palapitta
-
పాపం పాలపిట్ట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకే అది రాష్ట్ర పక్షిగా కూడా అయ్యింది. అయితే, ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట (Palapitta) ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ‘రైతు నేస్తం’గా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా ప్రభుత్వం నడుం బిగించింది.ప్రమాదం అంచున..ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్ (Indian roller), బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగు డామినేట్ చేస్తూ... తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు సమయంలో 30–34 సెం.మీ (12–13 అంగుళాలు), రెక్కలు విచ్చుకున్నప్పుడు 65–74 సెం.మీ (26–29 అంగుళాలు) పొడవు, 166–176 గ్రాముల బరువుతో చూడముచ్చటగా ఉంటుంది. ఏడాది క్రితం విడుదలైన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్’లో సంఖ్య తగ్గిపోతున్న పక్షి జాతుల్లో వీటిని కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) నివేదికలో రెడ్ లిస్ట్ రీఅసెస్మెంట్ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్ (Bihar) రాష్ట్రాల్లో కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. పాలపిట్ట పరిరక్షణకు ప్రణాళికపాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్ (Radiation) అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దసరా, ఉగాది పండుగల సమయంలో కొందరు వీటిని బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుండడం కూడా వాటికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. చదవండి: హైదరాబాద్ జూ పార్కు ఎంట్రీ టికెట్ ధరల పెంపుతాజాగా జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో పాలపిట్ట సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీచట్టం షెడ్యూల్–4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే వీలుంది. దీంతో పాలపిట్ట సంరక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.రైతు నేస్తంపాలపిట్టలు రైతు నేస్తాలు. ఇవి వలస పక్షులు కావు. భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. వీటి జీవితకాలం 17–20 ఏళ్లు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్ నెలల మధ్యలో ఉంటుంది. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను వేటాడి తింటూ రైతులకు పరోక్షంగా సహకారం అందిస్తాయి. అందుకే వీటిని రైతునేస్తాలు అని పిలుస్తారు.పంటల సాగు తగ్గటంవల్లే..కొంతకాలంగా పాలపిట్టలు అంతగా కనబడడం లేదు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ విస్త రణ, నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం నిలిచిపోవడంతో వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తాయి. పంటల రక్షణకు పురుగుమందులు అధికంగా వినియోగించటం కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గటానికి కారణం. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు.పూర్తిగా అంతరించకపోవచ్చు..పాలపిట్టలు మను షులు, జనావాసా లకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందువల్ల వాటి కచ్చితమైన సంఖ్యను తెలుసుకో వడం కష్టమే. పాలపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని భావించడానికి లేదు. – డా. సాయిలు గైని, బయో డైవర్సిటీ నిపుణుడు. -
హ్యూస్టన్‌లో పాలపిట్ట పుస్తకావిష్కరణ
