మంచిని విత్తండి | children do good work had parents take a good name | Sakshi
Sakshi News home page

మంచిని విత్తండి

Published Tue, Mar 28 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

మంచిని విత్తండి

మంచిని విత్తండి

వీధి చివర కుక్కపిల్లకు దెబ్బతగిలితే సుధాకర్‌రావుగారి అబ్బాయికి అయిదేళ్లు ఉంటాయేమో దాన్ని తీసుకెళ్లి కట్టుకట్టించాడు. టీ కొట్టు అతను అక్కడ పనిచేసే కుర్రాడిని బాదుతుంటే రమణిగారి అమ్మాయి ఏడేళ్లు కూడా ఉండవు అతనికి అడ్డం పడిందట. చూశారా... పిల్లల పేర్లు ఎవరికీ తెలియవు. కాని, పిల్లలు చేసిన మంచి పనితో ఆ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరు వచ్చిందో. నిజానికి దీనికి రివర్సే కరెక్ట్‌. ఆ తల్లిదండ్రుల పెంపకంలో ఆ పిల్లలు నేర్చుకున్న మంచితనం అది. తల్లిదండ్రుల ఉపదేశాలకన్నా వారి చేతలను చూసే పిల్లలు మంచి తనాన్ని నేర్చుకుంటారు. అందుకేనేమో పుట్టినప్పుడు అమ్మపోలికో, నాన్నపోలికో అంటారు. పెరిగేటప్పుడు అమ్మ మంచితనమో, నాన్న మంచితనమో అంటారు.  

‘ఎందుకు నాన్నా ఆ గింజలన్నీ అలా భూమిలో నాటుతున్నావు?’ ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ‘ఇవి మొలకెత్తి, పెద్ద మొక్కలై మరిన్ని గింజలు వస్తాయి. వాటిని విత్తితే ఇంకా ఎక్కువ గింజలు వస్తాయి.. అలా అలా మన ఊళ్లో అందరికీ సరిపోయినన్ని  గింజలను పండించుకోవచ్చు’ తండ్రి సమాధానం. ‘వీటిలాగే  మన దగ్గర ఉన్న బుల్లెట్లను నాటితే ఇంకా  బోలెడన్ని బుల్లెట్లు వస్తాయా! వాటితో మనల్ని పీడించే ఆంగ్లేయులందరినీ చంపేయచ్చా?’ ఆవేశంగా అడిగాడు కొడుకు. బ్రిటీష్‌ ఆధిపత్యం నుంచి భారతీయులను కాపాడుకోవాలనే ఆలోచన ఆ చిట్టి మెదడులో అప్పుడే రూపుదిద్దుకుంది. ఆ పిల్లాడే భగత్‌సింగ్‌. ఆ పేరే ఆంగ్లేయులను పరుగులు పెట్టించింది.  

‘ఏంటి, స్కూల్‌ టైమ్‌ అయిపోయింది, ఇప్పుడా నువ్వు వచ్చేది’  బెత్తం ఆ విద్యార్థినిపై నాట్యం చేసింది. శిక్ష పూర్తయ్యాక...  ‘ఇంతకీ ఎందుకు లేటయింది?’ అడిగింది టీచర్‌. ‘రోడ్డు దాటలేక అవస్థపడుతున్న ముసలి అవ్వను దగ్గరుండి రోడ్డు దాటించి వచ్చాను, అందుకే  లేటయింది’ బదులిచ్చిందా విద్యార్థిని. బాధించిన బెత్తం చిన్నబోయింది. ఆ చిన్నారి పాఠాలకన్నా గొప్పగా ఎదిగిపోయింది. విశ్వమంతా విస్తరించింది. ప్రపంచాన్నే సేవా మార్గం పట్టించింది. చిన్నవయసులోనే ఎంతో మానవత్వాన్ని చూపిన ఆ మానవతామూర్తే ఆగ్నస్‌. ప్రపంచ జనులందరూ అమ్మగా ఆరాధించే మదర్‌ థెరిస్సా.

‘మనిషి సంఘజీవి’ అన్నాడు అరిస్టాటిల్‌. అందరూ  ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే అందరూ అందరికోసం అన్నట్టుగా జీవించాలి. అక్కడే భద్రత ఉంటుంది, అక్కడే శాంతి ఉంటుంది. అక్కడే ఇరుకు గోడలు విశాలమై రేపటి భావి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. సామాజిక బాధ్యత నుంచే సేవాతత్పరత, మానసిక వికాసం నుంచే మానవత్వం జనించాలి. దీనికి ఇల్లే సరైన పాఠశాల. మొక్కదశలోనే మానవత్వాన్ని, సేవాతత్పరతను పెంపొందించడానికి తల్లిదండ్రులే ఉపాధ్యాయులు కావాలి. చుట్టూ ఏం జరుగుతోంది? నా వంతు సాయం ఎంత వరకు చేయగలను? అనే భావనను వారి మెదళ్లలో నాటుకుపోయేలా చేయడం పెద్దల బాధ్యతే.  ఇంట్లో వున్న చెత్తను వీధి బయట పడేస్తే కేవలం మన ఇల్లే శుభ్రమౌతుంది. అదే  వీధి చివర్లో ఉన్న చెత్తకుండీ దాకా తీసుకెళ్లి పారబోస్తే? ఆ వీధి మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వీధిలో ఉన్న వారికి అసౌకర్యాన్ని దూరం చేయడం దగ్గర్నుంచే మొదలుపెట్టచ్చు. చేసే పనికి సామాజిక బాధ్యత జోడిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది పిల్లలకు బాల్యదశలో ఇంటి వద్ద నేర్పే పాఠాలుగా మారాలి.

చిన్న మార్గం...
సమాజసేవ అనగానే ‘డబ్బుతో ముడిపడి ఉంది, అది బాగా సంపన్నులు మాత్రమే చేసే పని అని, సాయం చేయాలంటే మన స్థాయి సరిపోదు’ అనే ఆలోచన సరికాదు. మీరలాంటి భావాలతో ఉంటే అది మీ పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. తనకు నిరుపయోగంగా మిగిలినవి, తోటివారికి  ఉపకరించేవి ఉంటే వాటిని పిల్లల చేతులమీదుగానే అవసరంలో ఉన్న వారికి అందజేయచ్చు. నేటి బాలలే రేపటి సంఘసేవకులు కావడానికి ఓ చిరు మార్గం చూపినట్టుంటుంది. స్కూళ్లు మొదలయ్యే నాటికి పిల్లలు వాడేసిన దుస్తులు, పుస్తకాలు బీదపిల్లలకు ఇప్పించవచ్చు. టీచర్లు తమకు నేర్పిన  విద్యని ఎవరికైనా చెప్పాలని విద్యార్థులు ఉబలాటపడుతుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకుని వారిచేత నిరుపేద పిల్లలకు చదువు చెప్పిస్తే ఆ కళ్లల్లో కనిపించే ఆనందం దేనితోను సరితూగదు. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులను చూసి ఆనందిస్తూ, వాటిని సరిదిద్దుతాం. అలాగే వారు జీవితంలో ఎదగడానికి, సమాజం గురించి అవగాహన కలగడానికి, చేతనైనంత సేవచేయడానికి పొరపాట్లను దిద్దుతూ మార్గనిర్దేశకం చేసేది తల్లిదండ్రులే. పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లా కావాలనుకునే విధంగా ఆదర్శంగా నిలవాలి. అలా చేయగలిగితే తల్లిదండ్రులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినట్టే.


చెప్పకుండా చెప్పే విషయాలు
పెద్దలు ఏ పని చేస్తే పిల్లలు అది చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అమ్మ వంట చేస్తే తామూ చేయాలని ఉబలాటపడే పిల్లలు, నాన్నలా మోటార్‌బైక్‌ నడపాలని ఉత్సాహపడతారు. వారికి మంచేదో, చెడేదో తెలియదు. ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇవేవీ పుస్తకాల్లో ఉండవు, చదివి నేర్చుకోవడానికి.  తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను ప్రాక్టికల్‌గా చూసి నేర్చుకుంటారు. తామూ పెద్దయ్యాక అలాగే అవ్వాలని కోరుకుంటారు.  
   
తండ్రి తన తల్లిని గౌరవిస్తే అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. అమ్మను ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకుంటాడు. దేశాన్ని కూడా కన్నతల్లిలా చూసుకోవాలన్న భావన పెరిగేది కూడా ఇక్కడే. ఇంటి నుంచే సమాజసేవ చేయాలన్న ఆలోచన పుడుతుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కూరగాయల తొక్కలు తీసుకెళ్లి మొక్కలకు వేయండి. దీనివల్ల పిల్లలు మొక్కలకు వేస్టేజ్‌ ఎరువుగా పనిచేస్తుందన్న మాట అని అర్థం చేసుకొని అదేవిధంగా చేస్తారు.  ట్యాప్‌ విప్పి పనులు చేయడం కాకుండా బకెట్లోనో, గిన్నెలోనో నీటిని పట్టి అవసరమైనంతే వాడుకోవాలి. ఇది చూసి పిల్లలు కూడా నీటి విలువ తెలుసుకుంటారు.
     
ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెడుతూ ఉంటే పిల్లలు కూడా అలా చేయడం అలవర్చుకుంటారు. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కరెంట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి వెళ్లాలి. అది చూసి పిల్లలకు కరెంట్‌ ఆదా చేయాలని తెలుస్తుంది.  పొట్టిగా అయిపోయిన దుస్తులు, చెప్పులు, షూస్, బ్యాగులు... మొదలైనవి బాగుచేసి పనివాళ్లకు ఇవ్వడం, లేదంటే పేదవాళ్లకు ఇవ్వడం చేయాలి. ఇది చూసి పిల్లలకు ‘లేనివాళ్లకు సహాయపడాలి’ అన్న ఆలోచన కలుగుతుంది.  పిక్నిక్, సినిమా, పార్కులకు వెళ్లినప్పుడు చాక్లెట్‌ రాపర్లు, ఐస్‌క్రీమ్‌ కప్పులు లాంటివి తప్పకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి.

పెద్దలను పిల్లలు అనుసరిస్తుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.బస్సులో వెళ్లినప్పుడు, ఏదైనా బిల్లు కడుతున్నప్పుడు వయసులో పెద్దవాళ్లు, అంగవికలురు, గర్భవతులు ఉంటే వారికి సీట్‌ ఇవ్వడం, దారి ఇవ్వడం వంటివి చేయాలి. పిల్లలకు అలాంటి వాళ్లకు హెల్ప్‌ చేయాలనే ఆలోచన కలుగుతుంది.అంగవైకల్యంతో ఎవరైనా బాధపడుతుంటే మనం వారి గురించి చులకనగా, జాలిగా మాట్లడం చేయకూడదు. వాళ్లని మనుషుల్లానే భావించి సరైన గౌరవం ఇస్తే పిల్లలు కూడా అదేవిధంగా గౌరవించడం నేర్చుకుంటారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement