తొలియత్నం : ఆ తల్లి గర్భశోకమే నా కథ!
రంగురంగుల కలలు కనే వయసు రాజ్యం ఇనుప పదఘట్టనల కింద అత్యంత క్రూరంగా నలిపివేయబడినపుడు...
ప్రజాస్వామ్యపు వాకిటిలో జీవించే ప్రాథమిక హక్కు నిర్దాక్షిణ్యంగా నేలరాలినపుడు... దేహపు తీరమంతా దుఃఖంతో కోసుకుపోయిన ఓ తల్లి గర్భశోకం ఒక కథకు ఊపిరి పోసింది. తిరిగిరాని లోకాలకు తరలిన కొడుకు కోసం ఆ మాతృమూర్తి పడిన ఆవేదన ఒక యువకుడిలో ఆవేశం రగిలించింది. కథ సమాజానికి దూరమై సినిమా కేవలం వినోద సాధనంగా మారినవేళ జీవితం- కథ-సినిమా కలగలిసి వెండితెరపై రాసిన మానవీయ కథాంశం ‘ఎన్‌కౌంటర్’.
ఈ కథ పుట్టిన కల్లోలిత క్షణాల గురించి డెరైక్టర్ ఎన్.శంకర్ మనసు విప్పిన సందర్భమిది!
ఒక కళాకారుడు తాను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తాడు, తాను ఏడుస్తూ ఎదుటివారిని ఏడిపిస్తాడు. కానీ ఇక్కడ ఒక మాట్లాడలేని, చూడల్లేని, కదల్లేని ఒక శవం ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది.
నేను మద్రాసులో కో-డెరైక్టర్‌గా పనిచేసేటప్పుడు ఒకసారి హైదరాబాద్ వచ్చాను. ఒక పెద్ద హీరోకి కథ చెప్పాను. ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ మధ్యలో ఒకసారి మా ఊరికి వెళ్లాను.
ప్రజా ఉద్యమాలు మంచి ఊపులో ఉన్న కాలమది. అప్పట్లో ఏ పేపర్లో చూసినా ఎన్‌కౌంటర్ వార్తలే. అప్పుడు మా నల్లగొండ జిల్లాలో వలిగొండ దగ్గర నలుగురు నక్సలైట్లను పోలీసులు చెట్లకి కట్టేసి ఎన్‌కౌంటర్ చేశారు. వాళ్లకు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసుంటుంది. విషయం తెలిసి చాలా బాధనిపించింది. వీళ్లు దేశానికి చేసిన నష్టమేమిటి, వీళ్లను పోలీసులు అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆలోచించాను. ఆ నలుగురి నేపథ్యం తెలుసుకుంటే మరింత బాధేసింది. నలుగురివీ పేద కుటుంబాలు. తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి పిల్లలను చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనుకున్నాను. విషయాన్ని ఒక మానవీయ కోణంలో చెప్పాలని ఆలోచించా. నక్సలైట్లు, పోలీసులు ఇద్దరూ మనుషులే, ఇద్దరూ పోరాటం చేస్తున్నారు. ఐతే ఎవరు ఎందుకోసం పోరాడుతున్నారనేది నా కథలో స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నాను.
స్క్రిప్ట్ దశలో చాలామంది పోలీస్ ఆఫీసర్లను, యాంటీ నక్సల్స్ స్క్వాడ్, కవులు, కళాకారులను, నక్సల్స్ సానుభూతిపరులను కలుసుకుని మాట్లాడాను. వాళ్ల అభిప్రాయాలను నా ఆలోచనలతో బేరీజు వేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ని. ఈ క్రమంలో ఒకసారి చౌటుప్పల్‌లో అమరవీరుల తల్లిదండ్రుల సమావేశానికి వెళ్లాను. వలిగొండలో చనిపోయిన నలుగురిలో ఒకరి తల్లిని స్టేజ్ వెనుకకు పిలిచి మాట్లాడటం మొదలుపెట్టాను.
ఆమె బండిమీద జామకాయలు అమ్మేది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కొడుకు సైకిల్ షాప్‌లో పంక్చర్లు వేసేవాడు. ఎన్‌కౌంటర్ చేసిన తరువాత కుర్రాడి మేనమామను పిలిచి పోలీసులు బెదిరించారు. అతని ద్వారా తల్లికి కబురు పంపించారు. ఆమె అక్కడికి వెళ్లి చూస్తే కొడుకు మొహమంతా గుర్తుపట్టరాని విధంగా ఉంది. ఆమె ఆ హృదయవిదారక సన్నివేశాన్ని అలా చెప్పుకుపోతూనే ఉంది. ఆమె మాటలకు అడ్డుతగులుతూ మరి ఆ శవం నీ కొడుకుదేనని ఎలా గుర్తుపట్టావమ్మా అని అడిగాను. చేతులు, కాళ్లు చూసి గుర్తుపట్టానని చెప్పింది. అదేంటమ్మా అంటే, కొడుకుకు స్నానం చేయించేటప్పుడు కాళ్లకు వేళ్లకు నూనె పెట్టి రుద్దేదాన్ని. అలా వేల మార్లు నునుపయ్యే వరకూ రుద్దినదాన్ని, నా కొడుకు కాళ్లను, వేళ్లను నేను గుర్తుపట్టలేనా నాయనా అంది. పోలీసులు చంపారంటే ఏదో కొంచెమైనా తప్పు చేసుంటాడు కదా అన్న ధోరణిలో, ఇంతకూ నీ కొడుకు మంచోడా చెడ్డోడా అని అడిగాను.
మాట్లాడేదల్లా ఒక్క క్షణం ఆగి, కళ్లనిండా నీరు తెచ్చుకుంది. బిడ్డా నా కొడుకు చెడ్డోడా అంటే ఏం చెప్పను, వాడు తిట్టినోళ్లను తిట్టెటోడు కాదు, కొట్టినోళ్లను కొట్టెటోడు కాదు అంది. ఆ మాటతో ఒక్క క్షణం నా గుండె బరువెక్కింది. ఆవిడతో ఇంకేం మాట్లాడలేకపోయాను. అలాగే హైదరాబాద్ వచ్చేశాను. అప్పటికి రాత్రి రెండైంది. బరువు దించుకోవడానికి ఆ రాత్రిపూట స్నానం చేస్తుంటే నా ఒంటిమీద నీళ్లు, కంట్లో కన్నీళ్లు కలగలసిపోయాయి. అప్పటికప్పుడు ‘ఎనకొచ్చే ఆవుల్లారా’ పాట రాయడం మొదలుపెట్టాను. ఆలోచన సాగిపోతోంది. ఆవేశం అక్షరమై కాగితం మీద దూకుతోంది. అనైతికమైన, అరాచకమైన, అప్రజాస్వామికమైన సమాజంలో ఒక తల్లి తన కొడుకు ఎక్కడికి పోయాడు, తన కొడుకు జాడ ఎక్కడని ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నే ఒక పాటైంది. చివరకు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు, ఆర్థిక, సామాజిక అసమానతల నుండి పుట్టిన సమస్య అని; భూమి కోసం, భుక్తి కోసం జరుగుతున్న పోరాటమని నా కథ ద్వారా చెప్పే ప్రయత్నం మొదలుపెట్టాను.
సెల్వమణి నిర్మాతగా, నేను దర్శకుడిగా తెలుగు, తమిళం, మలయాళంలో సినిమా చేయాలనుకున్నాం.