టెక్సాస్, హ్యూస్టన్ : ప్రవాస తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక సంచిక 'పాలపిట్ట'ను తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హ్యూస్టన్‌లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలంగాణ మహా సభల సందర్భంగా ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికలో రైతే రాజు, సినారే ఘన నివాళి, నాలుగేళ్ల తెలంగాణ, హ్యూస్టన్ తెలుగు భవనం, బోనాలు, బతుకమ్మ పండుగ, తెలంగాణంతో పాటు మరెన్నో విశేషాలు పొందుపరిచారు. ఈ పుస్తక ప్రచురణకు ప్రొఫెసర్ సాంబరెడ్డి ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులు కృష్ణ సాగర్ రావు, అమెరికా తెలంగాణ సంఘం కార్య వర్గం, తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన పలువురు కళాకారులు పాల్గొన్నారు. -
పాలపిట్టను బంధించడం నేరం
హైదరాబాద్: దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే శుభమని సంప్రదాయాన్ని పాటించడం మంచిదే అయినా మొక్కుకోసం వాటిని బంధించరాదని బ్లూ క్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎనిమల్ వెల్ఫేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దసరా రోజున పాలపిట్టను బంధించి పంజరాల్లో పెట్టుకొని వ్యాపారాలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఎక్కడైనా వీటిని బంధించినట్లు తెలిస్తే హెల్ప్‌లైన్ నంబర్లు 7674922044, 9849027601, 3298985, 9966629858 సమాచారం అందించాలన్నారు. -
చార్మినార్‌కే.. కినారే
వందల ఏళ్ల నాటి చార్మినార్‌ను మనం ఒక వారసత్వ సంపదగా మాత్రమే చూస్తాం. కానీ, చార్మినార్ చుట్టూ ఎన్నో జీవితాలు ఆ చారిత్రక కట్టడమంత ఠీవీగా సాగుతున్నాయి. చెట్టును అల్లుకున్న లతలా చార్మినార్‌తో పెనవేసుకున్న అక్కడి ప్రజల జీవన శైలిని దృశ్యంగా కళ్లకు కట్టాలనుకున్నారు శ్రీలక్ష్మి. ఆ దృశ్యానికి అక్షరాన్ని కూర్చి.. అనుకున్నది సాధించారు. డాక్యుమెంటరీని డాక్యుపోయెమ్గా తీర్చిదిద్దిన ప్రయోగానికి ప్రముఖుల ప్రశంసలతో పాటు జాతీయస్థాయిలో జరిగే పాలపిట్ట అవార్డూ వరించింది. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా విధుల్లో ఉన్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. తనలోని సృజనాత్మకతను పెంచే వేదికలు వెతుక్కుంటూ ప్రవృత్తిలోనూ రాణిస్తున్నారు. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, కవయిత్రిగా, రచయిత్రిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తన లోని సృజనను పలు రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. లైఫ్ ఎట్ చార్మినార్ డాక్యుమెంటరీ కూడా ఆ సృజన నుంచి పుట్టిందే. మూడేళ్ల కిందట.. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. ఈ అపురూప నిర్మాణం లేని హైదరాబాద్‌ను ఊహించలేం. చార్మినార్‌ను కథా వస్తువుగా ఎంచుకుని.. ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని భావించారు శ్రీలక్ష్మి. అందుకోసం ఎన్నో పుస్తకాలు తిరగేశారు. ఎందరినో కలిశారు. ‘చాలా కష్టం’ అని ఉత్సాహం మీద నీళ్లు చల్లినవారూ ఉన్నారు. ఆ కష్టం ఎలా ఉంటుందో చూడాలనుకుని మరీ ఆమె రంగంలోకి దిగారు. చార్మినార్ నీడలో కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్న వర్తకులు, వ్యక్తుల జీవితాలను కలగలిపి తన డాక్యుమెంటరీలో మినీ భారతాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. శ్రీలక్ష్మి ఆలోచనకు ఆమె కూతుళ్లు సాయినవ్యత, సాయివర్షిత అండగా నిలిచారు. వారి స్నేహితులు చంద్రలేఖ, సుమశ్రీలను వెంట తీసుకొచ్చారు. ఐదుగురూ కలిసి డాక్యుమెంటరీకి బడ్జెట్‌ను తయారు చేశారు. ఇంట్లో ఉన్న హ్యాండీకామ్, శ్రీలక్ష్మి రూపొందించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ రూపకల్పనకు అయ్యే ఖర్చును తను భరిస్తానని చిన్నకూతురు చెప్పింది. రంజాన్ మాసంలో జిలుగు వెలుగుల చార్మినార్ ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ రోజులను ఎంచుకున్నారు. అంతా కలిసి చార్మినార్ వైపుగా పయనమయ్యారు. 24 రోజులు... 4 గంటలు... ఒక మినార్ చారిత్రక వారసత్వం ఒక మినార్ సమకాలీన జీవనం ఒక మినార్ పర్యాటక చేతనం ఒక మినార్ వ్యథాభరిత హృదయం నాలుగు దిక్కులు ఒకే చోట కలుస్తున్న సజీవ దృశ్యం చార్మినార్! ‘చార్మినార్ చుట్టూ అల్లుకుపోయిన జీవితాలను పరికిస్తే ఎవరిలోనూ చిన్న నిరాశ కూడా కనిపించదు’ అంటారు శ్రీలక్ష్మి. ‘వారిలోని ఆ ఆశాభావాన్ని చిత్రంగా రూపొందించాలనుకున్నాను. ముందుగా డీజీపీ అనుమతి తీసుకొని వెళ్లినా, డాక్యుమెంటరీ పూర్తయ్యేంతవరకు ఇబ్బందులు తప్పలేదు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ప్రాంతంలో షాపుల యజమానులను ఒప్పించి, నచ్చజెప్పి బైట్స్ తీసుకున్నాం. కొన్ని సార్లు షాపింగ్ చేసి, ఎంతో కొంత వదిలించుకుంటే తప్ప సరిపడినంత ఫుటేజీ రాలేదు. బెగ్గర్స్ కూడా డబ్బులిస్తేనే బైట్స్ ఇచ్చేవారు. అలా మొత్తం షూట్ చేయడానికి 24 రోజులు పట్టింది. షూట్ చేసిందంతా చూసుకుంటే 4 గంటల పుటేజీ వచ్చింది. దాంతో 16 నిమిషాల నిడివిగల ఫిల్మ్‌ని తయారుచేయడానికి ఎడిటింగ్ తెలిసిన సుమనశ్రీ సాయం చేసింది. డాక్యుమెంటరీ చూశాక పడిన కష్టమంతా దూదిపింజలా తేలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆత్మసంతృప్తి, అవార్డులు, ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.’ అంటూ ఆనందంగా వివరించారు శ్రీలక్ష్మి. ప్రయోగాత్మకంగా తీసిన లైఫ్ ఎట్ చార్మినార్ పాలపిట్ట నేషనల్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. ఈ డాక్యుపోయెం స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. మానవీయ కోణం... సాహిత్య ప్రక్రియలో కూడా శ్రీలక్ష్మి ఎప్పటికప్పుడూ ప్రయోగాలు చేస్తున్నారు. ‘హెచ్ఐవీ/ఎయిడ్స్. ‘ఆశాదీపం’ పేరిట వచ్చిన కథాసంకలనానికి సంపాదకవర్గంలో ప్రధాన భూమిక పోషించారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, వారికి కొంత ఓదార్పుగా నిలిచేందుకు కవితా థెరపీని ‘వూండెడ్ హార్ట్’పేరుతో తీసుకొచ్చారు. సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త నాగేశ్వరరావు సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నానని చెబుతారామె. అవగాహన సదస్సులు.. రచయిత రావూరి భరద్వాజతో కలసి ‘ఏకాంతవాసి’, సినీప్రముఖులను సంప్రదించి ‘భారతీయ సినిమా’ ఎపిసోడ్స్‌కి పనిచేసిన శ్రీలక్ష్మి, అడ్వకేట్స్ వరల్డ్‌కప్, హెచ్ఐవీ/ఎయిడ్స్ వర్క్‌షాప్.. వంటి మెగా ఈవెంట్లను నిర్వహించారు. శ్రీహరిచంద్రా క్రియేషన్స్ బ్యానర్ మీద లైఫ్ ఇన్ కార్పొరేట్, లైఫ్ ఇన్ స్లమ్, లైఫ్ ఇన్ రెయిన్ల మీద డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నారు. ‘సృజన ఒక్కటే ఉంటే సరిపోదు. దాన్ని చూపించేందుకు అవసరమైన వేదికను కూడా మనమే వెతుక్కోవాలి. అది తెలిస్తే చాలు విజేతలుగా నిలుస్తాం’ అంటూ ముగించారు శ్రీలక్ష్మి. -
పాలపిట్ట.. తంగేడు పువ్వు
తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి, పుష్పం ఖరారు రాష్ట్ర జంతువు జింక.. వృక్షం జమ్మిచెట్టు ఈ చిహ్నాలకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో అధికార చిహ్నాలపై పలు ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కాదని తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక చిహ్నాలు ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘జింకకు భారతదేశంలో ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను ఎంపిక చేశాం’’ అని సీఎం వివరించారు. పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని చెప్పారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారని, తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారన్నారు. విజయానికి సూచిక అయిన జమ్మిచెట్టు ఆశీర్వాదం ఇప్పుడు తెలంగాణకు కావాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు.