అఖిల, ప్రణతి
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు.
దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్.
Comments
Please login to add a commentAdd a comment