పోలీస్ ఆఫీసర్‌గా మమ్ముట్టిని, హీరోగా ప్రశాంత్‌ను అనుకున్నాం. కృష్ణన్న పాత్రకు కృష్ణగారు న్యాయం చేస్తారని ఆయనను అడిగితే సరేనన్నారు. ప్రాజెక్ట్ మరీ ఆలస్యమవుతుండటంతో కృష్ణగారు పద్మాలయా బ్యానర్‌లో తీయడానికి ముందుకొచ్చారు. ఐతే, సినిమా కేవలం తెలుగుకే పరిమితం కావడంతో మమ్ముట్టి స్థానంలో వినోద్‌కుమార్‌ను, ప్రశాంత్ బదులు రమేశ్‌బాబును తీసుకున్నాం. షూటింగ్ చాలా ప్రాంతాల్లో చేయాల్సి వచ్చింది. వికారాబాద్ ఫారెస్ట్, మదనపల్లి, తలకోన, హార్సిలీ హిల్స్, భద్రాచలం, చింతూరు, చిత్తూరు జిల్లాలో తెట్టు, కదిరి స్థూపం దగ్గర చిత్రీకరణ జరిపాం. చింతూరు అడవుల్లో పాట షూట్ చేస్తున్నప్పుడు కింది నుంచి నక్సలైట్లు పాట మళ్లీ వినిపించమని చెప్పి పంపేవాళ్లు. వికారాబాద్‌లో ఒక ఊళ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నక్సలైట్లు కృష్ణగారి దగ్గరకు వచ్చి ఏకే 47 అలా కాదు, ఇలా పట్టుకోవాలి అని చూపించి మెరుపువేగంతో మాయమయ్యారు. ఒక సన్నివేశంలో డైలాగ్‌లకు, మాకు సెక్యూరిటీగా ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు చప్పట్లు కొట్టారు. అలా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్నో మరిచిపోలేని అనుభవాలు. షూటింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు నిన్ను కూడా ఏమైనా చేస్తారని చాలామంది భయపెట్టారు. ఐనా, ఏమాత్రం వెనక్కు తగ్గకుండా షూటింగ్ చేశాను. మరోవైపు పోలీసులు షూటింగ్‌లో రోజూ ఏం జరుగుతుందో నోట్ చేసుకుని డీజీపీ దొరకు పంపేవాళ్లు.
సినిమాలో స్వర్ణక్క డెత్ సీన్ చాలామందిని కదిలించింది. ఇక్కడ ఒక ప్రయోగం చేశాను. మామూలుగా ఏ ప్రక్రియలోనైనా ఒక కళాకారుడు తాను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తాడు. తాను ఏడుస్తూ ఎదుటివారిని ఏడిపిస్తాడు, కానీ ఇక్కడ ఒక మాట్లాడలేని, చూడల్లేని, కదల్లేని ఒక శవం ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సన్నివేశం ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తెప్పించింది. చాలా చోట్ల థియేటర్లలో సినిమా చూసిన నక్సలైట్లు ఈ సన్నివేశం చూసి గన్స్ ఆఫ్ హానర్ చేశారు.
క్లైమాక్స్‌లో వచ్చే సీన్ ప్రేక్షకుల భావోద్వేగాలను పతాకస్థాయికి తీసుకెళ్లింది. కొడుకును డాక్టర్‌ను చేసి పల్లెలో అందరికీ మంచి వైద్యం అందించాలని కలగన్న తల్లి, చివరకు తన కొడుకుతో నువ్వు రోగాల్ని నయం చేయాల్సింది వ్యక్తికి కాదు, సమాజానికి. నీ చేతిలో ఉండాల్సింది సూది కాదు తుపాకీ అంటుంది. ఈ సన్నివేశం కథకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. తన కొడుకు కోసం ఎదురుచూసే తల్లిగా రాధిక నటన ప్రేక్షకులను కదిలించింది. కృష్ణన్నగా కృష్ణ, స్వర్ణక్కగా రోజా తమ పాత్రలో ఇమిడిపోయారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం, ప్రజాకవుల సాహిత్యం సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసింది. ముఖ్యంగా ఊరువాడ అక్కల్లారా, అమరవీరులకు జైబోలో, పల్లె తెల్లవారుతున్నదా, ఎనకొచ్చే ఆవుల్లార పాటలు జనం గుండెల్లో మారుమోగాయి.
ప్రజాకవి గోరటి వెంకన్నను ఈ సినిమా ద్వారా సినీరచయితగా పరిచయం చేశాను. తను రాసిన అమరవీరులకు జైబోలో పాట పెద్ద హిట్ అయింది. తన పల్లె కన్నీరు పెడుతుందో పాటను ఈ సినిమాలో వాడుదామనుకున్నాం కానీ, అది చాలా పెద్దగా ఉండటం వల్ల కుదరలేదు. కుదించి వాడితే పాటకు న్యాయం చేయలేమని చాలా తర్జన భర్జన పడ్డాం. అప్పుడు అశోక్ తేజ పల్లె తెల్లవారుతున్నదో పాట రాశాడు.
సినిమా విడుదలయ్యాక, నేను, కొండపల్లి సీతారామయ్య, ఇంకా చాలామంది కలిసి విజయవాడలో ఫస్ట్ షో చూశాం. గద్దరన్న అంతకుముందు రాత్రే ప్రసాద్ ల్యాబ్స్‌లో చూశాడు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.