్యవేక్షకురాలు ఉండేలా నిబంధనలు రూపొందించామన్నారు. కమిటీలో ‘షీ టీమ్ హాట్ లైన్’ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని శంకర్ పేర్కొన్నారు.
తద్వారా ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశముంటుందని అన్నారు. మోడలింగ్ కో-ఆర్డినేటర్స్‌కి సరైన లైసెన్సింగ్, అర్హతలు ఉండేలా చర్యలు మొదలు పెట్టామని తెలిపారు. సినిమా రంగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి పలు అసోషియేషన్స్ ఉన్నట్లే మహిళా సమస్యల పరిష్కారానికి కూడా కొన్ని సంఘాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు తాము ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్ని వేరే ప్లాట్ ఫాంలలో వ్యక్తం చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. అలాగే మీడియా నియంత్రణపై వస్తున్న వార్తలను ఎన్.శంకర్ ఖండించారు. ఇండస్ట్రీలో ఎక్కడా మీడియా నియంత్రణ గురించి మాట్లాడలేదని, మీడియా, సినీ పరిశ్రమ రెండు కలిసే ఉంటాయని, ఉండాలని ఆయన అన్నారు. ఇక చిత్ర పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment