కొత్తగా... రెక్కలొచ్చెనా!
స్వప్నలిపి
మీరెప్పుడైనా రెక్కలతో గాల్లోకి ఎగురుతూ వెళ్లారా? మీరెప్పుడైనా రెక్కలతో కొండకోనలపై, మహా సముద్రాలపై ఎగురుతూ వెళ్లారా?! అయితే ఈ స్వప్న విశ్లేషణ మీ కోసమే. సందర్భాన్ని బట్టి, మన మానసిక స్థితిగతులను బట్టి ఈ కల అర్థం మారిపోతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అనుకూల జాబితాలోనో, ప్రతికూల జాబితాలోనో చేర్చలేం.
విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు, ఆ ఒత్తిడికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయి. సమస్య పరిష్కారం గురించి ఆలోచించి ఒత్తిడిని దూరం చేసుకోవ డానికి బదులు, పలాయనానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, సమస్య నుంచి పారిపోవాలనుకున్నప్పుడు ‘రెక్కల కల’ వస్తుంది. ఒంటరితనం బాగా ఎక్కువైనప్పుడు, ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, ఎప్పుడూ చేస్తున్న పనే చేస్తూ, ఎప్పుడూ ఉన్నచోటే ఉంటున్న క్రమంలో ఏర్పడే ఉత్సాహ రహిత స్థితిలోనూ ఇలాంటి కలలు వస్తాయి.
అనుకూల కోణం ఏమిటంటే, సృజనాత్మకంగా ఏదైనా విషయాన్ని ఆలోచించే వాళ్లకు ఇలాంటి కలలు వస్తుంటాయి. ‘వాస్తవం ఇది. కాని ఇది నాకు నచ్చడం లేదు. నేను ఇలా ఆశిస్తున్నాను. ఇది నిజం కాదని తెలుసు. అయినా ఇదే బాగుంది’ తరహాలో ఆలోచించేవాళ్లకు కూడా... రెక్కలొచ్చి ఆకాశంలో విహరించే కలలు వస్తుంటాయి.