జూలైలో పుర ఎన్నికలు | Telangana Municipal Elections Would Be Conducted In July Says CM KCR | Sakshi
Sakshi News home page

జూలైలో పుర ఎన్నికలు

Published Wed, Jun 19 2019 3:30 AM | Last Updated on Wed, Jun 19 2019 5:00 AM

Telangana Municipal Elections Would Be Conducted In July Says CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. జూలైలోనే వాటిని పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలైలో అయిపోతుందని, ఆలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం కేబినెట్‌ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త మున్సిపాలిటీలు రావడంతో వాటి సంఖ్య 142కు పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకురావాలని అనుకుంటున్నామని, ఇం దుకు అసెంబ్లీలో చట్టం చేయాలా లేక ఆర్డినెన్స్‌ తేవాలా అని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు. వెంటనే బీసీ రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్లను పూర్తి చేయాలని మున్సిపల్‌ శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు వెల్లడించారు.

‘‘రిజర్వేషన్లు అయిపోతే వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించవచ్చు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నం. పది పదిహేను రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తాం. జూలైలో 100 శాతం ఎన్నికలు ముగించే ప్రయత్నం చేస్తం. మున్సిపల్‌ ఎన్నికలు అయిపోతే పరిపాలన చూసుకోవచ్చు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. భూ కేటాయింపులకు ఆమోదం: తెలంగాణ ప్రాంత సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు శంకర్‌పల్లిలోని మోకిల ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘‘స్టూడియో కట్టుకోవడానికి శంకర్‌ చాలా రోజుల నుంచి స్థలం కోరుతున్నరు. తెలంగాణవాది కావడం, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం, తెలంగాణ బిడ్డ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నం.

విశాఖ శారదా పీఠం ట్రస్టుకు కూడా రెండెకరాల స్థలం కేటాంచాలని నిర్ణయించినం. సంస్కృత పాఠశాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్థలం కావాలని రెండు మూడేళ్లగా పీఠంవారు అడుగుతున్నరు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల స్థాపన కోసం స్థల కేటాయింపులు జరపాలని నిర్ణయించాం. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే నిర్మించినం. వరంగల్‌ రూరల్‌ జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థల కేటాయింపుల్లో మార్పు చేయాలని ఆ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అభిప్రాయపడడంతో ఆ జిల్లా పార్టీ కార్యాలయానికి స్థల కేటాయింపులను వాయిదా వేశాం. హైదరాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నం’’ అని తెలిపారు. 

కిషన్‌రెడ్డి జోక్‌గా మారారు.. 
ఉగ్రవాదానికి హైదరాబాద్‌ అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విని జనం నవ్వుకుంటున్నారని కేసీఆర్‌ తెలిపారు. కిషన్‌రెడ్డి ఒక జోక్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్ర తిరిగేసి చూస్తే ప్రతి సంవత్సరం పది, పన్నెండుసార్లు మత కల్లోలాలు జరిగేవని, గత 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి కూడా మత కలహాలు జరగలేదని గుర్తుచేశారు. విపరీతంగా నేరాలు తగ్గాయని కేంద్ర హోంశాఖ స్వయంగా చెప్పిందన్నారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిందని అనడానికి ఏమైనా అర్థం ఉందా అని పేర్కొన్నారు. బాధ్యత గల వ్యక్తులు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక చిన్న సంఘటన లేదని, ఒక ఉగ్రవాద దాడి జరగలేదని, తాము చాలా క్రియాశీలంగా ఉన్నామని స్పష్టంచేశారు. ప్రభుత్వంగా ఏమేం చేస్తామో చాలా విషయాలు చెప్పమని, భారత దేశంలో ఇంత చక్కగా ఏ రాష్ట్రం లేదని వ్యాఖ్యానించారు. 

టీఆర్టీ అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు 
టీఆర్టీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించినట్టు కేసీఆర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టీఆర్టీ అభ్యర్థులు నిర్వహించిన ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమం రాజకీయ ప్రేరేపితమని, అలాంటి ధర్నాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే తామే పిలిపించి మాట్లాడతామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోర్టు కేసులున్న పోస్టులను పక్కనబెట్టి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement