Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా | Ayesha Charugulla Running An Ngo In India | Sakshi
Sakshi News home page

Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా

Published Wed, Jun 2 2021 2:41 AM | Last Updated on Wed, Jun 2 2021 12:30 PM

Ayesha Charugulla Running An Ngo In India - Sakshi

పై చదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు అక్కడే ఉద్యోగం చూసుకొని, స్థిరపడిపోతారు. ఎప్పుడైనా ఒకసారి స్వదేశానికి వచ్చి, తల్లిదండ్రులను కలిసివెళ్లిపోతారు. ఆయేషా చారుగుళ్ల విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే, కొన్నాళ్లకు తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. నిరుపేద, వికలాంగబాలల చదువులు, ఆటిజమ్‌ చిన్నారులకు సెంటర్లు, ట్రాఫికింగ్‌కు గురైన మైనర్‌ అమ్మాయిల భవిష్యత్తు కోసం కృషి చేసే ఆయేషా ఇప్పుడు మహమ్మారి కష్టకాలంలో తనూ ఓ చేయూతగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో తను అందిస్తున్న సేవల గురించి ఆయేషా ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. 

‘‘పాతికేళ్ల క్రితం విజయవాడ నుంచి అమెరికా వెళ్లాను. భర్త, ఇద్దరు పిల్లలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం మా ఇద్దరు పిల్లలతోపాటు, కమ్యూనిటీ లో ఉన్న పిల్లలను సెలవుల సమయం లో గమనించాను. అంతా ఒకే మూస పద్ధతిలో పెరుగుతున్నారనిపించింది. లగ్జరీ జీవనం కాకుండా మెరుగైన జీవన విలువలు తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అలా, వారాంతాల్లో పిల్లలను కూడగట్టుకొని వర్క్‌షాప్స్‌ ఏర్పాటు చేసేదాన్ని. మంచి స్పందన వచ్చింది. బాగానే స్థిరపడ్డాం కదా అనే ఆలోచనతో ఉద్యోగం మానేసి పిల్లలందరినీ కూడగట్టుకొని వారిచేత రకరకాల ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. పిల్లలు కూడా నేను చేస్తున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ఈ పనిలో కొంతమంది స్నేహితులు, పిల్లల తల్లిదండ్రులు జత కలిశారు. దీంతో స్నేహితుల సలహా మేరకు 2015లో ఆరుగురు పిల్లలతో ‘ఎంపవర్‌ అండ్‌ ఎక్సెల్‌’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. ఇప్పుడు 500 మంది పిల్లలే స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహించే దశకు చేరుకున్నారు. వారాంతాల్లో ఓల్డేజీహోమ్‌లకు వెళ్లడం, తామే స్వయంగా వంట చేసి, ఆహారాన్ని పంచడం, వారికన్నా చిన్న పిల్లలకు వర్క్‌షాప్స్‌ కండక్ట్‌ చేయడం.. ఎంతగా మారిపోయారు పిల్లలు అనిపిస్తుంది వారిని చూస్తుంటే. 

ప్రతి యేటా వేసవి సమయం
మా అమ్మానాన్నలు ఆంధ్రాలోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతి యేటా నిర్వహించేవాళ్లం. నాతో పాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్‌ చేసే పిల్లలు కనీసం పది మందైనా ఇండియాకు వచ్చేవారు. వారితో ఇక్కడి స్కూల్‌ పిల్లలకు ఇంగ్లిషు వర్క్‌షాప్స్‌ కండక్ట్‌ చేసేదాన్ని. నాతోపాటు వచ్చిన స్టూడెంట్స్‌లో స్ఫూర్తి వెల్లంకొండ అనే అమ్మాయి ఇండియాకి ఆమె తల్లితో కలిసి వచ్చి ఇండియా చాప్టర్‌ ఆధ్వర్యంలో అడపిల్లలకి శరీర శుభ్రత, నెలసరి గురించి 50 సెషన్స్‌ నడిపించింది. ఆ విద్యార్థిని హైజీన్‌ మీద స్వయంగా రాసిన ’జాగృతి’ అనే బుక్‌ కూడా రిలీజ్‌ చేశాం. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. 

మరిన్ని అడుగులు..
ప్రకాశం జిల్లా మాచవరంలో ఆశాసదన్‌ ట్రాఫికింగ్‌ మైనర్‌ విక్టిమ్స్‌ గురించి తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. దాదాపు 70 మంది పిల్లలు. ఒక విధంగా సమాజం నుంచి దూరమైన పిల్లలు అనుకోవచ్చు. వారికి అండగా ఉండాలని ఏడాది పొడవునా ఆహారంతోపాటు వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి బేకింగ్‌ సామాను అమెరికా నుంచి తెచ్చి ప్రొఫెషనల్స్‌తో ట్రైనింగ్‌ ఇప్పించాం. జూట్‌ బ్యాగ్‌ తయారీ నేర్పించి, ఆ బ్యాగులను అమెరికాలో మార్కెట్‌ చేసి ఆ సొమ్ము మొత్తాన్ని వారికి అందించాం. సెల్ఫ్‌డిఫెన్స్‌లో అమ్మాయిలకు శిక్షణ ఇప్పించాం.

పశ్చిమ గోదావరి జిల్లా ఆశా జ్యోతి అనే సంస్థ మానసిక – భౌతిక వికలాంగులకు సర్వీస్‌ చేస్తుంటుంది. అక్కడి పిల్లల పరిస్థితి చూసి, చలించిపోయాం. వారికి కావాల్సిన భోజన సదుపాయాలు, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. వికలాంగ బాలలకు వీల్‌ చైర్స్‌తోపాటు హైడ్రోథెరపీకి సంబంధించిన పూల్‌ని ఏర్పాటు చేశాం. పిల్లలకి పాల కోసం పాడి గేదెలను, ఆవులను కొనిచ్చాం.

కృష్ణాజిల్లా నూజివీడులోని ఓ హెచ్‌ఐవి పాజిటివ్‌ సంస్థలోని చిన్నారులకు దుస్తులు, భోజన సదుపాయం, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కాలేజ్‌ ఫీజు ఏర్పాటు చేశాం. ముంబాయ్‌కి చెందిన ‘లిటిల్‌ హార్ట్స్‌’ అనే ఆటిజం సెంటర్‌ లో చిన్నారులకు అమెరికాలోని స్పెషలిస్ట్స్‌ ద్వారా టెలీ మెడిసిన్‌ థెరపీ ఇప్పించాం. తెలంగాణలోని ఖమ్మంలో చేగొమ్మ, కనికెళ్ల గ్రామాల్లోని స్కూల్‌ టీచర్లు వలంటీర్ల ద్వారా లైబ్రరీ ఏర్పాటుకు సంప్రదించడంతో వారికి ఆ ఏర్పాటు చేశాం. 

సాయానికి సిద్ధం
2020లో మేమంతా కరోనా సృష్టించిన దారుణాలను చవిచూశాం. ఇప్పుడు కాస్త కుదుటపడ్డాం. కాని, భారత్‌ పరిస్థితి మమ్మల్ని కలచివేస్తోంది. ఏదోవిధంగా మనవాళ్లకి సహకరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి ఆంధ్రలో విజయవాడ, వినుకొండ, నరసరావుపేట, తెనాలిలో 500, తెలంగాణలో 300 బెడ్స్, ఆక్సిజన్‌ ఫ్లోమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించాం. గుంటూరు ఫీవర్‌ హాస్పిటల్‌కి మరిన్ని బెడ్స్‌ అందించనున్నాం. మహమ్మారి నుంచి అందరూ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ బెడ్స్‌ను ఓల్డేజీ హోమ్స్‌కు ఇవ్వాలనుకుంటున్నాం.

తెలంగాణలో హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌కి, ఖమ్మంలోని బివికే భవన్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కి బెడ్స్‌ అందించాం. మరిన్ని బెడ్స్‌ అవసరం గురించి తెలిసింది. వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సర్వీస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేశాం. తాడేపల్లి నుంచి మంగళగిరి చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న కరోనా పేషెంట్స్‌ను ఉచితంగా ఆసుపత్రికి చేర్చాలనేది మా ఉద్దేశ్యం. ఈ వెహికిల్‌ డ్రైవర్స్, అటెండర్స్‌కి పీపీఈ కిట్లు, మాస్కులు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకున్నాం.

మా హస్బెండ్‌ సంజయ్‌ చారుగుళ్ల 50 బెడ్స్‌ స్పాన్సర్‌  చేశారు. ఇదే విధంగా ఫండ్‌ రైజింగ్‌ మొత్తం మా మిత్రులు, మా వలంటీర్‌ కుటుంబాల నుంచే ఉంటుంది. రాబోయే రోజుల్లో థర్డ్‌ వేవ్‌ అంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆందోళన ఓ వైపు ఉన్నా, తట్టుకొని నిలబడానికి మా వంతుగా ఇవ్వదగ్గ సహకారానికి సమాయత్తం అవుతున్నాం’’ అంటూ వివరించారు ఆయేషా. 
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement