చార్మినార్‌కే.. కినారే | Inampudi Srilaxmi wins palapitta award for documentary on Charminar | Sakshi
Sakshi News home page

చార్మినార్‌కే.. కినారే

Published Thu, Jan 29 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

చార్మినార్‌కే.. కినారే

చార్మినార్‌కే.. కినారే

వందల ఏళ్ల నాటి చార్మినార్‌ను మనం ఒక వారసత్వ సంపదగా మాత్రమే చూస్తాం. కానీ, చార్మినార్ చుట్టూ ఎన్నో జీవితాలు ఆ చారిత్రక కట్టడమంత ఠీవీగా సాగుతున్నాయి. చెట్టును అల్లుకున్న లతలా చార్మినార్‌తో పెనవేసుకున్న అక్కడి ప్రజల జీవన శైలిని దృశ్యంగా కళ్లకు కట్టాలనుకున్నారు శ్రీలక్ష్మి. ఆ దృశ్యానికి అక్షరాన్ని కూర్చి.. అనుకున్నది సాధించారు. డాక్యుమెంటరీని డాక్యుపోయెమ్‌గా తీర్చిదిద్దిన ప్రయోగానికి ప్రముఖుల ప్రశంసలతో పాటు జాతీయస్థాయిలో జరిగే పాలపిట్ట అవార్డూ వరించింది.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి  
 
 హైదరాబాద్ ఆలిండియా రేడియోలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా విధుల్లో ఉన్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. తనలోని సృజనాత్మకతను పెంచే వేదికలు వెతుక్కుంటూ ప్రవృత్తిలోనూ రాణిస్తున్నారు. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, కవయిత్రిగా, రచయిత్రిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తన లోని సృజనను పలు రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. లైఫ్ ఎట్ చార్మినార్ డాక్యుమెంటరీ కూడా ఆ సృజన నుంచి పుట్టిందే.
 
 మూడేళ్ల కిందట..
 హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. ఈ అపురూప నిర్మాణం లేని హైదరాబాద్‌ను ఊహించలేం. చార్మినార్‌ను కథా వస్తువుగా ఎంచుకుని.. ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని భావించారు శ్రీలక్ష్మి. అందుకోసం ఎన్నో పుస్తకాలు తిరగేశారు. ఎందరినో కలిశారు. ‘చాలా కష్టం’ అని ఉత్సాహం మీద నీళ్లు చల్లినవారూ ఉన్నారు. ఆ కష్టం ఎలా ఉంటుందో చూడాలనుకుని మరీ ఆమె రంగంలోకి దిగారు.
 
 చార్మినార్ నీడలో కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్న వర్తకులు, వ్యక్తుల జీవితాలను కలగలిపి తన డాక్యుమెంటరీలో మినీ భారతాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. శ్రీలక్ష్మి ఆలోచనకు ఆమె కూతుళ్లు సాయినవ్యత, సాయివర్షిత అండగా నిలిచారు. వారి స్నేహితులు చంద్రలేఖ, సుమశ్రీలను వెంట తీసుకొచ్చారు. ఐదుగురూ కలిసి డాక్యుమెంటరీకి బడ్జెట్‌ను తయారు చేశారు. ఇంట్లో ఉన్న హ్యాండీకామ్, శ్రీలక్ష్మి రూపొందించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ రూపకల్పనకు అయ్యే ఖర్చును తను భరిస్తానని చిన్నకూతురు చెప్పింది. రంజాన్ మాసంలో జిలుగు వెలుగుల చార్మినార్ ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ రోజులను ఎంచుకున్నారు. అంతా కలిసి చార్మినార్ వైపుగా పయనమయ్యారు.
 
 24 రోజులు... 4 గంటలు...
 ఒక మినార్ చారిత్రక వారసత్వం
 ఒక మినార్ సమకాలీన జీవనం
 ఒక మినార్ పర్యాటక చేతనం
 ఒక మినార్ వ్యథాభరిత హృదయం
 నాలుగు దిక్కులు ఒకే చోట కలుస్తున్న సజీవ దృశ్యం చార్మినార్!
 
 ‘చార్మినార్ చుట్టూ అల్లుకుపోయిన జీవితాలను పరికిస్తే ఎవరిలోనూ చిన్న నిరాశ కూడా కనిపించదు’ అంటారు శ్రీలక్ష్మి. ‘వారిలోని ఆ ఆశాభావాన్ని చిత్రంగా రూపొందించాలనుకున్నాను. ముందుగా డీజీపీ అనుమతి తీసుకొని వెళ్లినా, డాక్యుమెంటరీ పూర్తయ్యేంతవరకు ఇబ్బందులు తప్పలేదు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ప్రాంతంలో షాపుల యజమానులను ఒప్పించి, నచ్చజెప్పి బైట్స్ తీసుకున్నాం. కొన్ని సార్లు షాపింగ్ చేసి, ఎంతో కొంత వదిలించుకుంటే తప్ప సరిపడినంత ఫుటేజీ రాలేదు. బెగ్గర్స్ కూడా డబ్బులిస్తేనే బైట్స్ ఇచ్చేవారు.
 
 అలా మొత్తం షూట్ చేయడానికి 24 రోజులు పట్టింది. షూట్ చేసిందంతా చూసుకుంటే 4 గంటల పుటేజీ వచ్చింది. దాంతో 16 నిమిషాల నిడివిగల ఫిల్మ్‌ని తయారుచేయడానికి ఎడిటింగ్ తెలిసిన సుమనశ్రీ సాయం చేసింది. డాక్యుమెంటరీ చూశాక పడిన కష్టమంతా దూదిపింజలా తేలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆత్మసంతృప్తి, అవార్డులు, ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.’ అంటూ ఆనందంగా వివరించారు శ్రీలక్ష్మి. ప్రయోగాత్మకంగా తీసిన లైఫ్ ఎట్ చార్మినార్ పాలపిట్ట నేషనల్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. ఈ డాక్యుపోయెం స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
 
 మానవీయ కోణం...
 సాహిత్య ప్రక్రియలో కూడా శ్రీలక్ష్మి ఎప్పటికప్పుడూ ప్రయోగాలు చేస్తున్నారు. ‘హెచ్‌ఐవీ/ఎయిడ్స్. ‘ఆశాదీపం’ పేరిట వచ్చిన కథాసంకలనానికి సంపాదకవర్గంలో ప్రధాన భూమిక పోషించారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, వారికి కొంత ఓదార్పుగా నిలిచేందుకు కవితా థెరపీని ‘వూండెడ్ హార్ట్’పేరుతో తీసుకొచ్చారు. సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త నాగేశ్వరరావు సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నానని చెబుతారామె.
 
 అవగాహన సదస్సులు..
 రచయిత రావూరి భరద్వాజతో కలసి ‘ఏకాంతవాసి’, సినీప్రముఖులను సంప్రదించి ‘భారతీయ సినిమా’ ఎపిసోడ్స్‌కి పనిచేసిన శ్రీలక్ష్మి, అడ్వకేట్స్ వరల్డ్‌కప్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వర్క్‌షాప్.. వంటి మెగా ఈవెంట్లను నిర్వహించారు.  శ్రీహరిచంద్రా క్రియేషన్స్ బ్యానర్ మీద లైఫ్ ఇన్ కార్పొరేట్, లైఫ్ ఇన్ స్లమ్, లైఫ్ ఇన్ రెయిన్‌ల మీద డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నారు. ‘సృజన ఒక్కటే ఉంటే సరిపోదు. దాన్ని చూపించేందుకు అవసరమైన వేదికను కూడా మనమే వెతుక్కోవాలి. అది తెలిస్తే చాలు విజేతలుగా నిలుస్తాం’ అంటూ ముగించారు శ్రీలక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement