శాశ్వత పరిష్కారం లేదా?
శాశ్వత పరిష్కారం లేదా?
Published Sat, Dec 3 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.5 అడుగులు, బరువు 42 కిలోలు. నాకు మూతి మీద, గడ్డం మీద పలచగా వెంట్రుకలు వస్తున్నాయి. షేవ్ చేసుకుంటే మరింత గరుగ్గా మారతాయని భయంగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా సూచించగలరా?
- దివ్య, పొద్దుటూరు
కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడుతాయి. మగ వారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్ హార్మోన్ కొందరి ఆడవారిలో కూడా అనేక కారణాల వల్ల ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల పెదవులపైన, గడ్డంమీద, కొందరిలో ఛాతిపైన, కాళ్లు, చేతులుపైన ఎక్కువగా వెంట్రుకలు వస్తాయి. అండాశయాలలో ఎక్కువగా నీటిబుడగలు, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ (పిసిఓడీ), అడ్రినల్ గ్రంథిలో కంతులు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి ఎన్నో సమస్యల వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడు తాయి. నీకు గల కారణాన్ని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి టెస్టోస్టిరాన్, డీహెచ్‌ఈఎస్ వంటి అవసరమైన హార్మోన్, రక్తపరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్ చేయించుకుని, కారణాన్ని బట్టి దీర్ఘకాలంగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది.
శరీరంలో ఉన్న హార్మోన్లని తగ్గించడానికి చికిత్స తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చే వెంట్రుకల సాంద్రత మెల్లగా తగ్గుతూ వస్తుంది. ముందు నించి వెంట్రుకలను తొలగించుకోవడానికి తాత్కాలిక పద్ధతులను పాటించవచ్చు. ఇప్పుడు ఆధునికంగా చేసే లేజర్ ట్రీట్‌మెంట్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యతను బట్టి వాటి సిట్టింగ్స్‌కు సమయం పడుతుంది. శాశ్వత అవాంఛిత రోమాల నివారణకు చాలా సమయం పడుతుంది. ఖర్చు అవుతుంది. కాబట్టి ఓపికతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో ఉన్న హార్మోన్స్‌ను నియంత్రణ చెయ్యకుండా కేవలం లేజర్ చికిత్స తీసుకోవడం వల్ల కొంత కాలం వెంట్రుకలు లేకపోయినా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నా వయసు 44 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 66 కిలోలు. మూడు నెలలుగా నాకు నెలసరి రాలేదు. మెనోపాజ్ అనుకున్నాను. రెండు రోజుల కిందటే మళ్లీ బ్లీడింగ్ మొదలైంది. బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
- జగదాంబ, అనకాపల్లి
మధ్యవయసు దాటిన తర్వాత సాధారణంగా పీరియడ్స్ సంవత్సరం పాటు రాకపోతే దానిని మెనోపాజ్‌గా పరిగణిస్తాము. కొందరిలో మెనోపాజ్ వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలు ఇంకా ముందు నుంచి కూడా శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతుంటాయి. వాటి అసమతుల్యత వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ వయసులో ఇది మామూలే కదా అని నిర్లక్ష్యం చెయ్య కూడదు. ఎందుకంటే ఈ వయసులో గర్భాశయంలో, అండాశయంలో కంతులు, సిస్ట్‌లు, క్యాన్సర్‌లు ఇంకా ఇతర సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఈ విషయంలో మూడు నెలల నుంచి బ్లీడింగ్ అవ్వకుండా, ఇప్పుడు ఎక్కువగా అవ్వడం వల్ల రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉండడం, కాళ్ళనొప్పులు, తిమ్మిర్లు వంటివి ఉండి ఉండవచ్చు. అలాగే మూడు నెలల నుంచి బ్లీడింగ్ కానప్పుడు కొందరిలో ఎండోమెట్రియం పొర మందంగా ఏర్పడి, అతి తర్వాత బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేటప్పుడు కొందరిలో పొత్తికడుపు, నడుం నొప్పి వస్తుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చెయ్యకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి బ్లీడింగ్ తగ్గడానికి మందులు వాడుకుంటూ, ఈ సమస్యకు గల కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. దీనికోసం కంప్లీట్ బ్లడ్‌కౌంట్, థైరాయిడ్ ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్, పాప్‌స్మియర్ వంటివి చేయించుకుంటే మంచిది. వీటిలో ఏ సమస్యా లేకపోతే మెనోపాజ్ ముందు వచ్చే మార్పులుగా అనుకుని, భయపడాల్సిన అవసరం లేదు.
బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ, రక్తహీనత ఉంటే సరైన పోషకాహారంతో పాటు ఐరన్‌మాత్రలు, విటమిన్స్, కాల్షియం మందులు వాడటం మంచిది. మీ ఎత్తుకి 55 కేజీల వరకు బరువు ఉండవచ్చు. మీరు 10 కేజీల అధిక బరువు ఉన్నారు. అధిక బరువు ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రావు. కాబట్టి బ్లీడింగ్ అరికట్టడానికి మందులు వాడుకుంటూ, బరువు తగ్గడానికి వాకింగ్, వ్యాయామాలు, పరిమితమైన పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.
Advertisement
Advertisement