కూతురు పరాయిదా? | special story to sakshi family | Sakshi
Sakshi News home page

కూతురు పరాయిదా?

Published Tue, May 19 2015 11:05 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కూతురు  పరాయిదా? - Sakshi

కూతురు పరాయిదా?

ఒక మొక్కను తీసి మరో చోట నాటిన తోటమాలి
దాని బతుకేదో అది బతుకుతుందిలే అని వదిలేస్తాడా?!
ఒకటికి వెయ్యిసార్లు సరి చూస్తాడు.
వేర్లకు నీళ్లు ఎంత అందాలో చూసి చూసి జాగ్రత్తపడతాడు.
ఆ మొక్క కొత్త ప్రదేశంలో నాటుకునేంతవరకు రక్షణగా ఉంటాడు.
మరి, ఇరవై ఏళ్లకు పైగా మన ఇంట పెరిగిన ఆడపిల్లను
ఓ ఇంటికిస్తే తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్త పడాలి?

   
మెట్టినింటిలో ఇమడక పుట్టినింటిలో గడవక
ఒక అమ్మాయి మరణానికి గురైన ఒక కథ...
ముందే కష్టం పసిగట్టి తల్లిదండ్రుల భరోసాతో
కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన మరో కూతురి కథ...
పెళ్లి చేసి పంపించేసినా... మన కూతురిని మనం
ఓ కంటకనిపెట్టి ఉండటం చాలా అవసరం. అది మన బిడ్డకు భరోసా ఇవ్వడమే కాకుండా ఎలాంటి అఘాయిత్యమూ జరగకుండా కాపాడుతుంది.

 
మన బిడ్డకు కూడా ఇలా అనిపించవచ్చు.

ఎప్పుడెప్పుడు కన్నవారిని చూస్తానా, అని వేగిరపడుతూ పుట్టింటి గుమ్మంలో అడుగుపెట్టింది పూర్ణ. అమ్మ ఎదురొచ్చి ‘బాగున్నావా పూర్ణా!’ అంటూ చేతిలో బ్యాగ్ అందుకుంది. మర్యాదతో కూడిన ఆ ఆహ్వానం ఏదో కొత్తగా అనిపించింది. చూడగానే అల్లుకుపోయే తోబుట్టువు‘హాయ్ అక్కా!’ అంటూ అమ్మ పక్కన చేరింది.
 
ఆ ‘దూరమే’దో కొత్తగా ఉంది.


‘ప్రయాణం బాగా జరిగిందా?!’ అని అడిగిన నాన్న ప్రశ్నలో ‘ఏ ఉపద్రవమూ లేదు కదా!’ అనే ధ్వని కొత్తగా వినిపించింది. అమ్మ, నాన్న, చెల్లి... ఇరవై ఏళ్లుగా వీళ్లతోనే... వీళ్లమధ్యే పెరిగాను కదా! మధ్యలో కొన్ని రోజులు... పెళ్లి పేరుతో అత్తవారింటికి వెళ్లొచ్చాను. అంతలోనే ఇంత మార్పేమిటి?! వీరి మధ్య ఈ ‘హుందాతనం’ కొత్తగా ఎప్పుడు చేరింది?!  పరాయి ఇంటికి వచ్చినట్టుగా... ఒక్కసారిగా ప్రయాణ అలసట రెట్టింపైనట్టుగా ఉందేమిటి?!  
     
‘గుమ్మంలోనే నిలబెట్టారేంటి?’ అంటూ అమ్మ లోపలికి దారితీసింది. ఆమెతో పాటూ అందరూ...  స్నానానికి బయల్దేరుతూ తన షెల్ఫ్ వైపు వెళితే... అక్కడన్నీ చెల్లి బట్టలే! తన పాత బట్టలు పనివాళ్లు అడిగితే ఇచ్చేసిందట అమ్మ, ఇక వాటి అవసరం ఏముందని...  నోటి వెంట వచ్చిన  నిట్టూర్పు.. చాలా చాలా కొత్తగా ఉంది. వెంట తెచ్చుకున్న సూట్‌కేస్ తెరవక తప్పలేదు.
     
బయటకు వస్తూనే వంటకాల ఘుమఘుమలు పాత ఆకలిని కొత్తగా నిద్రలేపాయి. ఒక్క కూర అదనంగా చేయమంటే ‘అప్పులు చేయాల్సిందే’ అని క్లాస్ పీకే అమ్మేనా ఇన్ని వంటలు చేసింది. అంటే, నేను ఈ ఇంటికి అతిథినా?! ఈ సందేహం కొత్తగా ఉంది. అమ్మ-నాన్నలు చూపులతోనే మాట్లాడుకునే మాటలు మరీ కొత్తగా ఉన్నాయి. రెండు రోజులైనా కాకముందే ‘ఎప్పుడెళుతున్నావమ్మా!’ అని అమ్మ అడిగిన మాటలు కొత్తగా ఉన్నాయి. ఈ దూరాన్ని ఎలా చెరిపేయడం?! జీవితకాల వేదనను ఎక్కడ దించడం?!
     
అప్పగింతల వేళ కన్నకూతురి చేతులను పాలలో ముంచి అత్తింటికి అందించే అమ్మానాన్న ఆలోచన చేయాల్సింది ఇక్కడే. పాలలాంటి మనసున్న తమ బిడ్డ బాగోగులను కడదాకా తామూ ఓ కంట కనిపెడుతూనే ఉంటామనే ‘హెచ్చరిక’ను అత్తింటికి అరణం ఇవ్వాలి. ‘మేం ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాం’ అని పుట్టింటి నుంచే భరోసాను అమ్మాయికి ఇవ్వాలి. వెళ్లబోతున్న కొత్త ప్రదేశంలో ఒంటరిగా వేళ్లూనేకునేందుకు కావల్సిన శక్తి కోసం ఆమె వెన్నంటే ఉండాలి.ఆడపిల్ల వచ్చీపోయే అతిథిగా కాదు. పుట్టినింటి వెలుగు. మెట్టినింటి కాంతి. ఇరు కుటుంబాలకూ ప్రేమను పంచే హృదయవారధి. మన హృదయాలను విశాలం చేసుకుంటే అంతటా సంతోషాల సుమాలు విరుస్తాయి.                    
- నిర్మలారెడ్డి
 
యధార్థ కథ:1

 
 
ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నా కూతురు...

 
మా అమ్మాయి లాస్యప్రియ. పెళ్లై ఏడాది గడవకముందే మా నుంచి దూరమైంది. అత్తింటి వారు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. చిన్ననాటి నుండి అందరిలోనూ చాలా ధైర్యస్తురాలు అని పేరు తెచ్చుకుంది. చదువులో చురుకుగా ఉండేది. ఎంబీఏ చేసి, ఉద్యోగం సంపాదించుకుంది. తను ఇష్టపడ్డ వ్యక్తితోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశాం. అబ్బాయికి సరైన ఉద్యోగం లేకపోయినా ఉన్నట్టుగా, ఆస్తిపాస్తులు భారీగా ఉన్నట్టు నమ్మించి పెళ్లి చేసుకున్నారు. కట్నం రూపంలో ఐదు లక్షల రూపాయల నగదు, కానుకలు అందజేశాం. ఈ నెల 2న మా అబ్బాయి పెళ్లి జరిగింది. ఆడపడుచుగా పది రోజుల ముందుగానే రమ్మని చెప్పాం. కానీ, అత్తింటివారు అన్న పెళ్లికి ఒక్క రోజు ముందు పంపించారు. పెళ్లి కాగానే ఇంకా లాంఛనాలు పూర్తి కాకముందే లాస్య అత్తింటి వారు వెళ్లిపోయారు. లాస్యనూ రమ్మని ఒత్తిడి చేశారు. కానీ, తను ఓ నాలుగు రోజులు ఉండి వస్తానని చెప్పింది. వాళ్లు వెళ్లిపోయి.. షిర్డీ వెళ్తున్నామని, టికెట్ బుక్‌చేశామని అర్జెంట్ రమ్మని ఫోన్ చేయడంతో తప్పక ఈ నెల 5న వెళ్లింది. అత్తింటికి వెళ్లిన తరువాత ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పారట. మరుసటి రోజు రాత్రి లాస్య ఆత్మహత్య చేసుకుందని, మాకు మధ్యాహ్నం చెప్పారు. కానీ, అది నిజం కాదు. అదే రోజు రాత్రి గొడవ జరిగి, చంపి ఉరి వేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారు. లాస్య అత్త బంగారు నగలు ఇమ్మంటోందని, భర్త కూడా అందుకు వత్తాసు పలుకుతున్నాడని తన స్నేహితురాలితో చెబుతూ ఉండేదట. పెళ్లయినప్పటి నుంచే అదనపు కట్నం కోసం వేధించేవారని తెలిసింది. ఈ విషయాలు మా లాస్య చనిపోయిన తర్వాతే మాకు తెలిసింది. మేం బాధపడతామని ఏనాడూ నా బిడ్డ ఈ విషయాన్ని మాకు తెలియనివ్వలేదు. అంత కష్టాన్ని గుండెలో పెట్టుకొని ఎలా తిరిగిందో... ముందే ఈ విషయాలు తెలిసి ఉంటే బంగారం పోయినా, బంగారం లాంటి నా బిడ్డను పోగొట్టుకునేదాన్ని కాదు. ఇన్నేళ్లు పెంచి, పెద్ద చేసి గౌరవంగా పెళ్లి చేసి పంపితే రాక్షసులు నా కూతురును పొట్టన పెట్టుకున్నారు. వారికి సరైన శిక్షపడాలి.
 - మోహిని (లాస్యప్రియ తల్లి )
 
 యధార్థ కథ:2
 
భరోసా ఇస్తే.. ఈ కూతురు కథ అవుతుంది... కొత్తజీవితం అవుతుంది...
 
పెళ్లై రెండేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టడం లేదని, పైగా కట్నం తక్కువ తెచ్చానని అత్తింటిలో రోజూ పోరు ఉండేది. ఏదో రూపంలో ఇంట్లో అందరూ తమ విసుగును చూపించేవారు. నా భర్తా తల్లిదండ్రుల మాటలే వినేవాడు. ప్రతి చిన్న విషయానికీ నాపై చేయి చేసుకునేవాడు. కొన్నాళ్లు పుట్టింట్లో చెప్పలేదు అమ్మానాన్న బాధపడతారని. కానీ, భరించలేక అమ్మనాన్నలకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఏడాదిగా పుట్టింట్లోనే ఉంటున్నా! ఉన్న ఊళ్లోనే చిన్న ఉద్యోగం చూసుకొని నా బతుకు నేను బతుకుతున్నా.
 - బబిత (అభ్యర్థన మేరకు పేరు మార్చాం), తూర్పుగోదావరి
 
సమస్యను ఎదుర్కొనే  సాయం తప్పనిసరి...

‘అమ్మాయిని చదివించాం, ఉద్యోగం చేస్తోంది. తనకు అన్నీ తెలుసు. తనే పరిష్కరించుకోగలదు అనే అభిప్రాయాన్ని తల్లిదండ్రుల మార్చుకోవాలి. ధైర్యంగా ఉండటం వేరు. సమస్యను ఎదుర్కోవడం వేరు. పెళ్లికి ముందు జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు. మంచి సంబంధం అని భారీగా ఖర్చు పెట్టి పెళ్ళి చేయడం కాదు, ముందుగానే అమ్మాయికి మ్యారేజ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. అత్తింటి వారికి అమ్మాయి గురించి అన్ని జాగ్రత్తలు చెప్పాలి. నీకేం భయం లేదు మేం ఉన్నామనే ధైర్యాన్ని అమ్మాయి పుట్టినింటివారు ఇవ్వాలి. అలాగని, అమ్మాయిలు ప్రతి చిన్న విషయాన్నీ పుట్టింటిలో చెప్పాలని కాదు. తట్టుకోలేనంత సమస్య వచ్చినప్పుడు అఘాయిత్యాలు చేసుకోకుండా దానిని ఎదుర్కోవడానికి పుట్టింటి సాయం తప్పనిసరిగా తీసుకోవాలి.

 - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement