పంచభూతాలతో... నేస్తమే... వాస్తు | five monsters buddies Architecture | Sakshi
Sakshi News home page

పంచభూతాలతో... నేస్తమే... వాస్తు

Published Tue, Mar 10 2015 11:32 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

five monsters buddies  Architecture

కూడలి
అవీ ఇవీ
 
‘‘పక్షులు ఆనందంగా జీవించడానికే ప్రకృతితో మమేకమై గూళ్లు కట్టుకుంటాయి, మరి మనిషెందుకు కాంక్రీట్ భవనాలనే నమ్ముకుని దుఃఖాన్ని కొనితెచ్చుకుంటున్నాడు? ’’ అని ప్రశ్నిస్తారు సుద్దాల సుధాకర్ తేజ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక వాస్తు సలహాదారుగా ఇటీవలే నియమితులైన సుధాకర్ తేజ... శ్రమ, ప్రకృతి... ఇవే నా వాస్తు విధానాలు అంటున్నారు.
 
-నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఙ్ట్చఛగ్రామం, పట్టణం, భవనం, పరిశ్రమ.. ఇవన్నీ వాస్తు నియమానుసారం ఉండి తీరాలా? లేకపోతే అభివృద్ధి అసాధ్యమా?


వాస్తు అంటే నివసించదగిన చోటు అని అర్థం. తినలేని తిండి అని ఆహారం గురించి ఎలా మాట్లాడుకుంటామో.. నివాసానికి యోగ్యం కాని ప్రాంతం, గృహం అని కూడా ఉంటాయి. ప్రభుత్వాధినేతలు చేసే ప్రతి ఆలోచన, తీసుకునే నిర్ణయాలు సాధారణ పౌరుడికి చేరాలంటే అతను కూర్చునే చోటు, ఉండే చోట తప్పక బాగుండాలి.  

నగరాలలో ఖాళీ స్థలం అనేదే ఉండదు. అలాంటప్పుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి?

జబ్బు చేస్తే వైద్యుడు రోజూ ఆపిల్ తినమంటాడు. అయితే కూలివాడు తినేవి పచ్చడి మెతుకులు. శరీరానికి పేదరికంతో సంబంధం లేదు. ఆరోగ్యకరమైన జీవనానికి ఆరోగ్యకరమైన పదార్థాలు కావాల్సిందే! చేతకాదు అంటే అనారోగ్యం ఇంకా బాధిస్తూనే ఉంటుంది. ఇంత ఆధునిక సమాజంలో కూడా పట్టణాలకన్నా పల్లెలే మనిషిని లీడ్ చేస్తున్నాయి అంటే కారణం... అక్కడ ఆప్యాయమైన ప్రకృతి కౌగిలి ఉంది. అందుకే మనిషి వందంతస్తుల భవనం కట్టినా, చెట్టు కిందకు వెళ్లడానికి ఉత్సుకత చూపుతాడు. పల్లెజీవనంలోని ఆ మాధుర్యాన్ని పట్టణానికి మళ్లించమంటాను. కుదరదు అంటారు. ఎందుకు కుదరదు? ప్రకృతి ఇచ్చిన మన శరీరాన్ని ప్రకృతితోనే బాగుపరుచుకోవాలి కదా!

కొన్ని గ్రామాలు పూర్తిగా నశించడం, కొన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధిలో ఉండటం చూస్తాం.. ఇక్కడా వాస్తు వర్తిస్తుందా?

ఎక్కడైనా సరే గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. ఉత్తర దక్షిణ దిక్కులను బ్యాలెన్స్ చేస్తూ నిర్మాణాలు చేపట్టాలి. గ్రామం ఏర్పడినప్పుడు కొండకోనల మధ్యన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. నైరుతిన చెరువు, ఈశాన్యం నుంచి వీచే గాలి.. ఇవన్నీ సరైన విధంగా అక్కడ నివసించే ప్రజానీకానికి అందుతూ ఉండాలి. అప్పుడే ఆ ప్రాంత ప్రగతి బాగుంటుంది. భూమి గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి, దిశలు ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తుంటారు. మన ముక్కు ముందుకు వుంది. మనతో పాటు మన ముక్కు వేరే చోటుకు ఎందుకు మారడం లేదు? ఇక్కడ దిశ తిరగడం లేదు. భూమి తిరుగుతుంది. ఉత్తరం-దక్షిణం ఈ రెండింటిని బట్టే మిగతా దిక్కులను చూసుకోవాలి. నీలోపల చైతన్యం ఎలా ఉందో బయట కూడా అదే చైతన్యం ఉండాలి.

వాస్తును విమర్శనాత్మకంగా చూడవలసిన అవసరం లేదా?

వేదాలలోనే వాస్తుశాస్త్రం గురించిన వివరణ ఉంది  అత్రి, జమదగ్ని... వంటి పద్దెనిమిది మంది మహర్షులు ఈ శాస్త్రంలో ఎంతో కృషి చేశారు. నేటి కన్నా నాడు అద్భుతమైన వాస్తును పాటించారు. కంపాస్ పుట్టని కాలంలోనే నిర్మాణాలలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. నేటికీ చెక్కుచెదరని ఎన్నోనిర్మాణాలను పరిశీలిస్తే ఈ నిజాలు మనకు అవగతమవుతాయి. వాటి చిన్న అంశ పట్టుకొని నేడు మనం నడుస్తున్నాం. అయితే దానిని కూడా విమర్శనాత్మకంగా చూస్తున్నాం. త్రేతాయుగంలోనే ఏడంతస్తుల భవనాలు ఉన్నట్టుగా తెలుసుకున్నాం. అద్భుతమైన లంకానగరం, ద్వాపరయుగంలో లక్కాగృహం, మయ సభ... వంటి అద్భుత నిర్మాణాల గురించి విన్నాం కదా!
     
వాస్తు తత్వం ఏమిటి?

 
మనిషి ఎన్నో కలలు కంటాడు. మంచి చదువు, అపారమైన సంపద, అందమైన కుటుంబజీవనం.. ఇలా ఎన్నో కలలు. ఆ కలలన్నింటికీ ప్రకృతి సహాయం తప్పనిసరి. ప్రకృతిలో ఏముందో తెలుసుకోవడానికి బయల్దేరినవారు సైంటిస్టులు అయ్యారు. ప్రకృతి జన్మనిచ్చిన తనలో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేసినవారు మహర్షులు అయ్యారు. ఆ మహర్షులే ఈ వాస్తును తెలియజేశారు. దుఃఖం ఎవరికీ ఇష్టం లేదు. అందరికీ ఆనందం కావాలి. ఆనందంగా ఉండాలంటే ఉండే చోటు మనకు అనుకూలంగా ఉండాలి. అదే వాస్తు శాస్త్రం చెబుతోంది.
     
వాస్తు వల్ల ప్రయోజనం ఏమిటి?

 
పది సంవత్సరాల వయసులో ఆడుకోలేనివాడు, ఇరవై ఏళ్ల వయసులో అందంగా లేనివాడు, నలభై ఏళ్ల వయసులో స్థిరపడనివాడు, యాభై ఏళ్ల వయసులో దానం చేయనివాడు, అరవై ఏళ్ల వయసులో సలహా ఇవ్వనివాడు శాపగ్రస్తుడనిపించుకుంటాడు. ప్రకృతి చట్ట ప్రకారం గృహనిర్మాణం చేసుకుంటే అలాంటి శాపాలనుంచి విముక్తి లభిస్తుంది. ఆనందం ప్రాప్తిస్తుంది.
     
పేరును బట్టి ఫలానా దిక్కే కలిసొస్తుందనే మాటలో నిజముందా?
 శాస్త్రాన్ని వ్యాపారకోణంలో తీసుకున్నవారు రకరకాలుగా చెబుతున్నారు. ప్రకృతికి ఆ భేదాలు లేవు. దేవుడు భూమిని సృష్టించాడు. మనిషి పరిమితులు ఏర్పరుచుకున్నాడు. పంచభూతాలు అందరికీ సమానమే! నేల, గాలి, నీరు.. ప్రధానంగా చూసుకోవాలి. కానీ, పేరును బట్టి కాదు. భారతదేశ భౌగోళిక పరిస్థితులను బట్టే వాస్తు! కూర్చుంటే డబ్బులు వచ్చి పడవు. శ్రమ తప్పనిసరి. అయితే ఆ శ్రమకు ప్రకృతి దోహదం చేయాలంటాను.
      
మన దగ్గర చైనీస్ వాస్తు కూడా బాగా ప్రభావం చూపుతోంది. ఆ ప్రాంత వాస్తు సిద్ధాంతాలు మనకూ ఉపకరిస్తాయా?
 
సూర్యుని ఎండ ఇంటి ముంగిట్లో పడాలి. ఆ కాంతి ప్రసరణ ఇంటిలోపలికి రావాలి. అంతేగాని గోడకు ఓ రంగేసి, లైట్ పెడితే.. ప్రయోజనం ఏముంటుంది? అద్భుతమైన వాస్తుజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే సృష్టిలోని ప్రాణికోటి జీవనాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ భారత, రామాయణాలు విరాజిల్లుతున్నాయి. ఎందుకు? అవి గుడిసెల్లోనుంచే అంటే ఆశ్రమాల్లో నుంచే పుట్టుకువచ్చాయి. మహా మేధావులు అనుకున్నవారంతా అరణ్యాల నుంచి వచ్చినవారే!  ప్రపంచమనే పిండానికి భారతదేశం బొడ్డుతాడు. వీటన్నింటి వెనక ప్రకృతి ఒడి ఉంది. నవమాసాలు మోసి కనేది అమ్మ, తొంైభై తొమ్మిదేళ్లు మోసేది ప్రకృతి. అలాంటప్పుడు ఆ ప్రకృతిని వీడితే మనిషికి జీవితం ఉంటుందా?
 ఫొటోలు: జి.రాజేశ్
 
ప్రతి నిర్మాణానికీ ఓ హృదయం ఉంటుంది
 
ఎన్నో నిర్మాణాలు  చూశాను. పతనమైనవాటినీ, బాగున్నవాటినీ గమనించాను. ప్రతీ నిర్మాణానికి ఓ హృదయం ఉంటుందని తెలుసుకున్నాను.  దాదాపు పాతికేళ్ల నా జీవనప్రయాణమే నాకు ఈ శాస్త్రం అబ్బడానికి ఉపకరించింది. ఇంకా ఉపకరిస్తూ వస్తోంది. నేడు చాలామంది వ్యాపారదృక్కోణంలో వాస్తును చూస్తున్నారే తప్ప ఈ శాస్త్రంలోని అద్భుతాలను తెలుసుకోలేకపోతున్నారు. మనకు కావల్సింది డబ్బులు కాదు.. జబ్బులు రాకుండా ఉండాలి. వాస్తు నిపుణుడు అలాంటి జ్ఞానాన్ని తనను నమ్ముకుని వచ్చినవారికి ఇవ్వాలే తప్ప గందరగోళానికి లోను చేయకూడదు.

రుషుల రుణం కొంతైనా తీర్చుకోవాలంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని కొంతమందికి పరిచయం చేయాలి. అందుకే వ్యక్తిగతంగా పరిశోధిస్తున్నాను. వాటిని వ్యాసాలుగా పొందుపరుస్తున్నాను. డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని, విద్యను అమ్ముకోకూడదన్నది నా అభిమతం. మహర్షులు ప్రసాదించిన జ్ఞానం పదిమందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. వ్యాపారంలో పడ్డాక విలువలు ఉండవు. వాస్తు బాగోలేదని దేవుడి బొమ్మ పెట్టినంత మాత్రాన పరిస్థితులు బాగుపడవు. శాస్త్రాన్ని ఉపయోగించుకో... దాని వల్ల కలిగే ఆనందకరమైన ఫలితాన్ని అనుభవించు. ఇదే నేను చెప్పేది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement