సాక్షి, హైదరాబాద్: దర్శకుడు ఎన్.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేంటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరిగింది. శంకర్‌పల్లిలోని మోకిల్లాలో దర్శకుడు శంకర్‌కు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, కారు చౌకగా భూమిని కేటాయించారని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో రూ.50 కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు శంకర్ ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి లభిస్తుందని పేర్కొన్నారు.
(‘దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదు’)
అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి ధర ఎంత ఉంటుందని హైకోర్టు ప్రశ్నించగా.. మార్కెట్ విలువ ప్రకారం రూ.2.50 కోట్లు ఉంటుందని హెచ్‌ఎండీఏ పేర్కొంది. మరి రూ.2.50 కోట్ల భూమిని ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు ఎకరా చొప్పున కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించగా.. తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.
(ఏవిధంగా సమర్థించుకుంటారు..? )
Comments
Please login to add a commentAdd a comment